– షిర్డిసాయి ఎక్ట్రికల్స్, మేఘా లాంటి కంపెనీలకే మళ్లీ అనుచిత లబ్ధి
– నేను టీడీపీలో చేరతానని చెప్పినా స్పందించలేదు
– జగన్ బాధితులను వేధించిన వారిని శిక్షించే బాధ్యత ఇవ్వమని కోరా
– నాకు భూమికి చెవులు ఆనించి వినడం తెలుసు
– ఇప్పుడు ఎన్టీఆర్ కాలం నాటి టీడీపీ లేదు
– ఆరునెలల్లో కొత్త పార్టీ పేరు ప్రకటిస్తా
– కూటమి పాలనకు 40 మార్కులే
– జగన్ బాధితులు కూటమి పనితీరుకు 70 మార్కులు వస్తాయనుకున్నారు
– జగన్ ఓ రాజకీయ వ్యాపారి.. విఫల విపక్షనేత
– హూకిల్డ్‌బాబాయ్ అని ఇప్పుడు బీజేపీ, సీబీఐని టీడీపీ ఎందుకు ప్రశ్నించదు?
– అమరావతిలో రెండో విడత భూసమీకరణ అవసరం లేదు
– మాస్టర్‌ప్లాన్ ఇచ్చి రైతులకు వదిలేయండి
– కోకాపేటలో మాస్టర్‌ప్లాన్‌తో రైతులే భూములు అమ్ముకున్నారు కదా?
– అదే విధానం అమరావతిలో ఎందుకు అమలుచేయరు?
– అమరావతిలో ఎయిర్‌పోర్టు అనవసరం
– గన్నవరం ఎయిర్‌పోర్టును ఎందుకు విస్తరించరు?
– మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుతో ‘మహానాడు’ ముఖాముఖి
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఐదేళ్లు ఏపీ ప్రజలను హడలెత్తించిన జగన్‌కు భయపడకుండా న్యాయపోరాటం చేసి.. ప్రజాక్షేతంలో ఉండి ప్రాజెక్టులు-ప్రభుత్వంలో జరుగుతున్న అవినీని ప్రశ్నిస్తున్న మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు.. మరో ఆరునెలల్లో కొత్త రాజకీయ పార్టీ పేరు ప్రకటిస్తానంటున్నారు. ఆయన కూటమి పాలనకు 40 మార్కులే ఇచ్చారు. కూటమికి వచ్చిన భారీ మెజారిటీ-ఓట్లు-సీట్లకు అనుగుణంగా, ప్రజల ఆశ-ఆకాంక్షల మేరకు పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాను రిటైరయిన తర్వాత టీడీపీలో చేరతానని, జగన్ బాధితులకు-జగన్ జమానాలోని అక్రమార్కులకు న్యాయపరమైన శిక్షలు విధించే బాధ్యత అప్పగించాలని కోరినా, టీడీపీ నుంచి స్పందన లేదన్నారు. జగన్ జమానాలో ఆర్ధికంగా లబ్ధిపొందిన షిర్టిసాయి ఎలక్ట్రికల్స్, మేఘాతోపాటు మళ్లీ రెండు మూడు కంపెనీలకే కూటమి ప్రభుత్వం అనుచిత లబ్థి చేకూరుస్తోందని ఆరోపించారు. టెండర్ల విషయంలో జగన్‌కు మించి, వాటికి మేలు చేస్తోందని దుయ్యబట్టారు. తాను పెట్టబోయే కొత్త పార్టీని ప్రజలే పోషించుకుంటారని.. తాను టీడీపీ సానుభూతిపరుల కోసమో, ఒక సామాజికవర్గం కోసమో పార్టీ పెట్టడం లేదని, అది తన అజెండా-లక్ష్యం కాదంటున్న ఏబీ వెంకటేశ్వరరావు.. ‘మహానాడు’తో అనేక అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు.
ప్ర: రిటైరయిన అధికారులు సహజంగా తర్వాత తమ కుటుంబసభ్యులతో కాలక్షేపం చేస్తారు. లేకపోతే పెద్ద కంపెనీల్లో చేరతారు. కానీ మీరు అందుకు భిన్నంగా రాజకీయ పార్టీ పెడతామంటున్నారు. కారణం ఏమిటి?
జ: జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, అంతకుముందు రాష్ట్ర విభజన, ఆ తర్వాత రాష్ర్టానికి జరుగుతున్న నష్టం చూసి ప్రజాజీవితంలో ఉండాలని నిర్ణయించుకున్నా. లేకపోతే వ్యాపారం చేసేవాడినేమో. దానికోసం కష్టపడి 3 నెలలు సాఫ్ట్‌వేర్ నేర్చుకున్నా. చేస్తే అది చేసే వాడిని. అంతేకానీ ఇంట్లో కూర్చోవాలని ఎప్పుడూ అనుకోలేదు. అంందుకే నేను నా తొలి చాయిస్‌గా టీడీపీని ఎంచుకున్నా.
కానీ వాళ్లు నన్ను తీసుకునే పరిస్థితి లేదు.
నేను వాళ్లకు పార్టీలో చేరతానని కూడా చెప్పా. జగన్ బాధితులకు న్యాయం చేయడంతోపాటు, జగన్ జమానాలో జరిగిన అవినీతిని వెలికితీసి బాధ్యులను న్యాయపరంగా శిక్షలు పడేలా చేసేందుకు నాకు బాధ్యత అప్పగించమని అడిగా. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు.
దానితో నేను ప్రత్యామ్నాయం చూసుకున్నా.
టీడీపీలో చేరితే ఆ చట్రంలో పనిచేయాలని తెలుసు. దానివల్ల లాభాలు, నష్టాలు కూడా ఉంటాయని కూడా తెలుసు. కానీ ఆ పార్టీకి బలం ఉంది. బలగం ఉంది. ప్రభుత్వం ఉంది. అన్నింటికంటే మించి ఎన్టీఆర్ వేసిన బలమైన పునాది ఉంది. అందుకే నేను టీడీపీలో చేరాలనున్నా. అయితే ఇప్పుడున్నది ఎన్టీఆర్ కాలం నాటి టీడీపీ కాకపోయినా, ఆయన వేసిన పునాది బలమైనది. కాబట్టి టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరు.
ప్ర: ఇప్పుడు అంతా బీజేపీలో చేరుతున్నారు కదా? అలాంటి ఆలోచన రాలేదా?
జ: బీజేపీలో చేరాలని ఎప్పుడూ అనుకోలేదు. నేను కూడా ఆ మేరకు వారిని సంప్రదించలేదు. వాళ్లూ నన్ను అడగలేదు.
ప్ర: మీరు పార్టీ పెడతామంటున్నారు. నిజంగా ఏపీలో పొలిటికల్ వ్యాక్యూమ్, స్పేస్ ఉందనుకుంటున్నారా?
జ: రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉంది. అసలు రాజకీయాల్లో ఎప్పుడూ కొత్తగా వచ్చిన వారికి స్పేస్ ఉంటుంది. రాజకీయ శూన్యత ఉందా లేదా అన్నది కొత్త పార్టీ గెలిచిన తర్వాత అర్ధమవుతుంది. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించి గెలిచిన తర్వాతనే కదా.. రాష్ట్రంలో పొలిటికల్ స్పేస్ ఉందని తెలిసింది. అందుకే వ్యాక్యూమ్ ఉందా లేదా అన్నది ప్రజలే నిర్ణయిస్తారు. ఏదైనా అంతే.
అయితే స్పష్టమైన అవగాహన, కార్యక్రమాలు, కార్యాచరణ, ప్రజాసమస్యలపై అవగాహన లేని వారు పార్టీలు పెట్టినా ఫిట్ కాలేరు. నాకు ఆ సమస్య లేదు. నేను ఏపీ రాజకీయాలను కొన్ని దశాబ్దాల నుంచి దగ్గర నుంచి పరిశీలిస్తున్నా.
ప్ర: ప్రజలకు దూరంగా ఉండే బ్యూరోక్రాట్లు రిటైరన తర్వాత పార్టీలు పెడితే ప్రజలు ఆమోదిస్తారా?
జ: బ్యూరోక్రాట్లు అందరూ ఒకేలా ఉండరు కదా? భూమికి చెవులు ఆనించి బతికిన వాడికి ప్రజల జీవనాడి తెలుస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి భూమికి చెవులు ఆనించి వినే లక్షణం ఉంది కాబట్టి నాకు ఆ సమస్య లేవు. రిటైర్డు బ్యూరోక్రాట్స్‌ను మీరు గంపగుత్తగా ఎత్తి అవతల పారేయడం మంచిది కాదు. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలంటారు కదా? అయినా కొత్తరక్తం ఎలా వస్తుంది? ఇప్పుడు విద్యార్ధి రాజకీయాలు లేవు. కాంట్రాక్టర్లు, ఎన్‌ఆర్‌ఐలు, రాజకీయ నాయకుల పిల్లలు, భార్యలే కదా వస్తున్నారు? అంటే పాత రక్తాలు పంచుకుని పుట్టినవారే కొత్తరక్తమా?
ప్ర: గతంలో రాజకీయ పార్టీ పెట్టిన వారికి ఎదురైన చేదు అనుభవాలు గుర్తించారా?
జ: గతంలో రాజకీయపార్టీలు పెట్టిన వారికి చేదు అనుభవాలున్నాయంటున్నారు. ఎవరికి చేదు అనుభవాలు? ప్రజలకు కాదు కదా? పార్టీ పెట్టిన వారికే కదా చేదు అనుభవం? మరి ఇక్కడ ప్రజలు నష్టపోయిందెక్కడ?
ఆరునెలల్లో కొత్త పార్టీ పేరు ప్రకటిస్తాం
కొత్త రాజకీయ పార్టీ ఈ ఏడాది ప్రధమార్ధంలో ప్రకటిస్తా. ఆ మేరకు కసరత్తు, ప్రణాళిక జరుగుతోంది. ప్రజలకు కావలసినవి ఏమిటి? రాష్ర్టానికి కావలసింది ఏమిటి? కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు, బడ్జెట్ నిర్వహణ, వృధా ఖర్చులు, కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు ఇలాంటి కీలక అంశాలపై ఆయా రంగాలకు చెందిన నిపుణులతో నిరంతరం చర్చిస్తున్నాం. వాటికి ప్రత్యామ్నాయాలు సూచిస్తూ మా మేనిఫెస్టోలో రూపొందిస్తాం. ఒకటి మాత్రం చెబుతున్నా. మేము ఆషామాషీగా రావడం లేదు. అది మాత్రం పక్కా.
ప్ర: మీ మద్దతుదారుల్లో ప్రధానంగా ఎక్కువ శాతం టీడీపీ అభిమానులు-సానుభూతిపరులు, కమ్మ సామాజికవర్గం వారే ఉంటారు కదా? మరి మీరు పార్టీ పెడితే టీడీపీ నష్టపోతుందన్న భావనతో మీకు టీడీపీ అభిమానులు మద్దతు ఇవ్వకపోవచ్చు కదా?
జ: పొలిటికల్ పార్టీ అనుకున్నప్పుడు, ప్రజల్లోకి వెళ్లాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ నా నియోజకవర్గమే. అంతా నా వాళ్లే. కేవలం టీడీపీ కార్యకర్తలు, కులానికి సంబంధించిన వాళ్లకే మాత్రమే అని అనుకున్నప్పుడు అసలు పార్టీ పెట్టడం, రాజకీయాల్లో ఉండటం అనవసరం. అది నా లక్ష్యం కాదు. నా అజెండా కాదు. నేను ఒక లక్ష్యంతో వచ్చినప్పుడు ఎవరైతే దాన్ని నమ్మి, నాతో వచ్చేవారంతా నా వారే. అందులో టీడీపీ వారుండవచ్చు. వైసీపీ వాళ్లూ ఉండవచ్చు, కమ్యూనిస్టులూ ఉండవచ్చు.
కూటమికి 40 మార్కులిస్తా!
కూటమికి 40 మార్కులు వేస్తా. నిజానికి కూటమికి వచ్చిన భారీ మెజారిటీ, ఓట్లు, సీట్లు ఇచ్చిన ప్రజల ఆశలు-ఆకాంక్షలు, పార్టీ కోసం కష్టపడిన వివిధ వర్గాలు, జగన్ బాధిత వర్గాలు వేసే మార్కులు 70 వరకూ ఉంటుందనుకున్నా. నేనూ అంతే ఆశించా. కానీ పాసు మార్కుల వరకూ వేయవచ్చు. దానికి కారణాలు చూసుకుంటే.. అవినీతి, బడ్జెట్ నిర్వహణ, పరిపాలన చక్కదిద్దే విషయంలో జగన్ పాలన సమయంలో జరిగిన అక్రమాలకు బాధ్యులైన వారికి న్యాయపరమైన శిక్షలు వేయించకపోవడం, ప్రాధాన్యతలు లేకపోవడం, జగన్ ప్రభుత్వంలో ఆర్ధికంగా లబ్ధి పొందిన వారికే మళ్లీ పట్టం కట్టడం వంటి అంశాల్లో కూటమి విఫలమయిందనే చెప్పాలి. దీనికి కారణాలేమిటని వారే ఆత్మపరిశీలన చేసుకోవాలి.
ప్ర: పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇచ్చి మీకు న్యాయం చేసినా ఆ పదవి తీసుకోలేదన్న ప్రచారంలో నిజమెంత?
జ: నాకు న్యాయం చేయమని నేను అడిగానా? అయినా నాకు ఒకరు న్యాయం చేయడం ఏమిటి? నేను ఆ పదవి ఎప్పుడూ ఆశించలేదు. జగన్ అనే రాక్షసుడిని తరిమేసేందుకు సమిధలైన బాధితులకు న్యాయం చేయమని, అందుకు ఏదైనా బాధ్యత అప్పగించమని మాత్రమే నేను అడిగా తప్ప, నాకు న్యాయం చేయమని అడగలేదే?
ప్ర: రాజకీయపార్టీ అంటే డబ్బుతో కూడిన వ్యవహారం. మరి మీకు డబ్బు ఎక్కడనుంచి వస్తుంది? వందల కోట్ల రూపాయలు, యంత్రాంగం ఉన్న ఇతర పార్టీలతో మీరు ఎలా పోటీ పడతారు?
జ: నిజమే. కానీ నేను ఈ విషయంలో ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నా. నేను ప్రజల కోసమే రాజకీయాల్లోకి వస్తున్నా. వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడేందుకు వస్తున్నా. కాబట్టి ఎన్నికల ఖర్చు కోసం వారినే విరాళాలు అడుగుతాం. ప్రజలే మా పార్టీని పోషించుకుంటారు.
హూ కిల్డ్ బాబాయ్ అని ఇప్పుడు బీజేపీని అడగాలి
అప్పట్లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత హూ కిల్డ్ బాబాయ్ అని టీడీపీ నిలదీసింది. భారీగా ప్రచారం చేసింది. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది. అందులో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది. మరి హూ కిల్డ్ బాబాయ్ అని బీజేపీని అడగాలి. సీబీఐ విచారణ ఏమయిందని అడగాలి కదా?
ప్రతిపక్షపాత్రకు జగన్ అనర్హుడు.. రాజకీయ వ్యాపారి!
జగన్ ప్రతిపక్షపాత్రకు అనర్హుడు. ప్రజల సమస్యలపై గళం విప్పి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ఆయన, అసెంబ్లీకి వెళ్లకపోవడం క్షమార్హం కాదు. అసలు ఇప్పటిదాకా జగన్ ప్రజల సమస్యలపై నిలదీసింది లేదు. సహజంగా ప్రజలు ప్రతిపక్షం నుంచి చాలా ఆశిస్తారు. తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని కోరుకుంటారు. ప్రతిపక్షం కూడా జనాలను మెప్పించేంచుకు ప్రభుత్వ అవినీతిని వెలికితీసి, పోరాడుతుంది. కానీ జగన్ ఈ రెండేళ్లలో బనకచర్ల, షిర్డిసాయి ఎలక్ట్రికల్, మేఘా ఇంకా ఇతర కంపెనీలకు ప్రభుత్వ అనుచిత లబ్థిపై మౌనంగా ఉన్నారు. ఎందుకంటే జగన్ ఫక్తు రాజకీయ వ్యాపారి కాబట్టి! గత ప్రభుత్వంలో ఆ కంపెనీలకు ఆర్ధికంగా లబ్ది చేకూర్చించింది ఆయనే కాబట్టి!!
అందుకే వాటిపై జగన్ గానీ, వైసీపీ గానీ మాట్లాడదు. ఇక ప్రభుత్వాన్ని అడిగేదెవరు? ప్రభుత్వానికీ కావలసింది అదే కదా? ఇలాంటి ప్రతిపక్షం ఉంటే ప్రభుత్వానికీ ఏం ఇబ్బంది ఉంటుంది? ఇప్పుడు రాజకీయాలు వ్యాపారాలయిపోయాయి. ఈ విషయంలో ఏ ఒక్క పార్టీ పవిత్రురాలు కాదన్నది జనాభిప్రాయం.
జగన్ హయాంలో వైసీపీ దాష్టీకాలకు బలైన వారికి భరోసా ఇచ్చే కార్యక్రమం, అటు కూటమి ప్రభుత్వం కూడా చేయడం లేదు. అసలు అలాంటి ఆలోచన, ప్రణాళిక కూడా వారికి ఉన్నట్లు కనిపించడం లేదు. ఇది నా ఒక్కరి అభిప్రాయమే కాదు. ఆస్తులు, కుటుంబాలు పోగొట్టుకున్న జగన్ బాధితులూ అదే ఫీలవుతున్నారు.
ప్ర: బనకచర్లపై మీ పోరాటం ఎంతవరకూ వచ్చింది?
జ: బనకచర్లపై ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి తగ్గింది. అంతవరకూ సంతోషం. కానీ విద్యుత్, ఇరిగేషన్ ప్రాజెక్టు కాంట్రాక్టుల విషయంలో షిర్డిసాయి ఎలక్ట్రికల్స్, మేఘా వంటి రెండు మూడు కంపెనీలకే లబ్ధి చే కూర్చి, మిగిలిన వారిని టెండరు వేసేందుకు వీలులేకుండా నిబంధనలు మార్చి, గతంలో కంటే ఎక్కువ లబ్ధి చేకూర్చిపెడుతోంది. కూటమి ప్రభుత్వం కేవలం జగన్ హయాంలో ఆర్థికంగా లబ్థి పొందిన కంపెనీలనే మళ్లీ పోషిస్తోంది. దానికోసం జగన్ ప్రభుత్వం అనుసరించిన అడ్డదారి, మోసపూరితమైన విధానాలు, ఎత్తుగడనే అనుసరిస్తోంది. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే. ఇది దారుణం.
అమరావతిలో రెండో విడత భూ సమీకరణ అసంబద్ధం
అమరావతిలో రెండో విడత భూ సమీకరణ అసంబద్ధం, అహేతుకం. దీన్ని రాష్ట్ర ప్రజలు సమర్ధించరు. ప్రభుత్వం తాను ఎందుకు భూ సమీకరణ చేస్తున్నానో రైతులకు ఇంతవరకూ చెప్పలేదు. ఎన్నికల ముందు కూడా రెండో విడత భూ సమీకరణ చేస్తానని చెప్పలేదే? ఒకవేళ అమరావతి రైతులు రెండో విడత భూ సమీకరణలో భాగస్వాములయితే.. ఆ తర్వాత జరిగే నష్టానికి, ఎదురయ్యే సమస్యలకు రాష్ట్ర ప్రజలు బాధ్యత వహించరు. అది పూర్తిగా భూములు ఇచ్చే రైతులదే బాధ్యత.
అసలు ప్రభుత్వమే భూ సేకరణ-సమీకరణ ఎందుకు చేయాలి? మాస్టర్‌ప్లాన్ ఇస్తే రైతులే భూములు అమ్ముకుంటారు కదా? హైదరాబాద్ కోకాపేటలో ప్రభుత్వం తన భూములేమీ అమ్మలేదు కదా? అసలక్కడ అంతా ప్రైవేటు భూమే కదా ఉంది? తెలంగాణ ప్రభుత్వం కేవలం మాస్టర్‌ప్లాన్ ఇస్తే రైతులే వాటిని అమ్ముకున్నారు. గతంలో హైటెక్ సిటీ దగ్గర మాత్రం ప్రభుత్వ భూముల్లోనే కంపెనీలు నిర్మాణాలు, కార్యకలాపాలు జరిగాయి. కానీ కోకాపేటలో మాత్రం మాస్టర్‌ప్లాన్ ఇచ్చిన తర్వాత రైతులే అమ్ముకున్నారు. మరి అక్కడ ఎలా అభివృద్ధి చెందింది? అమరావతిలో కూడా ఆ పని ఎందుకు చేయరు? అమరావతి ఫస్ట్ పేజ్‌లో మీరై ఏమైనా చేయండి. కానీ సెకండ్ ఫేజ్‌లో మాత్రం మాస్టర్‌ప్లాన్ వచ్చి వదిలేయండి. అసలు ప్రభుత్వమే భూ సమీకరణ ఎందుకు చేయాలి? ఇప్పుడు అమరావతిలో మళ్లీ 50 వేల ఎకరాలు అవసరం లేదు. ఓఆర్‌ఆర్ కనెక్టివిటీ, గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణ చేసి, మాస్టర్‌ప్లాన్ ఇస్తే సరిపోతుంది.
ఇప్పుడు అమరావతిలో ఎయిర్‌పోర్టు ఎందుకు? దానివల్ల ఉపయోగం ఏమిటి? అసలు అందుబాటులో ఉన్న గన్నవరం ఎయిర్‌పోర్టును విస్తరించకుండా, అమరావతిలో ఎయిర్‌పోర్టు పెట్టాలనుకోవడం అహేతుకం. గన్నవరం పక్కన వందల ఎకరాలున్నాయి. కావాలంటే వాటిని తీసుకోవచ్చు కదా?!
ప్ర: మీ రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇంకా రాలేదన్నారు. దాని పరిస్థితి ఏమిటి?
జ: జగన్ నియంతృత్వాన్ని ఎదిరించినందుకు, ప్రశ్నించినందుకు ఆ ప్రభుత్వం నాకు జీతం ఇవ్వలేదు. కోర్టు చెప్పినా లెక్కచేయలేదు. కాగితాలు పెట్టినా ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ నా రిటైర్‌మెంట్ బెన్‌ఫిట్స్ రాలేదని మీరు మొన్నామధ్య రాశారు. తర్వాత నా బకాయిలు అణాపైసలతో సహా విడుదల చేసింది. అందుకు మీకు థ్యాంక్స్!