– 15 మందికి తీవ్ర అస్వస్థత?
– ముగ్గురి పరిస్థితి సీరియస్?
– వారికి మంత్రి గారి సొంత ఆసుపత్రిలో చికిత్స?
– మరికొందరిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలింపు
– ఘటన జరిగి నాలుగురోజులయినా అంతా రహస్యం
– ‘మీడియా మేనేజ్‌మెంట్’తో పత్రికలు-చానెళ్లలో కనిపించని వార్త
– రెండు ప్రధాన పత్రికల్లో నాలుగులైన్ల వార్తతో సరి
– కర్నూలు పోలీసులకూ తెలియదట
– ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, పీసీబీ అధికారులకూ తెలియదట
– కంపెనీలోకి మీడియా నో ఎంట్రీ
– ధర్నా చేసేందుకు వెళ్లిన టీడీపీ నేత విష్థుని నిలువరించిన పోలీసులు
– ఆ ఫ్యాక్టరీ వైపు వెళ్లాలంటే పరిశ్రమ, పీసీబీ, ఫ్యాక్టరీస్ అధికారులకు భయమట
– ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ ఫ్యాక్టరీ జోలికివెళ్లరట
– తాజా ఘటనపై పెదవి విప్పని వైసీపీ, వామపక్షాలు
– బాధితుల పరిస్థితి ప్రశ్నార్ధకం
( మార్తి సుబ్రహ్మణ్యం)
అదో రాయలసీమ మంత్రి గారి ప్యాక్టరీ. కెమికల్ ఉత్పత్తి చేసే ఓ భారీ పరిశ్రమ. అది దశాబ్దాల తరబడి సదరు మంత్రి గారి కుటుంబ ఏలుబడిలో ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా బేఫికర్. వారి ఫ్యాక్టరీ జోలికి వెళ్లేందుకు ఎవరూ సాహసించరు. కారణం.. డబ్బు.. పలుకుబడి.. అధికారం. అదే వారికి శ్రీరామరక్ష. అవే ఆ ఫ్యాక్టరీని కంటికిరెప్పగా కాపాడుతున్నాయట. ఇప్పుడూ అదే జరిగింది.
నాలుగురోజుల క్రితం మంత్రి గారి ఫ్యాక్టరీలో గ్యాస్ లీకయి 15 మంది అస్వస్థత పాలయి, ముగ్గురికి సీరియస్‌గా ఉందన్న వార్త ఆలస్యంగా ‘గాలి’లోకి వచ్చిన విషయం.. నాలుగురోజుల రోజుల తర్వాత కూడా పీసీబీ, ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, పోలీసులకు తెలియదట. ఇది నిజమా? నటనా? భయమా? బేరమా.. కర్నూలు బుర్జుకే ఎరుక?
కర్నూలుకు సమీపంలో రాయలసీమకు చెందిన మంత్రి గారి కుటుంబానికి ఒఒక కెమికల్ కంపెనీ కొన్నేళ్ల నుంచి నడుస్తోంది. దానిపై వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు, పర్యావరణ వేత్తలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు.
సహజంగా అనకాపల్లి, విశాఖ కాకినాడ, ఏలూరు వంటి పారిశ్రామిక ప్రాంతాల్లోని ఫ్యాక్టరీలో జరిగే నేరాలు-ఘోరాలు కొన్ని గంటల్లోనే వెలుగుచూస్తాయి. బాధితుల మీడియా విజువల్స్ ప్రసారం అవుతుంటాయి. ఘటనపై వామపక్ష పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు వెంటనే గళం విప్పి, నష్ట పరిహారం డిమాండ్ చేస్తుంటాయి.
కానీ మంత్రి గారి ఫ్యాక్టరీ అందుకు పూర్తి భిన్నం. అసలు మంత్రి గారి ప్యాక్టరీలోకి వెళ్లి తనిఖీ చేసే దమ్ము, ధైర్యం ఏ ప్రభుత్వాధికారికి ఉండదు. చూసినట్లు, అంతా బాగున్నట్లు సంతగించి భుజం తడతారంతేనట! కారణం.. ‘మామూలే’! అంతేనా? ప్రమాదం జరిగితే లోపలికి మీడియాను అనుమతించరు. పోనీ ఎంతమంది గాయపడ్డారో చెప్పరు. ప్రభుత్వాసుపత్రికి తీసే వెళ్లే ప్రక్రియ కూడా పూర్తి రహస్యం.
గత నాలుగురోజుల నాడు జరిగిన గ్యాస్ లీక్ ఘటనలోనూ అదే జరిగింది. గ్యాస్ లీకయి 15 మంది కార్మికులు ఊపిరి అందక తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, మరో ముగ్గురు కార్మికుల పరిస్థితి సీరియస్‌గా ఉందన్న వార్తలు బయటకు పొక్కాయి.
మరి దీనిపై అటు ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారి, పీసీబీ అధికారి, పరిశ్రమల అధికారి, స్థానిక పోలీసులూ స్పందించాలి కదా? ఫ్యాక్టరీలో తనిఖీ నిర్వహించి లోపం ఎక్కడో గుర్తించి నివేదిక ఇవ్వాలి కదా? ఆ సందర్భంలో ఘటనకు సంబంధించిన ఫొటోలు తీసి ఉన్నతాధికారులకు నివేదించాలి కదా? జిల్లా కలెక్టర్ వీటిని పర్యవేక్షించాలి కదా? ఫ్యాక్టరీలో ఏం జరిగిందో మీడియాకు కనీసం నోట్ విడుదల చేయాలి కదా?.. ఇదే కదా సంప్రదాయం?!
కానీ చిత్రంగా.. అంతకంటే విచిత్రంగా.. అసలు ఫ్యాక్టరీలో ఏం జరిగిందో వారికే తెలియకపోవడం! అవునా? ఎప్పుడు? మేం విచారించి చెబుతాం- ఇదీ పోలీసు, ఫ్యాక్టరీస్, పీసీబీ, పరిశ్రమ అధికారుల నుంచి వచ్చిన విచిత్ర జవాబు.
సరే.. అధికారులంటే మామూళ్ల మత్తుతోనో.. మొహమాటంతోనో.. ఒత్తిళ్లతోనో నిద్ర నటిస్తున్నారనుకుందాం. కానీ ప్రజల కోసమంటూ పెద్ద పెద్ద ట్యాగ్ లైన్లు పెట్టుకుని తిరిగే మీడియా మోతబరులకు.. మంత్రి గారి ప్యాక్టరీలో నాలుగురోజుల క్రితం జరిగిన ఘటన, కనీసం ‘ఆలస్యం’గానయినా వెలుగులోకి తెచ్చే ధైర్యం చేయకపోవడమే విచిత్రం. తెలుగు రాష్ల్రాల్లో అతి పెద్ద టీవీ చానెళ్లు, పెద్ద పత్రికల్లో కూడా.. మంత్రి గారి ప్యాక్టరీలో జరిగిన గ్యాస్ లీక్ వార్త గానీ, దానిపై కథనం గానీ రాకపోవడమే విచిత్రం.
‘‘ మీకేం మీరు చెబుతారు. వాళ్లకు వ్యతిరేకంగా వార్తలు రాసే పరిస్థితి ఇక్కడ లేదు. గేటు దగ్గరే మమ్మల్ని ఆపేస్తారు. ఒకవేళ ధైర్యం చేసి వార్తలు రాసి పంపినా పైవాళ్లు వాటిని వేయరు. మధ్యలో మేం బలిపశువులవ్వాలి. ఈ ఫ్యాక్టరీలో జరిగేవన్నీ ఫ్యాక్టరీస్, పీసీబీ, పరిశ్రమలు, లోకల్ పోలీసులకు తెలుసు. కానీ ఎవరూ వారిపై చర్యలు తీసుకోలేరు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వారిదే రాజ్యం. ఇప్పుడు లోపల ఘటన జరిగితే కొందరిని ప్రభుత్వాసుపత్రికి, మరికొందరిని వాళ్ల సొంత ఆసుపత్రికి తీసుకువెళ్లారంటున్నారు. వాళ్లు ఎంతమందో ఇప్పటికీ ఎవరికి తెలియదు.
ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించారో లేదో కూడా తెలియదు. అంతా రహస్యం. ఏ అధికారులను అడిగినా అది చిన్న సంఘటనే. ఎవరికీ ఏమీ కాలేదని తేలిగ్గా తీసుకుంటున్నార’’ ని స్థానిక మీడియా ప్రతినిధులు తమ నిస్సహాయత వ్యక్తం చేశారు.
సరే.. అధికారులు, మీడియా అంటే మామూళ్ల మత్తులో పడి, అధికారానికి భయపడి మౌనంగా ఉన్నారనుకుందాం. కానీ ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ, వామపక్ష పార్టీలు, వాటి అనుబంధ కార్మిక సంఘాలు ఏమైనట్లు అన్నదే ప్రశ్న. మంత్రి గారి ఫ్యాక్టరీలో గ్యాస్ లీకయి.. కార్మికులు అస్వస్థతకు గురైన విషయం వారికి నాలుగురోజులయినా తెలియకపోవడమే ఆశ్చర్యం.
సహజంగా అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన వ్యవహారాలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ డేగకన్ను వేస్తుంటుంది. ఎక్కడ చిన్న అవకాశం వచ్చినా భూమి- ఆకాశాన్ని ఏకం చేసి గత్తర చేసి, సదరు అధికార పార్టీ నేతను రోడ్డున నిలబెడుతుంది. కానీ విచిత్రంగా కర్నూలు జిల్లాలో.. అధికార-ప్రతిపక్ష పార్టీలు, తెరచాటు బంధం కొనసాగిస్తున్నారన్న ప్రచారాన్ని, మంత్రి గారి ప్యాక్టరీలో జరిగిన గ్యాస్ లీక్ ఘటన నిజం చేస్తోందన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
అయితే మంత్రి గారి ఫ్యాక్టరీలో ఏం జరిగిందో జిల్లా అధికారులకు తెలియకపోయినా.. జరిగిన ఘటనలో యాజమాన్య వైఫల్యానికి నిరసనగా ధర్నా చేసేందుకు, టీడీపీ నేత విష్డు ఫ్యాక్టరీ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారట. ఆ విషయం తెలిసిన పోలీసులు ఆయనను బ్రతిమిలాడి.. మీరు వెళ్తే గొడవ పెద్దది అవుతుంది. పై నుంచి ఆదేశాలున్నాయి. మీరు బయటకు వెళ్లవద్దని’ బుజ్జగించినట్లు సమాచారం. అంటే మంత్రి గారి ప్యాక్టరీలో ఏం జరిగిందో జిల్లా ఫ్యాక్టరీస్, పీసీబీ, పరిశ్రమలు, పోలీసులకు తెలియని విషయం.. ఒక నాయకుడికి తెలిసిందన్నమాట.
కాగా మంత్రి గారి ఫ్యాక్టరీలో జరిగిన గ్యాస్ లీక్ ఘటనపై ఫ్యాక్టరీస్, పీసీబీ, పోలీసు అధికారులు ఏం నివేదిక ఇస్తారు? దానిపై చర్యలు తీసుకుంటారా? లేదా అన్నది చూడాలి. నిజానికి మంత్రి గారి ఇలాకాలోకి మరొకరు ఎంటరయితే ఆయనకు నచ్చదట. మరి ఆయన ఫ్యాక్టరీలోకి అధికారులు ఎంటరయి, ఫ్యాక్టరీని పరిశీలించి నివేదిక ఇచ్చే ధైర్యం చేస్తారా? లేదో చూడాలి.
మంత్రి గారి ప్యాక్టరీలో జరిగిన గ్యాస్ లీక్ ఘటనలో ఎవరూ మృతి చెందలేదు కాబట్టి పెను ప్రమాదం తప్పింది. కానీ దురదృష్టవశాత్తూ ఏవైనా మరణాలు సంభవిస్తే, అప్పుడూ ఇలాగే నిజాలను సమాధి చేసేవారా? అన్నదే ప్రశ్న.