ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గత ఆరేడు సంవత్సరాలుగా వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రం గానే సాగుతున్నాయి. . ఆయన అధికారం లో ఉన్నప్పుడు ఆయనే రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువు. తెలుగు దేశం, పవన్ కళ్యాణ్ విడి విడి గానో… ఉమ్మడి గానో జగనిజం పై వీలున్నప్పుడల్లా విరుచుకు పడుతూ వచ్చారు.
జగన్ విధానాలు, పద్ధతులు, ఆయన మైండ్ సెట్, వ్యవహార శైలిని వారు జనం లోకి విస్తృతం గా తీసుకెళ్లారు. ఫ్యాక్షనిస్ట్ అన్నారు. అటువంటి వ్యక్తి రాజకీయాలకు అర్హుడు కాదు అన్నారు. రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తున్నాడు అన్నారు. లోకేష్ కూడా గళం విప్పారు. కుప్పం నుంచి తుని దాకా పాదయాత్ర చేశారు.జగన్ పై విమర్శల జడివానే లోకేష్ కురిపించారు ఆయనలో ఇంత ఫైర్ ఉందా అనిపించారు లోకేష్.
బీజేపీ లో సత్యకుమార్ లాంటి ఒకరిద్దరు నేతలు జగనిజం పై రాజీ లేని ధోరణి లో నిప్పులు కురిపించారు. మొత్తం మీద కూటమి అదృష్టం బాగుండో…., రాష్ట్రం అదృష్టం బాగుండో…. జగన్ కు ప్రజలు ఓటు వేయలేదు.
జగన్ పార్టీ నేతలకు ప్రజలు ‘ అంతకు… అంతా’ చేసి, బదులు తీర్చుకున్నారు. ఫలితం గా జగన్ అధికారం కోల్పోయారు. వైసీపీ స్థానం లోకి కూటమి పార్టీలు అధికారం లోకి వచ్చాయి. ప్రజలకు నవంబర్ లో రావలసిన ఉన్న దీపావళి జూన్ లోనే వచ్చింది. .. వైసీపీ కి వ్యతిరేకం గా ఓటేసిన జనం ఒక్కటంటే ఒక్కటే కోరుకున్నారు. జస్ట్ వన్ రిక్వెస్ట్. వన్ డిమాండ్. ‘వారి బారి నుంచి మమ్మల్ని కాపాడండి ‘ అనేదే వారి ఏకైక విన్నపం. ఏకైక డిమాండ్.
ప్రజల ఆగ్రహవేశాలు, ఎన్నికల ముందు కూటమి నేతలు చేసిన సింహగర్జనతో వైసీపీయులు కొంచెం గతుక్కుమన్నారు. ఎక్కడా అలికిడి లేదు. తోకలన్నీ శుభ్రం గా లోపలికి ముడిచి, కిక్కురుమనకుండా ఎవరి కలుగుల్లో వారు దూరేశారా అనిపించింది. ఎవరూ పీకే వారు లేక, కొడాలి నాని వంటి పై ఎక్కడ పడితే అక్కడ గడ్డి దుబ్బుల్లా పెరిగిపోయాయి. ” రాముడు మంచి బాలుడు ” అన్నట్టుగా వ్యవహరించడం మొదలు పెట్టారు.
“ఓటర్లు ఒకటి తలిస్తే… చంద్రన్న ఒకటి తలిచారు…” అన్నట్టుగా, తన సుదీర్ఘ రాజకీయ జీవితం లో నాలుగోసారి లభించిన ఓ గొప్ప అవకాశాన్ని…. ప్రతీకారానికి కాకుండా… రాష్ట్రాభివృద్ధికి, పెట్టుబడుల ఆకర్షణకు, ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం తో…. వైసీపీయులుఊపిరి పీల్చుకున్నారు. తనకు వైసీపీ పని పట్టడం కంటే, రాష్ట్రం… భావి తరాలు, అభివృద్ధి ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెగేసి చెప్పారు. దాంతో, మెల్లగా కలుగుల్లోంచి బెక బెక మంటూ వైసీపీయులు రోడ్లమీదకు రావడం మొదలు పెట్టారు.
టిర్ర్… టిర్ర్…టిర్ర్… టిర్ర్….
టిర్ర్… టిర్ర్… టిర్ర్… టిర్ర్…
కన్ను మూసి తెరిచేంతలో ఓ ఏడాదిన్నర సమయం తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. ఇటు, కూటమి నేతలు అభివృద్ధి… పెట్టుబడులు, సూపర్ సిక్స్, అమరావతి, పోలవరం, సుపరిపాలన వంటి వాటిమీదపడిపోతే ; అటు జగన్, ఆయన బృందం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, కూటమి మీద పడి పోతున్నారు. అప్పుడూ జగనే రాజకీయాలకు కేంద్ర బిందువు ఐతే ; ఇప్పుడూ ఆయనే కేంద్రబిందువుగా ఉన్నారు.
ఇప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అంతే! అదంతా అబద్దం అని ముఖ్యమంత్రి, మంత్రులు, మీడియా లోని జగన్ విధానాల వ్యతిరేక మీడియా వారు, యూట్యూబర్లు హోరేతించేస్తారు. జగన్ ఒక ట్యాంకర్ బురద ను కూటమి పై జల్లుతారు. దానిని కడుక్కోటానికి కూటమి, దాని శ్రేయోభిలాషులు ఆపసోపాలు పడిపోతుంటారు. జగన్ కి చెలగాటం – కూటమికి ప్రాణ సంకటం… అన్నట్టుగా రాజకీయాలు తయారైనట్టు కనపడుతున్నది.
అనేకానేక ఆరోపణలు,హెచ్చరికలు, వ్యంగ్యాస్ట్రాలు, అసంబద్ధ వ్యాఖ్యలతో జగన్ బృందం కూటమి నేతలపై విరుచుకుపడుతున్నది. వచ్చే ఎన్నికల్లో అధికారం లోకి ఎలా రావాలో జగన్ కు ఇప్పటికీ అర్ధం కావడం లేదు అని ఈ వ్యవహార శైలిని బట్టే అంచనా వేయవచ్చు.
అదే సమయం లో జగన్ ను ఎలా నిలువరించాలో కూటమి కి ఇప్పటికీ తెలియడం లేదని చెప్పవచ్చు.
“కంచం నిండా తిని… మంచం నిండా పడుకుని గురక పెట్టడానికి తప్ప, నా మొగుడు ఎందుకూ పనికిరాడని…” ఇదివరకో ఇల్లాలు ముక్కు చీదినట్టుగా….
హితోక్తుల ద్వారా జగన్ ను నిలువరించవచ్చులే అని చంద్రబాబు భావిస్తున్నారా అనే అనుమానం చాలా విస్తృతంగా జనం నోళ్ళల్లో నానుతోంది.
“జగనిజం” అనేది ఒక ఫినామినా. ఆయన రాజకీయాల్లో ఉన్నంత కాలం అది ఆయన వెంటే ఉంటుంది. కక్షలు, కార్పణ్యాలు, అనుచరుల ఆగడాలు, రాజరిక పోకడలకు అధికార యంత్రాంగ దాసోహాలు, కేసులు, బెయిళ్ళు, ప్లీడర్లు, కోర్టులు మొదలైనవన్నీ “జగనిజం” ఉపాంగాలు. ఇవి లేకపోతే అధికారం లోకి రాలేమని ఆయన అనుకుంటారేమో తెలియదు.
వీటన్నిటినీ జనం తనివితీరా గతం లో ఒకసారి రుచి చూశారు. మరో సారి చూడడానికి గుండె ధైర్యం సరిపోకనే…. ఆయనకో నమస్కారం పెట్టి ; ప్రభుత్వాన్ని కూటమికి అప్పగించారు.
మరి, జగన్ ను…. ఆయన పార్టీ ని, జగనిజం ను కూటమి ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేయాలనుకుంటున్నది?
కూటమిలో ఈ అంశాన్ని ఎవరు చూస్తున్నారు? ప్రతి శాఖకూ ఓ మంత్రి ఉన్నారు కదా! మరి జగనిజం హ్యాండిలింగ్ కు ఎవరు ఉన్నారు? అసాధారణ సమస్యలకు… పరిష్కార మార్గాలు కూడా అసాధారణ స్థాయిలోనే ఉండాలని అంటారు కదా! .
జగన్ చెప్పే అంశాలలో వాస్తవాల పాలు ఎంత? అవాస్తవాల శాతం ఎంత? ఆయన దూకుడు రాజకీయాలను ఎలా హ్యాండిల్ చేయాలి? ఏది ఎటునుంచి నరుక్కు రావాలి? అది తెలియక పోతే, తెలిసిన వారి సలహాలు తీసుకోవాలి కదా! తీసుకుంటున్నారా?
వైసీపీ కి సంబంధించి ఇలాటి సవాలక్ష సందేహాలకు సమాధానాల కోసం…. కూటమి కి ఓట్లేసిన జనం ఎదురు చూస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది అనేది సామెత. కూటమి నేతలకు ఆ ‘ మనసు ‘ ఉందా!?
– భోగాది వేంకట రాయుడు