– ఉత్తరాంధ్రలో ప్రధాన సామాజికవర్గంగా తూర్పుకాపు
– రాజకీయంగా దక్కని అవకాశాలు
– గతం కంటే ప్రాతినిధ్యం తగ్గుముఖం
– ఇలానే కొనసాగితే టీడీపీకి నష్టం?
– ఆ సామాజికవర్గం దూరమయ్యే అవకాశం?
– ఇప్పుడంతా .‘ఆ ఒక్క కులాని’దే పెత్తనం
– ఉత్తరాంధ్రలో కీలక శాఖలన్నీ ఆ కుల అధికారులకే పట్టం
– ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ఆ ఇద్దరిదే హవా
– శ్రీకాకుళంలో తగ్గుతున్న తూర్పు కాపుల ప్రాధాన్యం
– కళింగులదీ అదే ఆవేదన
– ఉత్తరాంధ్ర లో ఉడుకుతున్న తూర్పు కాపులు
రాజకీయాల్లో కులాలకు తావులేదు. కానీ కుల, మత, ప్రాంతీయ తత్వాలే ఇప్పుడు రాజకీయాలను శాసిస్తున్నాయనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అయితే ఆర్థిక, అసమానతలు రూపుమాపేందుకు, వాటిని నియంత్రించేందుకు కుల, మత, ఆచారాలను పెట్టుకున్నారు. రాజ్యాధికారంలోనూ, పాలించే యంత్రాంగంలో రిజర్వేషన్ ప్రాతిపాదికన నియామకాలు చేపట్టారు. అయితే రానురాను కొన్ని కులాలే ఫలాలను అనుభవిస్తున్నాయి. మిగతా కులాలు వివక్షకు గురవుతున్నాయి.
ఇప్పుడు ఉత్తరాంధ్రలో తూర్పుకాపుల పరిస్థితి అంతే. ప్రాబల్యమున్న ప్రాంతాల్లో ఇతరులకు రాజకీయ అవకాశాలు కల్పించారు. వారి ప్రాతినిధ్యం ఉన్నచోట, ప్రజాప్రతినిధులు అణచివేతకు గురవుతున్నారు. ఇతర ప్రధాన కులాలతో సమానమైన ప్రాతినిధ్యం దక్కించుకోకపోవడం అనేది తూర్పుకాపుల్లో కలచివేస్తున్న అంశం. అయితే బాహాటంగా కులం కోసం గళం ఎత్తే తత్వం కాదు. అలాగే ఇతర ప్రధాన కులాలతో వివాదం పెట్టుకునే సాహసం చేయరు. అందుకే ఈ పరిస్థితి వచ్చిందని మెజార్టీ తూర్పుకాపుల వాదన.
ప్రాబల్యం అధికం..
ఉత్తరాంధ్రలో తూర్పుకాపు సామాజికవర్గం ప్రాబల్యం అధికం. ఉమ్మడి విశాఖ జిల్లాలో సగం మండలాలు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తూర్పుకాపులు అధికం. ఒక విధంగా చెప్పాలంటే జనాభా అధికంగా ఉండే సామాజికవర్గం కూడా ఇదే.
కానీ జిల్లాల పరంగా తీసుకుంటే మిగతా రెండు ప్రధాన సామాజికవర్గాలు సైతం ఉన్నాయి. అయితే సింహభాగం ప్రయోజనాలు మాత్రం వాటికే దక్కుతున్నాయి. చివరకు పాలనలో ప్రభావం చూపే విభాగాధిపతులు, ఉన్నతాధికారులు కూడా వారే. అయితే ఈ వివక్ష చివరకు తెలుగుదేశం పార్టీపై చూపుతుందనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.
ఉత్తరాంధ్రలో తూర్పుకాపు సామాజికవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నవారిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, చీపురుపల్లి నుంచి కిమిడి కళా వెంకటరావు, పాతపట్నం నుంచి మామిడి గోవిందరావు మాత్రమే ఉన్నారు.
అంటే ఉమ్మడి రెండు జిల్లాల్లో కలుపుకొని వెళితే కేవలం నలుగురు మాత్రమే. ఇది ఎంతమాత్రం సహేతుకం కాదన్నది తూర్పుకాపుల మనోగతం. గతంలో తూర్పుకాపులు ప్రాతినిధ్యం వహించే ఎచ్చెర్ల, నెల్లిమర్ల నియోజకవర్గాలు సైతం, పొత్తుల పేరుతో ఇతరులను కట్టబెట్టారు.
గతంలో నుంచి వస్తున్న సమీకరణలకు బ్రేక్ చేసి తూర్పుకాపులను పక్కనపెట్టారు. తర్వాత వచ్చిన నామినేటెడ్ పోస్టులతో పాటు, ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవుల్లో అయినా కనీసం న్యాయం చేయాలి కదా? అయితే తూర్పుకాపులకు ఏవైనా పదవులు ఇచ్చారంటే అది ద్వితీయ శ్రేణి పదవులు మాత్రమే.
విజయనగరం, శ్రీకాకుళం డీసీసీబీ చైర్మన్లు, మండలాల్లో ఉండే పీఏసీఎస్ అధ్యక్ష పదవులతో సరిపెట్టారు. శ్రీకాకుళం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ కొరికాన రవికుమార్, శ్రీకాకుళం గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పీరుకట్ల విఠల్ రావుకు మాత్రమే అవకాశం ఇచ్చారు. అయితే ఈ పదవులు ఇచ్చాం కదా? అని జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు, వేరొకరికి కట్టబెడతారన్న అనుమానం తూర్పుకాపు సామాజికవర్గంలో లేకపోలేదు.
యంత్రాంగంలోనూ అదే వాదన. ప్రభుత్వ కార్యాలయాల్లో విభాగాధిపతులు, ఉన్నతాధికారుల పదోన్నతుల్లోనూ తూర్పుకాపు సామాజికవర్గానికి అన్యాయం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిగతా ప్రధాన సామాజికవర్గాలకు అవకాశాలు దక్కడం మంచిదే అయినా.. తూర్పుకాపులకు దక్కాల్సిన అవకాశాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది.
రాజకీయ అవకాశాల్లో కోత..
ఒకప్పుడు ఉత్తరాంధ్ర తూర్పు కాపుల విషయంలో అన్ని ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను యూనిట్ గా తీసుకొని సామాజికవర్గ సమీకరణలు తెరపైకి తెస్తున్నారు. మిగతా సామాజికవర్గాల విషయంలో ఎటువంటి ఈక్వేషన్స్ లేవు.
గతంలో విజయనగరంలో తూర్పుకాపులకు మంత్రి పదవులు ఇచ్చేవారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రాధాన్యమిచ్చేవారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి సైతం తూర్పుకాపులదే అన్నట్టు ఉండేది. గొర్లె శ్రీరాములనాయుడు, తరువాత కిమిడి మృణాళిని, పాలవలస రాజశేఖరం ఇలా సుదీర్ఘ కాలం ఆ సామాజికవర్గం వారి చేతుల్లోనే ఉండేది. మిగతా సామాజికవర్గాల వారిని మంత్రులుగా కొనసాగిస్తే ఇదే ఆనవాయితీని కొనసాగించారు.
కానీ దానిని కూడా బలవంతంగా లాక్కున్నారు. ఉత్తరాంధ్రలో తూర్పుకాపులకు సంబంధించి గజపతినగరం, విజయనగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, ఎచ్చెర్ల, రాజాం, పాలకొండ, పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి. కానీ వాటిని సైతం రిజర్వేషన్లతో తారుమారు చేశారు. ఇతరుల ప్రాతినిధ్యం పెంచారు.
ఈ సామాజికవర్గం నుంచి కళా వెంకటరావు, పతివాడ నారాయణస్వామినాయుడు, కలమట వెంకటరమణమూర్తి, కిమిడి మృణాళిని, గణపతిరావు, పడాల అరుణ వంటి వారి ప్రాతినిధ్యం ఉండేది. కానీ ఎందుకో తూర్పుకాపుల ప్రాతినిధ్యం తెలుగుదేశం పార్టీలో తగ్గుతోంది.
భవిష్యత్ లో ఇది ఇబ్బందికరమే. మిగతా ప్రధాన సామాజికవర్గాలతో పాటు తూర్పుకాపులకు సైతం ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇవ్వకపోతే, తూర్పుకాపుల నుంచి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.ఈ విషయంలో కూటమి పార్టీలు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది.
– ఉగ్ర పల్లి ధర్మరాజు
సీనియర్ జర్నలిస్ట్