– పిన్నెల్లి ఘర్షణ.. సాల్మన్ నేర చరిత్ర వెనుక అసలు నిజాలివే!
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో ఇటీవల జరిగిన సాల్మన్ మృతి ఉదంతం రాజకీయ రంగు పులుముకుంది. అయితే, ఈ ఘటన వెనుక ఉన్న వాస్తవాలు, హతుడి నేర చరిత్ర- గ్రామస్థులు ఎదుర్కొన్న వేధింపులను గమనిస్తే.. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణగా కనిపిస్తోందే తప్ప, రాజకీయ హత్య కాదని స్థానికులు చెపుతున్నారు.
బాధితుడు కాదు.. భయానక నేరగాడు?
వైఎస్సార్‌సీపీ కార్యకర్తగా మందా సాల్మన్ పై ఉన్న రికార్డులు విస్తుగొలుపుతున్నాయి. సాల్మన్‌పై గతంలోనే సుమారు 12 కేసులు నమోదయ్యాయి. అందులో:
ఒక రేప్ కేసు (సొంత సామాజిక వర్గానికి చెందిన వివాహితపై).
5 క్రిమినల్ కేసులు. 6 దొంగతనం కేసులు.
జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, పిన్నెల్లి అండతో సాల్మన్ పిన్నెల్లి గ్రామంలో సుమారు 15 ఎకరాల భూమిని కబ్జా చేశాడని, గ్రామంలోని దళితులందరూ తన గుప్పిట్లోనే ఉండాలని హుకుం జారీ చేసేవాడని ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా ఎదురుతిరిగితే వారి పొలాలు లాక్కోవడం, కప్పం కట్టాలని వేధించడం సాల్మన్ శైలి.
హంతకుడు కూడా దళితుడే: మరి కుల ముద్ర ఎందుకు?
ఈ గొడవలో నిందితుడిగా ఉన్న మొటమర్రి పేతురు కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరి మధ్య జరిగిన గొడవను వైఎస్సార్‌సీపీ నేతలు కులాలకు, రాజకీయాలకు ఆపాదించి లబ్ధి పొందాలని చూడటంపై విమర్శలు వస్తున్నాయి.
గతంలో (కరోనా సమయంలో) పేతురును కాలు, చేతులు కట్టేసి కాలు, చేతులు ఎముకలపై క్రూరంగా రాడ్లతో కొట్టి చిత్రహింసలకు గురిచేసిన చరిత్ర సాల్మన్‌కు ఉంది. సాల్మన్ ఆగడాలు భరించలేక సుమారు 40 దళిత కుటుంబాలు గ్రామం వదిలి పారిపోయాయంటే అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
అసలు ఆ రోజు ఏం జరిగింది?
జనవరి 8న గ్రామానికి వచ్చిన సాల్మన్, 9వ తేదీన మద్యం మత్తులో గ్రామంలో ప్రజలను తిట్టటం మొదలుపెట్టాడు. జనవరి 10న పొలానికి వెళ్తున్న పేతురుపై సాల్మన్ రాయి విసిరి, రాడ్డుతో దాడి చేశాడు. బండి అపగానే రాడ్డు తో విచక్షణ రహితంగా పేతురు పై సాల్మన్ దాడి చేశాడు. ఆ క్రమంలో ఆత్మరక్షణ కోసం పేతురు కూడా సాల్మన్ తెచ్చిన రాడ్డు లాక్కొని ఎదురుదాడి చేయడంతో సాల్మన్‌కు గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ సాల్మన్ మరణించాడు.
కాసు రాజకీయ వ్యూహం – జగన్ శవ రాజకీయాలు
సాల్మన్ ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు రాని కాసు మహేష్ రెడ్డి, ఇతర వైసీపీ నేతలు, అతను చనిపోతాడని తెలియగానే రంగప్రవేశం చేయడం వెనుక పెద్ద కుట్రే ఉందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
కాసు మహేష్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఈ మరణాన్ని అడ్డం పెట్టుకుని గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూశారని సమాచారం.
శవాన్ని గ్రామానికి తరలించి గొడవలు సృష్టించడం ద్వారా జగన్ మోహన్ రెడ్డిని రప్పించి, రాజకీయ లబ్ధి పొందాలని చూశారని, కానీ పోలీసులు అప్రమత్తంగా ఉండి ఆ ప్లాన్‌ను అడ్డుకున్నారని తెలుస్తోంది.
నేర చరిత్ర ఉన్న వ్యక్తిని అమాయకుడిగా చిత్రీకరిస్తూ, పల్నాడులో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలను పెంచి పోషించే ప్రయత్నం జరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-చాకిరేవు