– కప్పు టీ కన్నా కారుచౌకగా ఎకరా భూమి
– అయిన వారికి పప్పుబెల్లాల్లా కట్టబెడుతున్న బాబు
– కాకినాడ లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు
కాకినాడ:: కూటమి పాలనలో రాష్ట్రంలో యథేచ్ఛగా భూపందేరానికి పాల్పడుతూ… కప్పు టీ కన్నా కారుచౌకగా ఎకరా భూమిని కట్టబెడుతున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ రాష్ట్రంలో పప్పు బెల్లాల కన్నా అత్యంత ఖరీదైన భూముల్ని తమ వారికి అతి చౌకగా కట్టబెడుతున్నది చంద్రబాబు ప్రభుత్వమా? కాదా? కప్పు టీ కన్నా కారుచౌకగా ఎకరాలకు, ఎకరాల భూమిని ధారాదత్తం చేస్తున్న మాట వాస్తవమా? అబద్ధమా? కార్పొరేట్ కంపెనీలకు వందలాది ఎకరాల భూమిని, అర్హత, సామర్ధ్యం లేకున్నా రాత్రికి రాత్రే వాటికి కట్టబెడుతున్న వైనాన్ని ఏమంటారు?
లులూ అనే ప్రైవేటు సంస్థ పెద్ద షాపింగ్ మాల్స్ నిర్మాణం చేసి, నిర్వహిస్తోంది. దానిమీద మీకు ఎందుకు అంత ప్రేమ? విశాఖపట్నం, విజయవాడలో వేల కోట్లు విలువైన భూములను ఎందుకు లులూకు పప్పుబెల్లాల్లా పంచిపెడుతున్నారు. లులూ మాల్ కోసం ఈ రెండు నగరాల్లో దాదాపు రూ.3వేల కోట్ల విలువైన భూమని కట్టబెడుతున్న మాట నిజంకాదా? అది కూడా కేవలం నామమాత్రపు లీజుకు కట్టబెడుతున్న మాట వాస్తవం కాదా?
విశాఖపట్నంలో హార్బర్ పార్కు దగ్గర బహిరంగ మార్కెట్ లో ఎకరా రూ.150 కోట్ల ఖరీదుతో దాదాపు రూ.2వేల కోట్ల విలువ చేసే భూమిని మీరు 99 ఏళ్ల లీజుకు రాసివ్వడాన్ని మాఫియా పనులు కాక మరేమిటంటారు ? పైగా లులూ సంస్థ మాల్ కట్టేవరకు లీజు మినహాయించారు. వారికి కేటాయించిన స్థలంలో దాదాపు 13.50 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం చేస్తే.. అందులో 3.30 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అమ్మేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. అంతే కాకుండా లులూ సంస్థ అడిగిన ప్రతి అంశంలోనూ వారికి మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటే జీవోలిచ్చారు.
మరోవైపు విజయవాడ నగరం నడిబొడ్డు ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాల స్థలాన్ని కూడా 99 ఏళ్లకు మాల్ నిర్మాణం కోసం దాదాపు రూ.600 కోట్ల విలువైన భూమిని కట్టబెడుతున్నారు. ఆ స్దలంలో లులూ సంస్థ పెట్టే పెట్టుబడి కేవలం రూ.150 కోట్లు మాత్రమే. దీన్ని స్కామ్ కాక మరేమిటంటారు? ఎందుకు మీకు లులూ మీద అంత ప్రేమ? సూటిగా సమాధానం చెప్పండి.
ఈ విధంగా మీరు భూముల్ని పప్పుబెల్లాల్లా పంచుతున్నారు అని ప్రశ్నిస్తే… చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్ మాట్లాడుతూ మొత్తం భూమిని 99 పైసలకే ఇచ్చేస్తాం మీరెవరు అని తిరిగి ప్రశ్నిస్తున్నారు. మీరేమైనా ఈ రాష్ట్రానికి అధిపతులు అనుకుంటున్నారా? రాష్ట్రాన్ని ప్రజలు మీకు రాష్ట్రాన్ని రాసిచ్చారనుకుంటున్నారా? మీరు కేవలం రాష్ట్రానికి కస్టోడియన్ లు మాత్రమే అన్న విషయాన్ని గుర్తుంచుకొండి.