దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సు వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ విజయాన్ని అందుకుంది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, డిజిటల్ మరియు పారిశ్రామిక రంగాల అభివృద్ధి కోసం ప్రముఖ ఐటీ మౌలిక సదుపాయాల దిగ్గజం RMZ గ్రూప్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.
రాష్ట్ర ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖా మంత్రి సమక్షంలో జరిగిన ఈ ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖచిత్రం మారనుంది. ఈ భాగస్వామ్యం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రధాన విభాగాల్లో పెట్టుబడులు రానున్నాయి:
విశాఖపట్నంలో భారీ GCC పార్క్: కాపులుప్పాడ ఐటీ పార్క్ (ఫేజ్-1)లో సుమారు 50 ఎకరాల్లో, 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంతో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) పార్క్‌ను RMZ నిర్మించనుంది. ఇది ప్రపంచ స్థాయి సంస్థలను విశాఖకు ఆకర్షించడమే కాకుండా నగరాన్ని ఒక గ్లోబల్ ఐటీ హబ్‌గా మారుస్తుంది.
హైపర్‌స్కేల్ డేటా సెంటర్: విశాఖ ప్రాంతంలో సుమారు 500 నుండి 700 ఎకరాల విస్తీర్ణంలో 1 గిగావాట్ (GW) సామర్థ్యంతో డేటా సెంటర్ క్లస్టర్‌ను దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు. ఇది ఏఐ (AI) వంటి అత్యాధునిక సాంకేతికతలకు వెన్నుముకగా నిలుస్తుంది.
రాయలసీమలో ఇండస్ట్రియల్ పార్క్: ప్రాంతీయ సమతుల్యతను పాటిస్తూ, రాయలసీమలోని టేకులొడు (బెంగుళూరుకు సమీపంలో) వద్ద సుమారు 1,000 ఎకరాల్లో భారీ ఇండస్ట్రియల్ మరియు లాజిస్టిక్స్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది తయారీ మరియు లాజిస్టిక్స్ రంగాలకు కేంద్రంగా మారుతుంది.
వచ్చే ఐదు నుండి ఆరు ఏళ్ల కాలంలో సుమారు 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 84,000 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నారు. ఐటీ, డేటా సెంటర్లు మరియు పారిశ్రామిక రంగాల్లో సుమారు ఒక లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది.
భారతదేశంలోని ఐటీ మౌలిక సదుపాయాల రంగంలో RMZ గ్రూప్ తిరుగులేనిది. బెంగళూరులోని RMZ Ecoworld, హైదరాబాద్‌లోని RMZ Skyview మరియు చెన్నైలోని RMZ One Paramount వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ద్వారా ఈ సంస్థ తన సత్తా చాటింది. ముఖ్యంగా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను ఆకర్షిస్తూ, ఈ భవనాల్లో 95 శాతం పైగా ఆక్యుపెన్సీ రేటును సాధించడం వీరి నిర్వహణ సామర్థ్యానికి నిదర్శనం. గతంలో చేపట్టిన ఏ ప్రాజెక్టు కూడా మధ్యలో ఆగిపోకుండా, అత్యున్నత ప్రమాణాలతో పూర్తి చేయడం ఈ సంస్థ ప్రత్యేకత.
ఆర్థికంగా అత్యంత పటిష్టంగా ఉన్న RMZ గ్రూప్, 2020లో బ్రూక్‌ఫీల్డ్‌తో జరిగిన ఒప్పందం తర్వాత పూర్తిగా రుణరహిత (Zero Debt) సంస్థగా అవతరించింది. కెనడా పెన్షన్ ప్లాన్ (CPPIB) మరియు జపాన్‌కు చెందిన మిట్సుయ్ ఫుడోసన్ వంటి గ్లోబల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం వీరి విశ్వసనీయతను మరింత పెంచింది.
సుమారు 10 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను విజయవంతంగా నిర్వహిస్తున్న ట్రాక్ రికార్డ్ ఉన్నందున, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదించిన రూ. 84,000 కోట్ల పెట్టుబడులు కూడా అనుకున్న సమయానికి పూర్తయ్యి, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో పారదర్శకమైన విధానాలు మరియు త్వరితగతిన అనుమతులు ఇవ్వడం వల్లే ఇలాంటి దిగ్గజ సంస్థలు పెట్టుబడులతో ముందుకు వస్తున్నాయి