January 23, 2026

దేశంలో మేధావులు పడ్డారు!

దేశంలో మేధావులు పడ్డారు;
బండరాళ్లు‌ దొరలి వచ్చినట్టుగా,
ముళ్ల‌ వాన కురిసినట్టుగా,
క్రూర మృగాలు ఉరికినట్టుగా,
ఘోర సర్పాలు కాట్లువేసినట్టుగా,
దేశంలో మేధావులు పడ్డారు.

సమాజం
మంటల్లో చిక్కుకున్న వనం అయింది;
పౌరుడి మనుగడ
మరుగుతున్న నీళ్లలో మునిగిన‌ తల అయింది‌.

పెరిగిన మేధ పగుళ్లకు కారణమయింది;
అభద్రత వచ్చిన జ్ఞానానికి ఫలితం అయింది.

చదువు‌కు విదేశీ విధ్వంసక భావజాలం నిప్పంటుకుంది;
ఈ గడ్డను ధ్వంసం చెయ్యడానికి
విద్య విజృంభిస్తోంది.

మేధావులు దేశాన్ని దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు;
తమ బుఱ్ఱల్లోని రోగాల్ని ఈ మట్టికి అంటిస్తున్నారు.

మేధ అన్న విషం ఒలికింది;
అది దేశమంతా చిందింది.
శుభ్రం చేసుకోవడం మన బాధ్యత;
దేశ శుభ్రతే దేశ భద్రత.

పామరులారా,
సామాన్యులారా,
ఈ మట్టి మనది,
ఈ సమాజం మనది,
ఈ దేశం మనది.

పామరులారా,
సామాన్యులారా,
మేధావుల భ్రష్టత్వం
సాహిత్యం కాదు;
మేధాజాగిలాల మొరుగుడు సంగీతం అవదు;
మేధావులకు మనం బలి కాకూడదు.

పామరులారా రండి,
సామాన్యులారా రండి,
ప్రజలారా రండి;
మేధావుల్ని వేటాడి వేటాడి నాశనం చేసేద్దాం;
మేధావుల పీడను వదిలించుకుందాం.

వక్రతకు అతీతంగా,
ఛిద్రం అయిపోకుండా
మామూలుగా ఉందాం;
నిమ్మళంగా బతుకుదాం.
మనల్ని మనం దక్కించుకుందాం.

మనం మన దేశాన్ని నిలుపుకుందాం;
మన సంతతికి ఈ దేశాన్ని
సంపదగా అందిద్దాం.

– రోచిష్మాన్
9444012279

Total Visitors: 2,550,400