– సైన్స్ క్లాసుల్లో కూడా చెప్పని ‘సింథటిక్ మ్యాజిక్’
– మీరు టీటీడీ చైర్మన్‌గా ఉన్నారా లేక ఏదైనా “కెమికల్ ఫ్యాక్టరీ”కి మేనేజర్‌గా ఉన్నారా?
– మీ పాదాల కింద ఉన్నది ‘అహంకారపు కన్ను’ కాదు.. అవినీతి పుట్ట!
– ఆవు పాలు లేని నెయ్యి సరఫరా చేసిన కంపెనీలకు వందల కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టడం మీ పాపానికి పరాకాష్ట వైవీ సుబ్బారెడ్డి గారూ, నమస్కారం
తిరుమల పవిత్రతను కాపాడటంలో మీరు చూపించిన “శ్రద్ధ” ఇప్పుడు సిట్ ఛార్జ్‌షీట్ రూపంలో ఊరూరా మారుమోగుతోంది. సాధారణంగా పాల నుంచి నెయ్యి తీయడం అందరికీ తెలుసు, కానీ “పాలు లేకుండా నెయ్యి” తయారు చేసే టెక్నాలజీని కనిపెట్టిన ఘనత మాత్రం మీకే దక్కింది.
సైన్స్ క్లాసుల్లో కూడా ఎవరూ చెప్పని ఈ ‘సింథటిక్ మ్యాజిక్’ చూస్తుంటే.. మీరు కేవలం రాజకీయం మాత్రమే కాదు, భక్తుల నమ్మకాన్ని కెమికల్స్‌తో కలిపేసిన అద్భుతమైన కెమిస్ట్రీ కూడా ప్రదర్శించారని అర్థమవుతోంది! మీరు టీటీడీ చైర్మన్‌గా ఉన్నారా లేక ఏదైనా “కెమికల్ ఫ్యాక్టరీ”కి మేనేజర్‌గా ఉన్నారా అన్న సందేహం వస్తోంది.
కానీ అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మీ భక్తి ప్రపత్తులు కోర్టు మెట్లు ఎక్కే దగ్గర చూపించిన వేగం! సుబ్బారెడ్డి గారు, మీరు మరియు మీ ధర్మపత్ని గారు బ్యాంక్ స్టేట్‌మెంట్లను సిట్ అధికారులకు సమర్పించకుండా, స్టే కోసం కోర్టుకు ఎందుకు పరిగెత్తారో కొంచెం వివరిస్తారా? నిజాయితీ ఉంటే భయం ఎందుకు? మీరు ఏ తప్పూ చేయలేదని, అంతా వెంకన్న సాక్షిగా ధర్మబద్ధంగా జరిగిందని మైకుల ముందు, మీ పార్టీ వారు గంభీరంగా చెబుతారు కదా! మరి మీ ఖాతాల్లోకి ఎక్కడి నుండి నిధులు వచ్చాయి? ఎక్కడికి వెళ్లాయి అనే చిన్న స్టేట్‌మెంట్ చూపించడానికి అంత వణుకు ఎందుకు?
పురాణాల్లో తన రాకను విష్ణువు గమనించలేదని భావించిన భృగు మహర్షి, తీవ్రమైన కోపంతో విష్ణువు వక్షస్థలంపై తన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి కోపగించుకోకుండా, మహర్షి పాదాలు నొచ్చుకుని ఉంటాయని మెల్లగా ఒత్తుతూ, ఆయన పాదంలో ఉన్న ‘అహంకారపు కన్ను’ను చిదిమేశారు.
కానీ సుబ్బారెడ్డి గారూ.. మీకో విషయం తెలుసా? మీరు మహర్షులు కారు, భృగువులు అంతకంటే కారు! మీ విషయంలో ఆ శ్రీహరి అంత మెల్లగా అస్సలు ఉండడు. మీ పాదాల కింద ఉన్నది ‘అహంకారపు కన్ను’ కాదు, అవినీతి పుట్ట! ఆ పుట్ట పగిలే రోజు దగ్గరలోనే ఉంది.
ఆ లింకులు ఎక్కడివి? నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు, మీ కుటుంబ సభ్యుల ఖాతాలకు మధ్య ఏమైనా “అదృశ్య వారధి” ఉందా అని భక్తులు అనుమానిస్తున్నారు. ఆ అనుమానాన్ని పటాపంచలు చేయాల్సింది పోయి, కోర్టు ద్వారా నోరు నొక్కాలని చూడటం మీ నైతికతకు నిదర్శనం. ప్రైవసీ ముసుగులో ఏముంది? కోర్టులో “మా వ్యక్తిగత గోప్యత దెబ్బతింటుంది” అని వాదించారు. స్వామివారి లడ్డూలో జంతువుల కొవ్వు, పామాయిల్ కలిసినప్పుడు దెబ్బతినని పవిత్రత… మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే దెబ్బతింటుందా?
ఆనాడు మీ అధికారులు కల్తీ జరుగుతోందని రిపోర్టులు ఇచ్చినా ఎందుకు లైట్ తీసుకున్నారు? బహుశా మీరు “అంతా మన వాళ్లే కదా, కొంచెం ఆయిల్ కలిపితే లడ్డూ ఇంకా సాఫ్ట్‌గా వస్తుంది” అని అనుకున్నారేమో! ఆవు పాలు లేని నెయ్యి సరఫరా చేసిన కంపెనీలకు వందల కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టడం మీ పాపానికి పరాకాష్ట.
కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూలో.. ఆవు నెయ్యికి బదులు పామాయిల్, కెమికల్స్ కలిపి “అరోమా” కోసం ఎసెన్స్ వాడిన నీ ఘరానా తెలివి చాలా గొప్పది. అంటే మీరు భక్తులకు ఇచ్చింది ప్రసాదం కాదు, ఒక “కెమికల్ కాక్ టెయిల్” అన్నమాట! ప్రసాదంలో పవిత్రత కంటే నీకు “కమీషన్లే” ముఖ్యమని సిట్ ఛార్జ్‌షీట్ చూస్తుంటే ఇట్టే అర్థమవుతోంది.
సాధారణంగా భక్తులు స్వామివారికి తమ సంపాదనలో కొంత సమర్పిస్తారు. కానీ మీ హయాంలో… స్వామివారి సొమ్మును, భక్తుల సెంటిమెంట్‌ను మీ వైపు మళ్లించుకునే సరికొత్త సవరించిన మీ నిబంధనలతో “పవిత్రతను రివర్స్ చేసే టెండరింగ్” విధానాన్ని ప్రవేశపెట్టారు. అన్నీ బయటపడ్డాక కూడా “ఇదంతా రాజకీయ కక్ష” అని బుకాయించడం మీ వైకాపాకే చెల్లింది.
జైలు గోడల మధ్య మీకు సహకరించిన పావులు మాత్రం ఉన్నారు. కానీ భక్తుల మనోభావాలతో ఆడుకున్న వారికి తిరుమల వేంకటేశ్వరుడే సరైన “జడ్జిమెంట్” ఇస్తాడు. మీ వైకాపా అహంకార పాపాలకు హాహాకారాలు పెట్టే రోజులు వస్తాయి.
మీ పాప చతుష్టయంలో ఒకడిని సొంత ఊరే కాండ్రించి ఉమ్మేసింది. పున్నామ నరకం తప్పించాల్సిన కొడుక్కి కొరివి పెట్టి అనుభవిస్తున్నాడు ఇప్పటికే. చెప్పాగా ఎవడూ తప్పించుకోలేడు. వైవీ గారూ, గుర్తుంచుకోండి: కోర్టుల నుండి స్టేలు తెచ్చుకోవచ్చు కానీ, ఆ ఏడుకొండల వాడి నుండి వచ్చే ‘తీర్పు’ నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఎలా ఉంటుందో కూడా మీ ఊహకు అందదు. అప్పుడు మీ బ్యాంక్ స్టేట్‌మెంట్లు కాదు కదా, మీ మౌనం, మీ వెనుక జగన్, ఆయన వెనుక వైకాపా కూడా మిమ్మల్ని కాపాడలేవు.
-చాకిరేవు