అన్నమయ్య జిల్లాలో నాలుగో రోజు కొనసాగుతున్న వైఎస్ షర్మిల యాత్ర
అన్నమయ్య జిల్లా:అన్నమయ్య జిల్లాలో నాలుగో రోజుగా కొనసాగుతున్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఉపాధి పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా పుంగనూరులో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిలా రెడ్డి, ఉపాధి హామీ పథకం వైఎస్సార్ ఆశయాల నుంచి పుట్టినదేనని, ప్రపంచంలోనే పేదలకు ఉపాధి కల్పించిన గొప్ప పథకంగా మన్రేగా నిలిచిందని పేర్కొన్నారు. మన్రేగా పథకానికి పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్ అని, రాయలసీమ వేదికగానే ఈ పథకానికి రూపకల్పన జరిగిందని గుర్తు చేశారు. వైఎస్సార్ హయాంలో ఉపాధి హామీ పథకం అంటే గ్రామాల్లో పెద్ద పండుగలాగా ఉండేదని, ఉపాధి హామీ అంటే ఇలా ఉండాలని అమలు చేసి చూపించింది వైఎస్సారేనని తెలిపారు. ఈ పథకం వల్ల గ్రామాలు అభివృద్ధి చెందాయని, పేదల జీవితాల్లో వెలుగులు నిండాయని చెప్పారు.
ప్రస్తుతం ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీస్తే పేద కుటుంబాలే నష్టపోతాయని, పథకం లేకుంటే మళ్లీ వలసలు పెరిగే ప్రమాదం ఉందని షర్మిల హెచ్చరించారు. ఉపాధి హామీపై ప్రధాని మోదీ కుట్రలు చేస్తున్నారని, ఈ పథకం కింద పెట్టే ఖర్చును వెనకేసుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఉపాధి హామీ నిధులుగా ఉన్న రూ.80 వేల కోట్లను బీజేపీ కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు కుట్ర జరుగుతోందని విమర్శించారు.
ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించడం అన్యాయమని, ఆనాడు గాడ్సే గాంధీని చంపితే, ఇప్పుడు మోదీ గాంధీ పేరును తొలగించి మళ్లీ గాంధీని చంపినట్టేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. మన్రేగా చట్టానికి, మోదీ తెచ్చిన గ్రామజీ చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. మన్రేగా చట్టంలో పని ఒక హక్కు కాగా, అడిగిన 15 రోజుల్లో పని కల్పించాల్సి ఉంటుందని, కొత్త చట్టంలో ఆ హక్కును పూర్తిగా తొలగించారని తెలిపారు. ఈ సభలో పాల్గొన్న సీడబ్ల్యూసీ సభ్యులు ఎన్. రఘువీరా రెడ్డి మాట్లాడుతూ, పని హక్కును కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఇప్పుడు బీజేపీ ఆ హక్కును కాలరాస్తోందని అన్నారు. రాష్ట్ర పరిస్థితి మూలిగే నక్కలాగా మారిందని, ఇప్పుడు రాష్ట్రంపై మోపిన భారం తాడిపండు పడినట్టేనని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా బీజేపీ 12 కోట్ల మంది పేదల పొట్ట కొడుతోందని, ప్రతి పేద కుటుంబం నడుం బిగించాలని పిలుపునిచ్చారు