– 33 ఏళ్ల సర్వీసుకే రిటైర్మెంటా ?
– కొత్త రూల్స్ తో ఉద్యోగులకు తీవ్ర నష్టం
– 33 ఏళ్లకే బలవంతంగా రిటైర్మెంటా ?
– విలువైన సర్వీస్ కోల్పోతున్న ఉద్యోగులు
– రివర్స్ లో కూటమి సర్కార్ రూల్స్
– ఒకటో తేదీకి జీతాలు ఇవ్వట్లేదు
– మధ్యంతర భృతి, పీఆర్సీ మాటేలేదు
– వైఎస్సార్శీపీ ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి ఆక్షేపణ
తాడేపల్లి: 33 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు తప్పనిసరి రిటైర్మెంట్ ఇచ్చేలా కూటమి ప్రభుత్వం తెస్తున్న నిబంధనలపై వారిలో కలకలం మొదలైందని, దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వైఎస్సార్శీపీ ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని ప్రభుత్వం వారికి ఇవ్వాల్సిన బకాయిలతో పాటు మధ్యంతర భృతి, పీఆర్సీల్ని గాలి కొదిలేసిందని ఆయన గుర్తు చేశారు. సచివాలయ ఉద్యోగుల్ని సర్వేల పేరుతో తీవ్ర ఒత్తిడి చేసి వాళ్ల చావులకు కారణమవుతున్నారని చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు.
ఉద్యోగుల కోసం ప్రభుత్వం తాజాగా ముసాయిదా నిబంధనలు తీసుకొచ్చింది. కొత్త రూల్స్ వస్తున్నాయంటే తమకు మేలు జరుగుతుందని ఉద్యోగులు, పెన్షనర్లు భావిస్తుంటారు. కానీ ఈ నిబంధనలు చూస్తుంటే కూటమి ప్రభుత్వం రివర్స్ లో వెళ్తుందనే భావన కలుగుతోంది. ఈ కొత్త ముసాయిదా నిబంధనల మీద ఉద్యోగ వర్గాల్లో కలకలం మొదలైంది.
33 ఏళ్ల సర్వీసు చేసిన వాళ్లను ప్రభుత్వం తొలగిస్తుందనే ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తోంది. ఈ కొత్త రూల్స్ ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల్ని ఏం చేయాలనుకుంటుందో అర్దం కావట్లేదు. 62 సంవత్సరాలు పదవీ విరమణ వయస్సు ఉంటే 33 ఏళ్ల సర్వీసు తర్వాత ఉద్యోగం నుంచి తొలగించాలనే నిబంధన తెస్తున్నారు. ఒక ఉద్యోగి 25 ఏళ్లకు సర్వీసులో చేరితే దానికి 33 సంవత్సరాలు కలుపుకుంటే 58 ఏళ్ల సర్వీసు అవుతుంది.
దీంతో నాలుగేళ్ల సర్వీస్ కోల్పోవాల్సి వస్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం 33 సంవత్సరాల సర్వీసు పూర్తయితే రిటైర్మంట్ ఇవ్వాలనుకుంటోంది. ఇదేనా ఉద్యోగులపై ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ?
అధికారంలోకి రాగానే ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇస్తామన్న హామీ, అలాగే పీఆర్సీ ఇస్తామన్న హామీ, బకాయిలు చెల్లిస్తామన్న హామీ ఇప్పటివరకూ నెరవేర్చలేదు. గ్రంథాలయ సంస్ధలో పనిచేస్తున్న ఉద్యోగులు రిటైర్ అయి రెండేళ్లయినా వారికి పెన్షన్ ఇవ్వడం లేదు.
పెన్షన్ ఇవ్వకపోతే వాళ్లు ఎలా బతకాలి ?, నెలవారీ ఇంట్లో సరుకులు కూడా కొనుక్కోలేని పరిస్ధితా ?, ఉద్యోగులకు ఒకటో తేదీ జీతాలిస్తున్నామని చెప్పుకుంటున్నారు. కానీ క్షేత్రస్ధాయిలో చూస్తే 12వ తేదీ వరకూ కూడా చాలా మందికి జీతాలు అందని పరిస్ధితులు ఉన్నాయి. ఉద్యోగుల్ని ఎందుకు మోసం చేస్తున్నారు ?
సర్వేల ఒత్తిడితో సచివాలయ ఉద్యోగుల చావులు
లక్షా 20 వేల మంది పనిచేస్తున్న సచివాలయ వ్యవస్ధలో ఉద్యోగుల్ని సర్వేల పేరుతో వేధిస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ తీసేశాక సచివాలయ ఉద్యోగులు 100 ఇళ్ల చొప్పున సేవలు అందిస్తుంటే.. వారిని సర్వేల పేరుతో పీడిస్తున్నారు. ఏకీకృత కుటుంబ సర్వే పేరుతో తాజాగా మరో తంతు మొదలుపెట్టారు. ఉద్యోగుల్లో మహిళలు, రోగాలతో బాధపడుతున్న వారు ఉంటారు. ఉద్యోగులు ప్రతీ ఇంటి దగ్గర గంట చొప్పున 8 గంటల్లో 8-10 సర్వేలు చేయగలరు. కానీ ఎక్కువ సర్వేలు చేయాల్సిందేనని వేధిస్తున్నారు.
వాళ్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతూ ఈ మధ్యనే 30 మంది ఆత్మహత్యలు, హార్ట్ ఫెయిలై, ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. ఉండి మండలంలో నాగ ప్రశాంతి అనే సంక్షేమ కార్యదర్శి పని ఒత్తిడి వల్ల చనిపోయారు. ఇవాళ అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలో పని ఒత్తిడి వల్ల మరో ఉద్యోగి చనిపోయారు. ఆ ఉద్యోగికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ప్రభుత్వం ఇలా పని ఒత్తిడి పెట్టి ఉద్యోగుల్ని చంపేస్తుంటే వారి కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? విజయనగరంలో ఇవాళ ఓ ఏఎన్ఎం గుండెపోటుతో చనిపోయారు. ప్రభుత్వం ఉద్యోగుల్ని చంపాలని చూస్తుందా అని ప్రశ్నిస్తున్నాం.
ప్రమోషన్లు లేవు.. ఇంక్రిమెంట్లు రావు..
సచివాలయ ఉద్యోగులు తమ విధులతో పాటు అదనంగా బూత్ లెవెల్ అధికారులుగా ఎస్ఐఆర్ పని కూడా చేయాల్సి వస్తోంది. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి ఆరేళ్ల సర్వీసు తర్వాత ప్రమోషన్ తర్వాత ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ పథకం కింద ఒక ఇంక్రిమెంట్ కూడా ఇవ్వాలి. కానీ సచివాలయ ఉద్యోగులకు ఈ ఇంక్రిమెంట్ ఇవ్వడం లేదు.
వీళ్లంతా ప్రభుత్వ ఉద్యోగులు కాదా అని ప్రశ్నిస్తున్నాం. వాలంటీర్ల విధులు కూడా వీళ్లకు అప్పగించి సొంత ట్యాబ్ లతో పని చేయిస్తున్నారు. ఇంటర్నెట్ రీచార్జ్ కూడా సొంతంగా చేయించుకోవాల్సి వస్తోంది. రోజుకు 30 ఇళ్లలో సర్వే చేయాలని ఉద్యోగులకు టార్గెట్లు పెడుతున్నారు. ఇలా చేస్తే తప్పులు కూడా దొర్లుతాయి.
అంటే ఉద్యోగులు తప్పులు చేసేలా వాళ్లను ప్రోత్సహిస్తున్నారా ?, మహిళా ఉద్యోగుల్ని రాత్రి వరకూ పనిచేయిస్తున్నారు,సెలవుదినాల్లోనూ వదలట్లేదు. చాలా మంది ఉద్యోగాల్లో ఉండాలా, మానేయాలా అని భయపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా.. పెండింగ్ లో నాలుగు డీఏలు ఇవ్వకుండా, 12వ పీఆర్సీకి కొత్త కమిషనర్ ను నియమించకుండా కాలం గడిపేస్తున్నారు.
ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు 30 వేల నుంచి 35 వేల కోట్లు ఉన్నాయంటున్నారు. వైఎస్సార్ హయాంలో తెచ్చిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ లో ఆస్పత్రులకు బకాయిలు చెల్లించక ఉద్యోగులకు వైద్యం అందకుండా చేస్తున్నారు. ఇప్పుడు కొత్త విధానం తెస్తామంటున్నారు. దీన్ని ఎవరు అడుగుతున్నారు.
జీతం, పెన్షన్లలో నుంచి ప్రభుత్వానికి డబ్బులు కడుతుంటే, మీ వాటా సకాలంలో చెల్లించక ఈ సమస్యలన్నీ తలెత్తుతున్నాయి. చాలా మంది పెన్షనర్లు వైద్యం చేయించుకోలేక చనిపోతున్నారు. రిటైర్మెంట్ తర్వాత బకాయిలూ తీసుకోకుండానే వారు చనిపోతున్నారు. వీళ్ల బకాయిలు ఎటు పోతున్నాయో తెలియట్లేదని నలమారు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు.