– మెడికల్ బయోప్లాంట్లకు మాఫియా మోకాలడ్డు
– కేసులు, ఫిర్యాదులతో కొత్తవారిని రానీయని ఎత్తుగడ
– దీనితో భయపడి అనుమతులివ్వని పీసీబీ
– జిల్లాకో బయో మెడికల్ ప్లాంట్లకు అనుమతి ఇచ్చిన గత టీడీపీ ప్రభుత్వం
– ఆసుపత్రి వ్యర్ధాల తరలింపు లక్ష్యంతో పనిచేసిన గత టీడీపీ సర్కారు
– దానిని నిలిపివేసిన గత వైసీపీ సర్కారు
– కొత్త ప్లాంట్లు రాకుండా బయో మెడికల్ మాఫియా అడ్డంకులు
– వైసీపీ-టీడీపీ మద్దతుదారులు కలసి ఆడుతున్న బయో డ్రామా
– వైసీపీ అధికారంలో ఉంటే వారితో కలసి టీడీపీ మద్దతుదారుల వ్యాపారం
– టీడీపీ అధికారంలో ఉంటే వారితో కలసి వైసీపీ వ్యాపారుల దందా
– ఎస్సీ కమిషన్, పీసీబీ, కోర్టుల్లో కేసులు, ఫిర్యాదులతో కొత్త వారిని అడ్డుకునే కుట్ర
– ఇంకా విజయనగరం, కడప జిల్లాల్లో ఏర్పాటు కాని బయో మెడికల్ ప్లాంట్లు
– గుంటూరు, విజయవాడలో మరికొన్ని ప్లాంట్ల అవసరం
– అయినా సీరియస్‌గా దృష్టి సారించని పీసీబీ మెంబర్ సెక్రటరీ, బోర్డు
– కేసుల భయంతో వెనకడుగేస్తున్న పీసీబీ
– దానిని సొమ్ము చేసుకుంటున్న బయో మెడికల్ మాఫియా
– ఇలాగే భయపడితే కొత్త ప్లాంట్లపై సర్కారు లక్ష్యం నీరుగారినట్లే
– మీడియాలో కథనాలు వచ్చినా పట్టని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
– పర్యావరణ-మున్సిపల్-వైద్యారోగ్య శాఖ మంత్రుల సంయుక్త సమీక్షలెప్పుడు?
( మార్తి సుబ్రహ్మణ్యం)
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఎలాగూ పీసీబీ వ్యవహారాలు పట్టవు. అక్కడి ఉద్యోగుల కష్టాలు, ఫిర్యాదులపై సమీక్షించే సమయం ఉండదు. నీటిని కలుషితం చేస్తూ ప్రజారోగ్యాన్ని కబళిస్తున్న రాంకీ, హెటిరో డ్రగ్స్ వంటి బడా కంపెనీలు, లెక్కలేనన్ని మరికొన్ని కెమికల్ కంపెనీల అరాచకాలకు బలవుతున్న జనం తిప్పలు అసలే పట్టవు. అదేమంటే.. పరిశ్రమలు పోకూడదంటారు. మరి జనం రోగాలపాలయి, వారి ప్రాణాలు గాలిలో కలిసినా ఫర్వాలేదా? ప్రభుత్వానికి కంపెనీలు కావాలా? ప్రజలు కావాలా? ఇది ఇప్పటివరకూ జనంలో జరుగుతున్న చర్చ.
కానీ అసలు వాటితో సంబంధం లేని.. గత టీడీపీ ప్రభుత్వంలో తీసుకున్న విధాన నిర్ణయాన్ని కూడా అమలు చేసే తీరిక లేదా? పట్టణప్రాంత ప్రజలను రోగాల సుడిగుండంలో పడేస్తున్న బయో మెడికల్ వ్యర్ధాలకు పరిష్కారమైన బయో మెడికల్ ప్లాంట్ల ఏర్పాటుపై చలనం లేకపోతే ఎలా? మెడికల్ ప్లాంట్ల నిర్మాణాలకు అనుమతివ్వకపోతే ఆ వ్యర్థాలను ఆసుపత్రుల వారు జనం మధ్య కుమ్మరించిఉ జనారోగ్యానికి చిల్లు పెడుతున్నారని గ్రహించకపోతే ఎలా? అన్నది ఇప్పుడు వినిపిస్తున్న విమర్శలు.
ఈ విమర్శలు, ఆరోపణలు, వ్యాఖ్యలు ఎలా ఉన్నప్పటికీ.. ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలోనే, ఆయనకు బయో మెడికల్ మాఫియా సవాలు విసరడమే ఆశ్చర్యం.
రాష్ట్రంలోని ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, ఎక్స్‌రేలు, డయాగ్నస్టిక్స్ నుంచి వచ్చే మెడికల్ వ్యర్ధాలను గ్రీన్-రెడ్ కవర్లుగా వేరు చేసి, వాటిని తీసుకుని శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలించే బయో మెడికల్ ప్లాంట్ల ఏర్పాటును గత టీడీపీ ప్రభుత్వం గుర్తించింది. ఆ ప్రకారంగా అప్పట్లూ ఉమ్మడి జిల్లాకు ఒ ప్లాంట్ చొప్పున అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. నిబంధనల ప్రకారం జిల్లాలో పదివేల బెడ్లకు ఒక బయో మెడికల్ ప్లాంటు ఉండాలి. దీనిని ఏర్పాటు చేయాలంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) అనుమతి ఇవ్వాలి. ఇదీ బయో మెడికల్ ప్లాంట్ల ఏర్పాటుకు ఉన్న నిబంధన.
ఇప్పుడు రాష్ట్రంలో కేవలం 10 బయో మెడికల్ ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి. నిజానికి ఇప్పటి పెరుగుతున్న రోగుల సంఖ్య, ఆసుపత్రులు-డిస్పెన్సరీలు, ఎక్స్‌రేలు, డయాగ్నస్టిక్స్ సంఖ్య ప్రకారం ఆ 10 ప్లాంట్లు ఏమాత్రం సరిపోవు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) నిబంధనల ప్రకారం మరో 8 బయో మెడికల్ ప్లాంట్లు ఏర్పాటుచేయాల్సి ఉంది. గతంలో ఉమ్మడి జిల్లాలు ఉన్నందున, జిల్లాకు ఒక బయో మెడికల్ ప్లాంటు నిబంధన పెట్టారు. కానీ ఇప్పుడు జిల్లాలు పెరిగి, పార్లమెంటుకు ఒక జిల్లా ఏర్పడినందున ఆ నిష్పత్తి ప్రకారం ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. దానికీ ఇప్పటివరకూ దిక్కులేదు.
నిజానికి కొత్త ప్లాంట్ల అనుమతి అంశంలో పీసీబీ చిత్తశుద్ధితోనే పనిచేస్తోంది. ఆ మేరకు కొన్ని జిల్లాల్లో కొత్త ప్లాంట్లకు అనుమతి కూడా ఇచ్చింది. ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తి చేసే ప్రక్రియలో చిత్తశుద్ధి ప్రదర్శిస్తోంది. ఆ మేరకు కొన్ని కొత్త ప్లాంట్లకు అనుమతి మంజూరు చేసింది. దానితో వారు చలాన్లు కట్టి, నిబంధనలు అనుసరించి ప్లాంట్ల నిర్మాణం కూడా పూర్తి చేసుకున్నారు. అయితే సరిపడా సిబ్బంది లేకపోవడం, పర్యవేక్షించే అధికారుల సంఖ్య కూడా స్వల్పంగా ఉండటం బయో మెడికల్ మాఫియాకు వరంగా మారింది.
కానీ ఈ రంగంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన బయో మెడికల్ ప్లాంట్ల మాఫియా, పీసీబీకి మోకాలడ్డుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీరికి పీసీబీలోని ఒక కీలక అధికారి సహకరిస్తున్నారని, వైసీపీ జమానాలో మెంబర్ సె్ర టరీగా పనిచేసిన ఓ అధికారి, మొదట వీరిని కులం కోణంలో ప్రోత్సహించారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దానితో నాటి నుంచి నేటి వరకూ వీరు తప్ప, కొత్త వారు వచ్చే అవకాశం లేకుండా పోయింది. వీరంతా రింగ్‌గా ఏర్పడి, కొత్తగా వచ్చే ప్లాంట్లను అడ్డుకునే కుట్రకు తెరలేపారు.
అంటే ఎవరయితే పీసీబీ, జిల్లా వైద్యాధికారి అనుమతి తీసుకుని ప్లాంటు నిర్మించారో వారికి వ్యతిరే ంగా పీసీబీ, డిఎంహెచ్, ఎస్సీ కమిషన్, హైకోర్టులో కేసులు వేయడం, ఫిర్యాదు చేయడం అలవాటయిపోయింది. ఆ కేసులు చివరాఖరకు కోర్టులో వీగిపోతున్నప్పటికీ, అందుకు నెలల సమయం పడుతోంది. ఈలోగా కొత్త ప్లాంట్ల యజమానులు ఆర్ధికంగా నష్టపోవడం, పాత ప్లాంట్ల మాఫియా ఆర్ధికంగా బలపడటం జరుగుతోంది.
ప్రధానంగా కొన్నేళ్ల నుంచి ఈ రంగంలో పాతుకుపోయి, ప్లాంట్ల మాఫియాకు నాయకత్వం వహించే ఓ యజమాని.. కులం కోణంలో తరచూ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయిస్తుండటం గమనార్హం. కొత్త ప్లాంట్ల యజమానులు చేసే చిన్న చిన్న సాంకేతిక పొరపాట్లను ఆధారం చేసుకుని, ఇక కొత్తగా ప్లాంట్లు రాకుండా అడ్డుకోవడమే.. ఈ బయో మెడికల్ మాఫియా అసలు లక్ష్యం అని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి.
అసలు వీరికి తమ సంస్థలోని ఒక ఉన్నతాధికారే దన్నుగా ఉన్నారని, వైసీపీ హయాంలో పీసీబీని కనుసన్నలతో శాసించిన ఒక మెంబర్ సెక్రటరీ.. కులం కోణంలో ఇచ్చిన దన్నుతోనే ఈ బయో మెడికల్ మాఫియా పెరిగి వటవృక్షంలా మారిందని పీసీబీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
నిజానికి ఈ మాఫియా ఫిర్యాదులను పెద్దగా పట్టించుకోవలసిన పనిలేదని, మెంబర్ సెక్రటరీ ధృడ ంగా వ్యవహరిస్తే కొత్త ప్లాంట్లు రావడం పెద్ద కష్టం కాదంటున్నారు. ఎందుకంటే.. కొత్తగా వచ్చే ప్లాంట్లపై ఫిర్యాదులు, కేసులు వేసే మాపియాకు గ్రీన్‌ట్రిబ్యునల్ ఇప్పటికే భారీ పెనాల్టీ వేసిందని, పీసీబీ కూడా అనేకసార్లు ప్లాంట్లను మూసివేసి పెనాల్టీలు కూడా విధించిందని గుర్తు చేస్తున్నారు.
అయితే గత ఏడాదిన్నర నుంచి పీసీబీకి మెంబర్ సెక్రటరీ ఉన్నప్పటికీ, ఆయన పూర్తి స్థాయిలో పీసీబీకి సమయం కేటాయించడం లేదు. రోజూ కార్యాలయానికి రావడమూ తక్కువే. కారణం.. ఆయనకు మరో నాలుగు శాఖలు అదనంగా ఉండటమే. పైగా ఆయన తన వద్దకు వచ్చిన ప్రతి అంశాన్ని, బోర్డుకు నెట్టేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
దీన్ని బట్టి పీసీబీకి కార్మిక చట్టాలు-పర్యావరణంపై అవగాహన ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారికి పూర్తి స్థాయి బాధ్యతలు ఇస్తే తప్ప, ఈ సమస్యకు మోక్షం లేనట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ప్యాక్టరీ నిబంధనలే పీసీబీ సంబంధిత పరిశ్రమలకూ వర్తిస్తాయి. కాకపోతే ఫ్యాక్టరీ విభాగానికి కంపెనీలకు మూయించే అధికారం ఉండదు. ఆ అవకాశం ఒక్క పీసీబీకే ఉంటుంది. ఈ కోణంలో సంబంధిత శాఖ మంత్రి కూడా అయిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇప్పటివరకూ దృష్టి సారించకపోవడమే ఆశ్చర్యం.
పైగా తన శాఖలో కీలక విభాగం అయిన పీసీబీకి మోకాలడ్డుతున్న బయోమెడికల్ మాఫియా.. పరోక్షంగా తనకే సవాల్ విసురుతోందని, పవన్ కల్యాణ్ గుర్తించకపోవడం మరో ఆశ్చర్యం. ఈ మాఫియాను అణచివేసి, కొత్త ప్లాంట్లకు- ఇప్పటికే అనుమతి పొందిన ప్లాంట్ల ప్రారంభానికి మార్గం సుగమం చేయాలంటే.. డిప్యూటీ సీఎం-మున్సిపల్ శాఖ మంత్రి-వైద్యారోగ్య శాఖమంత్రి సంయుక్త సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందంటున్నారు.
బయో మెడికల్ ప్లాంట్లతో లాభమేంటి?
నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లోని పెద్ద-మధ్యంతర-చిన్న స్థాయి ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, ఎక్స్‌రే ల్యాబ్‌లు, డయాగ్నస్టిక్స్ నుంచి రోజూ కిలోల చొప్పున ఆసుపత్రి వ్యర్ధాలు వస్తుంటాయి. అంటే కత్తెర, కాటన్, గ్లవుజ్, సిరెంజ్, స్లైన్ బాటిల్సు, నీడిల్స్, మాస్కులు వంటివన్నమాట.
నిజానికి వీటిని టీడీపీ అధికారంలోకి రాకముందు వరకూ.. సమీపంలోని కాలువలు, చెత్తకుండీల్లో పారేసేవారు. దానివల్ల ప్రజలు రోగాలబారిన పడేవారు. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం, వాటిని నియంత్రించేందుకు.. బయో మెడికల్ ప్లాంట్ల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఆ మేరకు ఏర్పాటయిన ప్లాంట్లు ప్రతిరోజూ ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ల్యాబ్‌ల నుంచి మెడికల్ వ్యర్ధాలను తీసుకువెళ్లి, వాటిని 24 గంటల్లో శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలిస్తాయి. దానివల్ల పర్యావరణం కాపాడబడటమే కాకుండా, పట్టణ ప్రాంతాల్లో నీరు కలుషితం కాకుండా ఉంటుంది.
దానితో మున్సిపాలిటీలకు పని భారం తగ్గడమే కాకుండా, ప్రజలు రోగాల బారిన పడకుండా రక్షిస్తాయి. అందుకు ప్లాంట్ల యజమానులు, ఆసుపత్రుల నుంచి కిలోకు ఇంత అని రేటు నిర్ణయించి వసూలు చేస్తాయి. ఇదీ స్థూలంగా బయో మెడికల్ ప్లాంట్ల వల్ల వచ్చే లాభాలు.
బెడ్ల నిష్పత్తిలో ప్లాంట్లకు అనుమతి
పీసీబీ నిబంధనల ప్రకారం పదివేల బెడ్ల చొప్పున ఒక బయో మెడికల్ ప్లాంటుకు అనుమతి ఇస్తారు. ఆ మేరకు వాటి కెపాసిటీ నిర్ణయిస్తారు. అంతకుమించి ఆసుపత్రి వ్యర్ధాలు తీసుకునేందుకు అనుమతి ఉండదు. ఆ వ్యర్ధాలు తీసుకునే ప్లాంట్ల నిర్వహకులు.. వాటిని గ్రీన్-రెడ్ కవర్లలో తీసుకుని, వాహనాల్లో ఏరోజుకారోజు తీసుకుని వెళ్లి, 48 గంటల్లో వాటిని డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది.
అయితే వ్యర్ధాల బరువులో ఈ మాఫియా చేస్తున్న గోల్మాల్, వారికి కాసులు కురిపిస్తున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. ఉదాహరణకు గ్యాప్ అనాల్సిసిస్ రిపోర్టు ప్రకారం.. శ్రీకాకుళంలో సామర్థ్యానికి మించి, రెండు రెట్లు ఎక్కువగా చేస్తున్నారని పీసీబీ నిర్ధారించింది. ఒక్క శ్రీకాకుళంలోనే మిగిలిన అన్ని ప్లాంట్ల కంటే ఎక్కువసార్లు పీసీబీ నిబంధనలు అతిక్రమించి, ప్లాంట్లు నడుపుతారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ మేరకు పీసీబీ.. నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్‌కు లేఖ రాయటం విశేషం. అయినా కులం పేరుతో అధికారులను బెదిరించి, వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు.
బెడ్లపై సంపాదన
బయో మెడికల్ ప్లాంట్లు ఆసుపత్రుల నుంచి ఒక్కో బెడ్‌కు 7 నుంచి 8 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆసుపత్రులే కాకుండా.. నాన్ బెడెడ్ ఆసుపత్రుల నుంచి కూడా అదనపు ఆదాయం సమకూరుతుంది. అంటే క్లినిక్స్, డెంటల్, బ్లడ్ బ్యాంకులు, ల్యాబుల నుంచి నెలకు సుమారు 3 లక్షల ఆదాయం ఉంటుంది. దాని ద్వారా నెలకు సుమారు 30 లక్షలు సంపాదిస్తున్నట్లు అర్ధమవుతుంది.
ఇవి కాకుండా బార్‌కోడింగ్ కలిగిన కవర్లు అమ్ముకోవచ్చు. ఈ వ్యవహారంలో ప్లాస్టిక్ ప్రధానం. దానిని ఆథరైజ్డ్ రీసైక్లింగ్ కంపెనీలు వీరికి డబ్బులిచ్చి కొనుగోలు చేస్తుంటాయి. దీనికి ఎక్కువ ధర ఉంటుంది. ఆ ప్రకారంగా నెలకు 6 నుంచి 7 లక్షల అదనపు ఆదాయం ఉంటుంది. అంటే సిబ్బంది జీతాలు, కరెంటు బిల్లులు పోగా నెలకు 30 లక్షలు ఒక్కో ప్లాంటు యజమానులకు మిగులుతుందన్నమాట.
ఇదొక్కటే కాదు. కొత్తగా ఏర్పాటుచేసే ఆసుపత్రుల నుంచి కూడా ప్లాంట్ల యజమానులకు ఆదాయం ఉంటుంది. అంటే ఉదాహరణకు ఎవరైనా కొత్తగా ఆసుపత్రి ప్రారంభించాలంటే ముందు డీఎంహెచ్ఓకు దరఖాస్తు చేసుకోవాలి. డీఎంహెచ్ఓ దానిని పీసీబీ అనుమతి కోసం పంపిస్తారు. దానికి పీసీబీ నుంచి ‘‘మీరు కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ (ప్లాంట్ల)తో ఒప్పందం చేసుకో’’మని సమాధానం వస్తుంది. అందుకు ప్లాంట్ల యజమానులు దరఖాస్తుదారుల నుంచి 10 నుంచి 50 వేల వరకూ డబ్బులు వసూలు చేస్తుంది. అప్పుడే కొత్త ఆసుపత్రులకు అనుమతి వస్తుంది.
కిం కర్తవ్యం?
బయో మెడికల్ మాఫియా దెబ్బకు ప్రభుత్వ శాఖ అయిన పీసీబీ కూడా విలవిల్లాడుతున్న నేపథ్యంలో.. అదే పీసీబీ నుంచి ఇప్పటికే అన్ని అనుమతులు తీసుకుని, ప్లాంట్ల నిర్మాణాలు కూడా పూర్తి చేసి, ఉత్పత్తి కోసం వేచిచూస్తున్న వారికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భరోసా ఇస్తే తప్ప, భవిష్యత్తులో కొత్త ప్లాంట్లు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అయితే ఈ మాఫియాకు రాజకీయ అండ కూడా ఉండటం.. దానికి తోడు కులం కార్డు కూడా అదనపు బలం కావడమే తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో తనను సవాల్ చేస్తున్న బయో మెడికల్ మాఫియాను పవన్ కల్యాణ్ ఏవిధంగా దారికి తీసుకువస్తారో చూడాలి.
టీడీపీ-వైసీపీ బిజినెస్ దందా
ఈ బయో మెడికల్ మాఫియా రాజకీయంగా కూడా తెలివైన ఎత్తుగడతో వెళుతుండటం ఆశ్చర్యం. అంటే టీడీపీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన ప్లాంటు యజమాని.. మొత్తం వ్యవహారం నడిపించి, కొత్త వారిని అందులోకి రాకుండా అడ్డుకుంటారు. అదే వైసీపీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీకి చెందిన ప్లాంటు యజమాని జగన్ ప్రభుత్వంలో పలుకుబడి వినియోగించి, కొత్త వారిని రాకుండా చక్రం తిప్పుతుంటారు. ఈ విధంగా బయో మెడికల్ మాఫియా రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతోంది.
పీసీబీ చైర్మన్‌కే ఎసరు పెట్టిన బయో మాఫియా
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ప్రభుత్వంలో లాబీయింగ్ చేసి.. చక్రం తిప్పే బయో మెడికల్ మాఫియా దెబ్బకు ఏకంగా పీసీబీ చైర్మన్ వెళ్లిపోయారంటే, బయో మాఫియా పవరేంటో అర్ధమవుతోంది. జగన్ జమానాలో పీసీబీ చైర్మన్‌గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఏ.కె.పరీడాను.. నాటి మెంబర్ సెక్రటరీ దన్నుతో, బయో మెడికల్ మాఫియా తొలగించిందన్న ప్రచారం విస్తృతంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీడీపీతో సంబంధ బాంధవ్యాలున్న విజయవాడకు చెందిన ఒక ప్లాంటు యజమాని ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్నారని, జగన్ ప్రభుత్వ హయాంలో గుంటూరుకు చెందిన ఓ యజమాని చక్రం తిప్పారట. ఆయనకు మొత్తం ప్లాంట్లు ఉన్నాయంటున్నారు.