బంజారాహిల్స్‌లో TOI ఎదురుగా ఉన్న పాత ఆంధ్రజ్యోతి మూత పడింది . మేమంతా రోడ్లు మీద పడ్డాం.
ఎక్కడన్నా చేరదామంటే , ఇపుడున్నన్ని పత్రికలు అప్పుడు లేవు.
ప్రెస్‌క్లబ్‌లో కూర్చొని భవిష్యత్ ముఖచిత్రం ఏమిటి? అని ఆలోచించేవాళ్లం…
కొన్ని రోజుల తరువాత ఆనాటి ప్రెస్ అకాడమీ ఛైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు గారి నుండి పిలుపు వచ్చింది.
టీ, బిస్కట్లు ఇచ్చి…
‘‘ పేపర్ ఆగి పోయింది కదా… ఎలా బతుకుతున్నావ్ బ్రదర్ ?’’ అని అడిగారు.
‘‘ ఒక ngo కు కంటెంట్ వర్క్ చేస్తున్నాం. నా వరకు పర్వాలేదు సార్! ’’ అన్నాను.
మిగతా జర్నలిస్టుల పరిస్థితి ఏంటని పొత్తూరి ఆరా తీశారు.
‘‘ చాలా దయనీయంగా ఉంది. డెస్క్‌లో కూర్చొని రాయడం తప్ప మరో విద్య తెలీక చాలా కష్టాలు పడుతున్నారు. పిల్లల ఫీజులు, ఇంటి అద్దెలు కట్టలేక అప్పులు పాలవుతున్నారు…’’ అని చెప్పాను.
కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడాయన. కళ్ల జోడు తీసి కండువాతో కళ్ల కింద చెమ్మను తుడుచుకున్నాడు.
టేబుల్ సొరుగులో నుండి ఒక కవర్ తీసి…
‘‘ జీతం లేకపోయినా ఒక నెల రోజులు బతికే స్తొమత నాకుంది. ఇది నా నెల జీతం. అవసరం ఉన్న వారికి ఇవ్వండి, సరిపోక పోతే ఇంకా ఇస్తాను. !’’ అన్నారు.
పొత్తూరి గారి చేతులను అందుకొని కళ్లకు అద్దుకున్నాను.
‘‘ కష్టాల్లో ఉన్న పదిమందికి చెప్పి మీ దగ్గరకు పంపుతాను.
మీరే ఇవ్వండి సార్!’’ అని బూర్గుల రామకృష్ణారావు భవన్ నుండి బయటకు వచ్చాను.
జర్నలిజంలో నాకున్న అల్పమైన అనుభవంలో సాటి జర్నలిస్ట్ ల కష్టాలకు స్పందించిన అరుదైన సంపాదకుడు, పాత్రికేయ విలువలతో పాటు మానవీయ విలువలున్న మనిషి పొత్తూరి.
నా వల్ల ఎవరికీ ప్రయోజనం లేదనే గిల్టీఫీలింగ్ తో నా బర్త్ డే ని ఏనాడు గుర్తు చేసుకోలేదు.
కానీ….
పొత్తూరి లాంటి మానవీయులు జన్మించిన కాలాన్ని తప్పకుండా స్మరించుకోవాలి.
ఫిబ్రవరి 8, (1934) ఆయన పుట్టిన రోజు.
– శ్యాంమోహన్