– ఆ సమయం ముగిసిపోయింది
– మనం ఏం చేశామో, ఏం చేయబోతున్నామో చెబుదాం
– సభలో సమన్వయం అవసరం
– 99 రోజుల ప్రజాపాలనపై జనంలోకి వెళ్లాల్సిందే
– సీఎల్పీ భేటీలో సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్ :ప్రజా ప్రభుత్వంలో మూడవ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం. ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి గవర్నర్ ప్రసంగంలో వివరించారు. గవర్నర్ ప్రసంగం మన ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లాంటిది. ఇక గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం అయిపోయింది. మన భవిష్యత్ ప్రణాళికలు, ప్రజలకు ఏం చేయబోతున్నామనే దానిపై దృష్టిసారించాలి.
సభలో మాట్లాడే అంశాలపై విప్ ల మధ్య సమన్వయం ఉండాలి. సభలో చర్చ పక్కదారి పట్టకుండా, సభా సమయం వృధా కాకుండా సమర్థవంతంగా నడిపేలా చూడాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు సబ్జెక్ట్ మాట్లాడటానికి కూడా సమయం ఇవ్వలేదు. సీఎల్పీ నేతగా ఉన్న భట్టి విక్రమార్కకు, జానారెడ్డికి కూడా మైక్ ఇవ్వలేదు. సెషన్ మొత్తం సస్పెండ్ చేసి ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు నన్ను సభకు రాకుండా చేశారు.
అసెంబ్లీ సమావేశాల సమయంలో హాజరు విషయంలో ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహించొద్దు. మహిళా శాసన సభ్యులు హాజరుతో పాటు చర్చల్లో పాల్గొనాలి. సభా చర్చల్లో మహిళా సభ్యుల భాగస్వామ్యం అవసరం.అసెంబ్లీ కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోవాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర రాష్ట్రాలు పర్యటించి సమస్యలు, ఆయా ప్రభుత్వ విధానాలను అధ్యయనం చేయాలి. రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజీ ఉండదు.. ఆది వ్యవస్థ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుంది.
వ్యవస్థను నిలబెట్టుకుంటేనే రాజకీయాల్లో మనుగడ ఉంటుంది. పార్టీ, ప్రభుత్వ పరమైన లైన్ లోనే అందరూ స్పందించాలి. ఇది మన ప్రభుత్వం.. ఇప్పుడు మనం వేసుకునే రోడ్ మ్యాప్ నే వచ్చే ఎన్నికలకు ఎజెండా అవుతుంది. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యపై ఫోకస్ పెట్టండి. 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందే