* నేటి నుంచి ఉచిత విద్యుత్ అమలు
* మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు
* మర మగ్గం నేతన్నలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్
* ఏడాదికి రూ.150 కోట్ల వ్యయం
* ఏడాదికి మగ్గం నేతన్నలకు రూ.8,640లు,
* మర మగ్గం నేతన్నలకు రూ.21,600లు ఆదా
* రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్లు, మినీ కస్టర్ల ఏర్పాటు
* ధర్మవరంలో రూ.38.31 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్
* పిఠాపురంలో రూ.12 కోట్లు, మంగళగిరిలో రూ.22.35 కోట్లతో ప్రత్యేక హ్యాండ్లూమ్ ప్రాజెక్టుల ఏర్పాటు
* చేనేత సహకార సంఘాలకు బకాయిల చెల్లింపులు
* త్వరలో నేతన్న భరోసా పథకానికి శ్రీకారం
* ఆప్కోలో డిజిలైజేషన్ కు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు
* నేతన్నల ఆరోగ్య రక్షణకు యూనివర్సల్ హెల్త్ పాలసీ
* నేతన్నల గౌరవప్రద జీవనమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
అమరావతి : రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. నేతన్నలకు వ్యక్తిగత లబ్ధి కలిగించేలా ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, మరో పరిశ్రమ అభివృద్ధికి పాలసీలు తీసుకొస్తోంది. ఆనాడు అన్న ఎన్టీఆర్ కూడు, గూడు, గుడ్డ నినాదంతో చేనేత రంగానికి అండగా నిలిచారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు చేనేత రంగ అభివృద్ధికి ఎన్నో ప్రణాళికలు రూపొందిస్తూ వస్తున్నారు.
నూతన టెక్స్ టైల్స్ పాలసీలు అమలు చేయడం, మెగా క్లస్టర్లు, టెక్స్ టైల్స్ పార్కులు ఏర్పాటు చేయడంతో పాటు నేతన్నలకు వ్యక్తిగత లబ్ధి కలిగేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షా నాలుగు వేల చేనేతల కుటుంబాలకు మేలు కలిగే ఉచిత విద్యుత్ పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈ పథకం ద్వారా ఏటా రూ.150 కోట్ల భారం ప్రభుత్వంపై పడనుంది.
కూటమి రాకతో చేనేతకు మహర్దశ
జగన్ ప్రభుత్వ తీరుతో పూర్తిగా నిర్వీర్యమైపోయిన చేనేత రంగానికి 2024లో సీఎం చంద్రబాబు ఏర్పాటుతో మహర్దశ ప్రారంభమైంది. నేతన్నలకు ఏడాది పాటు ఉపాధి కల్పనే లక్ష్యంగా సీఎం చంద్రబాబునాయుడు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 92,724 మంది నేతన్నలకు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెన్షన్ మొత్తం పెంచారు. చేనేతలకు త్రిఫ్ట్ కింద ప్రభుత్వ వాటాను 8 నుంచి 16 శాతానికి పెంచారు.
ఈ పథకం కింద ప్రతి బడ్జెట్ లోనూ రూ.5 కోట్లు చొప్పున్న కేటాయిస్తూ వస్తున్నారు. క్యాష్ క్రెడిట్ కార్డులతో సహకార సంఘాలకు బ్యాంకు రుణాలు అందజేస్తున్నారు. స్మాల్ క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం(ఎస్.డి.పి.) కింద 10 చిన్న క్లస్టర్లను మంజూరు చేశారు. 15 శాతం రాయితీపై నూలు సబ్సిడీ పథకం అమలు చేస్తున్నారు. 2,640 మంది చేనేత కార్మికులకు ముద్ర పథకం కింద రూ.24.43 కోట్లు అందజేశారు.
చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా చర్యలు తీసుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నారు. 2024 ఏప్రిల్ నుంచి 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు రూ.78.73 కోట్ల నగదు పరపతి సౌకర్యం కల్పించాం. నేతన్నల ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనిలో భాగంగా యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా నేతన్నల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు.
త్వరలోనే నేతన్న భరోసా పథకం కింద చేనేతలకు రూ.25 వేల ఆర్థిక సాయం అందించనున్నాం. గత వైసీపీ ప్రభుత్వం కంటే అదనంగా రూ.వెయ్యిలు ఇవ్వనున్నారు. చీరాలలో నేతన్నల ఆదాయంతో పాటు చేనేత ఉత్పత్తుల పెంపుదలకు జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్(ఎన్ఆర్ఎల్ఎం) కింద రూ.4.17 కోట్లు మంజూరయ్యాయి. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం(ఎన్.హెచ్.డి.పి)లో భాగంగా ధర్మవరంలో రూ.38.31 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నారు.
పిఠాపురంలో రూ.12 కోట్లు, మంగళగిరిలో రూ.22.35 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టుల ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్రంలో చిన్న క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం(ఎస్.సి.డి.పి)లో భాగంగా రూ.10.44 కోట్లతో పది క్లస్టర్లను మంజూరయ్యాయి. సహాయక క్లస్టర్లతో పాటు ఇతర క్లస్టర్లకు కూడా ఆర్థిక సాయం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. చేనేత రంగ అభివృద్ధి కోసం ముడి సరుకులపై సబ్సిడీ, నెట్ ఫండ్ అందజేస్తూ, ఆధునిక డిజైన్లపై శిక్షణ అందిస్తున్నారు. పనిముట్ల కొనుగోలుకు 90 శాతం వరకు సబ్సిడీతో అందజేస్తున్నారు.
అవార్డుల వెల్లువ
కూటమి ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏపీ చేనేత రంగం అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది. ‘వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్’ పథకం కింద రాష్ట్రానికి వచ్చిన 10 అవార్డులలో 4 అవార్డులు చేనేత రంగానికే దక్కడం విశేషం. ఆప్కోలో డిజిటలైజేషన్ చేపట్టినందుకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించింది.
ఫోన్ పే ద్వారా వస్త్రాలు కొనుగోలు, విధుల్లో పారదర్శకతకు ముఖాధారిత హాజరు, కొనుగోలు చేసిన వస్త్రాలకు కంప్యూటర్ బిల్లింగ్ వంటి ఎన్నో సాంకేతికతను ప్రవేశపెట్టాం. ఈ కామర్స్ సంస్థల ద్వారా వినియోగదారుల ఇళ్లకు నేరుగా చేనేత వస్త్రాలను ఆప్కో ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నారు. ఆప్కో చేపట్టిన సంస్కరణలతో చేనేత అమ్మకాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆప్కో చేపట్టిన డిజిటిలైజేషన్ కు కేంద్ర ప్రభుత్వం స్కోచ్ అవార్డు ప్రకటించింది.
ఉచిత విద్యుత్ నేతన్నలకు ఆర్థిక పరిపుష్టి
నేతన్నల కుటుంబాల్లో వెలుగులు నింపేలా కూటమి ప్రభుత్వం కీలకమైన ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుడుతోంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. మగ్గంపై నేసే నేతన్నలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ మగ్గాల నేతన్నలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేయబోతున్నాం.
ఈ పథకం ద్వారా ఏడాదికి మగ్గం నేతన్నలకు రూ.8,640లు, మర మగ్గం నేతన్నలకు రూ.21,600లు ఆదా అవుతుంది. 1, 04,000 మంది చేనేత కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకం ద్వారా లబ్ధి పొందుతాయి. ఈ పథకం అమలైతే నేతన్నలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందనడంలో సందేహం లేదు.
నేతన్నలకు గౌరవప్రద జీవనమే లక్ష్యం
గత ప్రభుత్వ తీరు వల్ల ఆప్కో నష్టాల్లో కూరుకుపోయింది. ఆప్కో పేరుతో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.120 కోట్లను గత ప్రభుత్వం తీసుకొచ్చి, పక్కదారి పట్టించింది. దీనివల్ల ఆప్కో సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత ఆప్కోను గాడిలో పెడుతున్నాం. చేనేత సహకార సంఘాల బకాయిలను చెల్లిస్తున్నాం.
చేనేత వస్త్రాలపై ఆప్కో, చేనేత సంఘాలకు జీఎస్టీ మినహాయింపు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా ప్రత్యేక ఎగ్జిబిషన్లు నిర్వహించి 40 శాతం, 50 శాతం డిస్కౌంట్లలో చేనేత ఉత్పత్తులు విక్రయిస్తున్నాం. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆప్కో షో రూమ్ ల్లో అమ్మకాలు పెరిగాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేనేత వస్త్రాలను ధరిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. ప్రతి పండుగకు, వారానికోసారి రాష్ట్ర ప్రజలందరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి కళాకారులకు తోడ్పడాలని పిలుపునిస్తున్నారు.
ఉచిత విద్యుత్ నేతన్నలకు మరింత ఆర్థిక దన్ను లభించనుంది. మా కూటమి ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే.. చేనేత కుటుంబాలు గౌరవమైన, ఆర్థిక భరోసాతో కూడిన జీవనం సాగించడం. ఇందుకోసం ఎన్ని కోట్లయినా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాం.
– సవిత
( ఆంధ్రప్రదేశ్ చేనేత, జౌళి శాఖ మంత్రి)