– రైతుల పక్షపాతి ఈ ప్రభుత్వం
– దేశంలోనే 2 లక్షల లోపు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం
– రైతులకు చేసే మేలు ఓర్వలేకే ప్రభుత్వంపై విమర్శలు
– రైతులపై కపటప్రేమ చూపెడుతున్న ప్రతిపక్ష నాయకులు
– బిఆర్ఎస్ నాయకుల విమర్శలకు మంత్రి తుమ్మల ఘాటు జవాబు
హైదరాబాద్: భారతదేశంలో చిన్న వయస్సున్న తెలంగాణ రాష్ట్రం, పెద్ద రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచే విధంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోందని వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా నిలుస్తూ, ఇచ్చిన మాటకు కట్టుబడి వ్యవహరిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా ఉన్నప్పటికి, ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి అధికారంలోకి వచ్చిన మొదటి పంటకాలంలోనే 2 లక్షల లోపు ఉన్న పంట రుణమాఫీని చేసి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నమని మంత్రి తెలిపారు. ఈ నిర్ణయం దేశంలోనే ఒక మైలురాయిగా నిలిచిందని, ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా మారిందని పేర్కొన్నారు. ఇదే విషయం గత పార్లమెంట్ సమావేశాలలో దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణ రైతుల పంట రుణబాకీలు అతి తక్కువ అని కేంద్రం సమర్పించిన నివేదిక ద్వారా స్పష్టం అయిందని అన్నారు.
దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికి ఇలాంటి సాహసమైన నిర్ణయాన్ని తీసుకోలేకపోయాయని, కానీ మా ప్రభుత్వం మాత్రం రైతుల సంక్షేమం కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలు అర్థరహితమైనవని, పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమే అని మండిపడ్డారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రైతులకు రుణమాఫీ చేశారో, రైతులకు ఇంకా గుర్తుందని.. ప్రభుత్వాన్ని మెచ్చుకోకపోయిన కూడా ఇప్పటికయినా విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం 2014వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రం మిగులు బడ్జెట్ తో ఉందని, అయినప్పటికి వారు ఇచ్చిన లక్ష వరకు రుణమాఫీని ఒకేసారి చేయలేక పోయారని అన్నారు. దాంతో రైతులకు రుణమాఫీ కాకపోగా.. 2630 కోట్ల వడ్డీ భారం పడిందన్నారు. అయినప్పటికి రైతులు నమ్మి రెండో సారి కూడా అధికారం అప్పజెప్తే.. 2018 – 23 వరకు అధికారంలో ఉండి మరోసారి రుణమాఫీపై రైతులను మోసం చేశారని విమర్శించారు.
2018 లో లక్ష వరకు పంట రుణమాఫీ చేస్తామని చెప్పి, దానిని దశలవారీగా అమలు చేయడం ద్వారా 8515 కోట్ల వడ్డీభారం పడటంతో పాటు, 8379 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టారని ఆరోపించారు. అంతేకాక1419 కోట్ల రూపాయలు ఖాతాలు సరిగ్గా లేనందున వెనక్కి వెళ్లిపోయాయని పేర్కొన్నారు. ఈ విధంగా అధికారంలో ఉన్న పదేళ్ల పాటు రైతులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఇప్పుడు రైతులపై ప్రేమ చూపించడం కపటత్వానికి నిదర్శమని అన్నారు.
అయినప్పటికీ మా ప్రభుత్వ అధికారంలోకి రాగానే రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకున్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి సాహసోపేతమైన నిర్ణయంతో, రైతులకు ఎలాగైనా ఒకేసారి పంట రుణమాఫీ చేయాలనే కృతనిశ్చయంతో 20,616.89 కోట్ల పంట రుణమాఫీని చేశామని, దాంతో 25,35,964 మంది రైతులు లబ్ధిపొందారని మంత్రి తుమ్మల అన్నారు.
రుణమాఫీ అమలులో పారదర్శకత కోసం ముందుగా బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించి, 2 లక్షల లోపు ఉన్న రైతుల ఖాతాల వివరాలను సేకరించామని చెప్పారు. బ్యాంకులు అందించిన 25,35,964 మంది రైతుల డేటా ఆధారంగా రుణమాఫీని అమలు చేసినట్లు వివరించారు. గత ప్రభుత్వంలా ఒడ్డు చేరే వరకు ఓడ మల్లన్న, ఒడ్డు చేరాక బోడి మల్లన్న అన్న చంధంగా… నిర్లక్ష్యంగా కాకుండా, ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.
కొన్ని ఖాతాల్లో లోపాలు ఉన్నప్పటికీ, వాటిని సరిచేయడానికి అధికారులు గ్రామాల వారీగా, ఇంటింటికి వెళ్లి ఆధార్ లింక్ చేసి, అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ ప్రయోజనం అందేలా కృషి చేశారని తెలిపారు. ఇది మా ప్రభుత్వానికి ఉన్న కట్టుబాటును, నిబద్ధతను స్పష్టంగా చూపిస్తోందన్నారు.
ప్రస్తుతం బిఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప మరే పనీ చేయడం లేదని, రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు నిజంగా మేలు జరుగుతుంటే దాన్ని ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారని అన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోని వారు, ఇప్పుడు రైతుల పక్షాన మాట్లాడటం చూస్తుంటే అది కపట ప్రేమకు పరాకాష్టగా కనిపిస్తోందని మంత్రి తుమ్మల విమర్శించారు. రైతులు ఈ విషయాలన్నింటి బాగా గమనిస్తున్నారని, వాస్తవాస్తవాలు వారికి తెలుసన్నారు.
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయమని, భవిష్యత్తులో కూడా రైతులకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.