– 22 నెలల్లో సంస్కరణలతో సమూల మార్పులు
– భూవివాదాలతో ప్రజలకు మానసిక క్షోభ మిగిల్చిన గత పాలకులు
– వ్యవస్థలను విధ్వంసం చేసి…ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా చేసిన గత ప్రభుత్వం
– నాటి రీసర్వే తప్పులను సరిదిద్దుతూ రీ సర్వే 2.0 కార్యక్రమం
– రాజముద్రతో, సెక్యూరిటీ ఫీచర్స్‌తో కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు
– 2027 మార్చి నాటికి రీసర్వే 2.0 ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యం
– 1.37 లక్షల విలేజ్ సర్వీస్ ఇనాం భూముల్ని 22ఏ నుంచి తొలగిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం
– 2016 కంటే ముందు ప్రభుత్వ హౌసింగ్ స్కీంలో పట్టా పొందిన ప్రతి ఇంటికీ రిజిస్ట్రేషన్ చేయించుకునే సౌలభ్యం
– ముఖ్యమంత్రి సంకల్పంతో 22 నెలల్లో ఎన్నో అడుగులు..
– మార్పు కనిపిస్తుండడంపై ప్రజల్లో సంతృప్తి
అమరావతి : ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టాక ఈ 22 నెలల్లో సమూల మార్పులు, సంస్కరణలతో రాష్ట్ర రెవెన్యూ శాఖకు కొత్త జవసత్వాలు వచ్చాయి. ఆ శాఖపై నాడు ఉన్న ప్రజా వ్యతిరేకత, అవినీతి ముద్ర నేడు చెరిగిపోతోంది. అప్పుడు అత్యధిక అర్జీలు, సమస్యలతో మిగిలిన శాఖల కన్నా ముందున్న రెవెన్యూ శాఖలో ఇప్పుడు పనితీరు ఎంతో మెరుగయ్యింది. రెవెన్యూ వ్యవస్థ రోజురోజుకూ బలపడుతోంది.
సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపడంతో రెవెన్యూ సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతూ వచ్చాయి. అర్జీల సంఖ్య తగ్గుతోంది. గతంతో పోల్చుకుంటే రెవెన్యూ సేవలపై ప్రజల్లో ప్రస్తుతం సంతృప్తి వ్యక్తమవుతోంది. దీన్ని మరింత పెంచాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి ఉన్నారు. భూ వివాదాలతో ఎవరూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఇందుకు అవసరమైన కొత్త చట్టాలు తెచ్చారు. పనికిరాని చట్టాల్ని రద్దు చేశారు.
ఆ ఐదేళ్లూ రెవెన్యూ శాఖ నిర్వీర్యం
ప్రజలకు నేరుగా సంబంధమున్న, అత్యంత దగ్గరైన శాఖల్లో రెవెన్యూ శాఖ ముందు వరుసలో ఉంటుంది. కుల ధృవీకరణ పత్రం నుంచి ఆదాయం, జనన, మరణ ధృవపత్రాల వరకు…, పట్టాదార్ పాస్ పుస్తకాల నుంచి భూ సంబంధిత సేవల వరకూ తెల్లారితే రెవెన్యూ ఆఫీసుకే వెళ్తాం…. అంత కీలకమైన శాఖను గత ప్రభుత్వం ఎలా భ్రష్టుపట్టించిందో, ప్రజలను ఎంతలా ఇబ్బంది పెట్టిందో తెలిసిందే. ఒక వ్యవస్థ మొత్తాన్ని విధ్వంసం చేసిన తొలి ప్రభుత్వంగా రాష్ట్ర చరిత్రలో వైసీపీ సర్కార్ నిలిచిపోయింది.
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి… ఐదేళ్లలో రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లిన దౌర్భాగ్య పాలన వైసీపీది. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, దందాలు, రికార్డుల ట్యాంపరింగ్, ఫైళ్ల దహనం, ప్రైవేట్ భూములకు రక్షణ లేని పరిస్థితి తీసుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో భయాందోళన కలిగించారు. రీ సర్వే పేరు చెప్పి కొత్త సమస్యలు సృష్టించారు.
కుటుంబాల మధ్య చిచ్చు పెట్టారు
తమ అక్రమాలకు, అవినీతి కూడా నాటి పాలకులు రీ సర్వేను వేదికగా చేసుకున్నారు. భూ వివాదాల కారణంగా కుటుంబాలు విడిపోయేంతలా గత ప్రభుత్వంలో వ్యవహరించారు. 22ఏ జాబితాతో ఇబ్బందులు కలిగించారు. ఇక్కడితో ఆగలేదు… అటవీ భూముల ఆక్రమించడం, ఫాం హౌస్‌లు కట్టుకోవడం వంటివి నిస్సిగ్గుగా చేశారు. ప్రైవేటు ఆస్తులు, ప్రజల భూములను వాళ్ల ఆస్తులు అన్నట్టుగా పట్టాదారు పాస్ పుస్తకాలు, సర్వే రాళ్ల పైనా నాటి పాలకులు బొమ్మలు వేయించుకున్నారు. రైతుకు భూమితో బంధం లేకుండా కుట్ర చేశారు.
గత ప్రభుత్వం అనుసరించిన విధానాలతో ప్రతీ ఒక్కరూ మానసిక క్షోభకు గురయ్యారు. వ్యవస్థను నాశనం చేయడమే కాదు… సర్వే రాళ్లపై వారి బొమ్మలకు రూ.660 కోట్లు తగలేశారు. పట్టాదారు పాసుపుస్తకాలపై తమ బొమ్మలకు రూ.22 కోట్లు ఖర్చు చేశారు. అందుకే బొమ్మల పిచ్చోళ్లకు ఎన్నికల్లో జనం బొమ్మ చూపించారు.
హామీ నిలబెట్టుకున్న ప్రజా ప్రభుత్వం
ఎన్నికల ముందు ప్రజల ఆస్తులు, భూముల భద్రత విషయంలో ఎన్డీఏ కూటమి స్పష్టమైన హామీ ఇచ్చింది. అందరి ఆవేదన అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల ఆస్తులకు భద్రత, వారి భవిష్యత్‌కు భరోసా కల్పించాలని సంకల్పించారు. నాడు ప్రజల మధ్యనే వాళ్ల బొమ్మలతో ఉన్న పట్టాదార్ పాసు పుస్తకాలు చించి… మీకు న్యాయం చేస్తానని ప్రకటించారు. చెప్పినట్లుగానే అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రెండో సంతకంతోనే రద్దు చేశారు.
అధికారం చేపట్టే నాటికి అస్థవ్యస్థంగా ఉన్న రెవెన్యూ శాఖను పూర్తి స్థాయిలో సంస్కరించి, గాడిలో పెట్టాలని ఆరోజే ముఖ్యమంత్రి నిర్ణయించారు. భూ ఆక్రమణదారుల నుంచి ప్రజల ఆస్తులను రక్షించేందుకు ‘ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిటెడ్ యాక్ట్-2024 నవంబర్‌లో తీసుకొచ్చారు. నాటి నుంచి నేటి వరకు 22 నెలల పాలనలో రెవెన్యూ శాఖలో పెను మార్పులు తీసుకువచ్చారు. ప్రజలకు దగ్గర చేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా వాట్సప్ గవర్నెన్స్ ‘మన మిత్ర’ ద్వారా మొబైల్ నుంచే రెవెన్యూ సేవలు అందించేలా శ్రీకారం చుట్టారు.
ఏ సర్టిఫెకెట్లకు ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా ప్రజా ప్రభుత్వం చేసింది. దీని వల్ల అవినీతికి ఆస్కారం లేకుండా పోవడమే కాదు, వేగంగా సేవలూ అందతున్నాయి. వ్యవసాయేతర అవసరాలకు భూమిని సులభంగా మార్చుకునేలా నాలా చట్టం కూడా రద్దు చేసింది. 77 లక్షల సర్వే రాళ్లపై బొమ్మలను తొలగించింది.
17 వేల గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు
భూ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రంలోని మొత్తం 17 వేల గ్రామాల్లో ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించింది. ఆర్ ఓ ఆర్, ఎఫ్ లైన్లు, రీసర్వే, అసైన్మెంట్లు వంటి దాదాపు 29 అంశాలపైన ఫిర్యాదులు రాగా వాటన్నింటికి పరిష్కారం చూపింది. 22 ఏ భూముల జాబితా నుంచి ప్రైవేట్ భూములు తొలగించడం ద్వారా ఉపశమనం కలిగించింది. మాజీ సైనికులు, స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ బాధితులు… వీరికి నిర్దేశించిన 8 డాక్యుమెంట్లలో ఒక్క ఆధారం ఉన్నా నిషేధిత జాబితా నుంచి తప్పించింది.
భూ సమస్యలపై అప్పీల్ పరిష్కరించే అధికారం డీఆర్వో నుంచి ఆర్డీవోకు బదలాయించారు. అభ్యంతరాలేని ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదల నివాసాలు రెగ్యులరైజ్ చేస్తున్నారు. రిజిస్ర్టార్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ ప్రవేశ పెట్టడంతో రిజిస్ట్రేషన్ సమయం ఆదా అవుతోంది. అలాగే, జూన్ 2024 నుంచి ఇప్పటివరకు 9 లక్షల భూ లావాదేవీలు ఆటో మ్యూటేషన్ జరిగింది. సేల్, గిఫ్ట్, పార్టీషన్ డీడ్స్‌లో 100 శాతం ఆటో మ్యూటేషన్ చేస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో కూడా ఆటో మ్యుటేషన్ విధానం తీసుకువచ్చారు.
రీ సర్వేతో భూ వివాదాలకు చెక్
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారంగా ప్రజా ప్రభుత్వం రీ సర్వే 2.0 చేపట్టింది. మొత్తం 16,816 గ్రామాల్లో రీ సర్వేకు చేపట్టగా, ఇప్పటికే 6,976 గ్రామాల్లో సర్వే ముగిసింది. 2027 మార్చి నాటికి రాష్ట్రమంతా రీ సర్వే పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. గత పాలకుడి ఫోటో తీసేసి రాజముద్రతో కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇస్తున్నారు. ప్రతీ నెలా 9వ తేదీన ‘మీ భూమి-మీ హక్కు’ నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్వయంగా హాజరవుతున్నారు. భూ యజమానులకు సీఎం తన చేతుల మీదుగా పాస్ పుస్తకాలు అందజేస్తున్నారు.
2027 మార్చికి 1.12 కోట్ల పాసు పుస్తకాల పంపిణీ లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు మొత్తం 22.79 లక్షల కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ చేశారు. అత్యంత భద్రతా ప్రమాణాలతో ఈసారి పట్టాదార్ పాస్ పుస్తకాలను ప్రభుత్వం ముద్రిస్తోంది. ప్రతీ పాస్ పుస్తకానికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్, యునిక్ నెంబర్ ఉంటుంది. ఎవరైనా సరే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా భూమి వివరాలను తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది. భూ రికార్డులు సరిగ్గా ఉన్నాయో, లేవో… రియల్ టైంలో చెక్ చేసుకోవచ్చు. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయని భూ యజమాని ఈ కేవైసీ ద్వారా నిర్ధారించాకే నేరుగా ఇంటికే పాస్ పుస్తకం అందిస్తున్నారు.
గతంలో తాహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు మారిస్తే ఎప్పటికో బయటపడేవి. ఇప్పుడు ఒక్క స్కానింగ్‌తోనే రికార్డులు పరిశీలించుకోగలుగుతున్నారు. అలాగే, రికార్డులు మరింత భద్రంగా ఉండేలా బ్లాక్ చెయిన్ టెక్నాలజీని, రికార్డుల లాకర్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.
నాన్‌స్టాప్‌గా సంస్కరణలు
1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఈనాం భూములను 22 ఏ నుంచి తొలగిస్తూ ఇటీవల ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇతర సర్వీస్ ఈనాంలోని మరో లక్ష ఎకరాల భూములకూ త్వరలో విముక్తి కల్పించనున్నారు. నిజానికి 2019లో దీనిపై ఆర్డినెన్స్ తీసుకువచ్చినప్పటికీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మురిగిపోయింది. మళ్లీ ఇప్పుడు దీనికి సంబంధించి ప్రభుత్వం కొత్తగా చట్టం తీసుకురానుంది. అలాగే 22 ఏ పై కలెక్టర్ అధికారాలను వికేంద్రీకరిస్తోంది. జేసీ, ఆర్డీవోలకు అధికారాలు బదలాయిస్తోంది. దీంతో రెవెన్యూ సమస్యలు, అర్జీలు త్వరగా పరిష్కారమవుతాయి.
వెబ్ ల్యాండ్ తప్పులు సుమోటోగా సరిదిద్దేలా ఆర్డీవోలు, తహశీల్దారులకు అధికారం ఇస్తోంది. మరోవైపు ఫ్రీహోల్డ్‌లో 13.59 లక్షల ఎకరాలు ఉంటే వీటిలో అర్హత కలిగిన 9.25 లక్షల ఎకరాల భూములకు పూర్తి యాజమాన్య హక్కులు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు సూచించారు. త్వరలో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో భూ వినియోగ మార్పులు, మిస్సింగ్ సర్వే నంబర్ల సేవలు ప్రారంభం కానున్నాయి.
వారసత్వంగా వస్తున్న భూముల విషయంలోనూ సంస్కరణలు తెచ్చారు. రూ.10 లక్షల లోపు ఆస్తులకు రూ.100, రూ.10 లక్షల పైబడి ఆస్తులకు రూ.1,000తోనే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. మొత్తంగా 2027 నాటికి భూ సమస్యలు అనేవి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి పట్టుదలగా పనిచేస్తున్నారు.