– స్కూళ్ళకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతగా లేకపోవడంపై ఎమ్మెల్యే నల్లమిల్లి ఆగ్రహం
– అనపర్తి శ్రీ రామారెడ్డి జిల్లాపరిషత్ హైస్కూల్ కి ఆకస్మిక పర్యటనకు వెళ్లి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి
– ఆహార పదార్థాలు నాణ్యతగా లేకపోవడం, పాత్రలు అపరిశుభ్రంగా ఉండడం గమనించిన ఎమ్మెల్యే నల్లమిల్లి
– మధ్యాహ్న భోజనం అందిస్తున్న బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ పై పై అధికారులకు ఫిర్యాదు
అనపర్తి శ్రీ రామారెడ్డి జిల్లాపరిషత్ హైస్కూల్ ని ఆకస్మిక తనిఖీ చేసి, అక్కడ విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, నాణ్యత లేకపోవడానికి గుర్తించి పై అధికారులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం PM పోషణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తుంది. ఇటీవల కాలంలో అనేక చోట్ల మంత్రి నారా లోకేష్ గారు మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేయడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఈరోజు అనపర్తి శ్రీ రామారెడ్డి ఉన్నత పరిషత్ హై స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేయడం జరిగింది.
ఈ ప్రాంతంలో బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ అనే సంస్థ స్కూళ్లకు భోజనాన్ని అందించడం జరుగుతుంది. ఈరోజు మెనూ ప్రకారం పప్పు ఆకుకూర, ఒక గుడ్డు, చిక్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. గుడ్డు చూస్తే వాడిన నూనె మరలా మరలా వాడి, ఫ్రై చేసినట్లుగా ఉంది. అంతేకాకుండా గుడ్లు కూడా ఒక విధమైన వాసన రావడం జరుగుతుంది. దాని పైన ఉన్న పెంకులు కూడా సరిగ్గా తొలగించని పరిస్థితి. అన్నం గట్టిగా ఉండడం, ముద్దలుగా ఉండడం, పప్పు ఆకుకూరని పరిశీలిస్తే అందులో ఆకుకూర ఎక్కడుందో వెతుక్కోవలసిన పరిస్థితి కనబడింది. పైగా అది పప్పులా కాకుండా సాంబార్ లాగా కనపడే పరిస్థితి. ఈ ఆహారం తీసుకొచ్చిన పాత్రలు కూడా అపరిశుభ్రంగా ఉండటం గమనించడం జరిగింది.
ఆరోగ్యకరమైన ఆహారం అందించి పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంకల్పాలకు భిన్నంగా ఇక్కడ జరుగుతా ఉంది. దీనిపై నేను జిల్లా విద్యాశాఖ అధికారికి ఫోన్ లో ఫిర్యాదు చేసి విచారణ జరపమని కోరడం జరిగింది. ఈ బుద్ధవరపు ఛారిటబుల్ ట్రస్ట్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. గత రెండేళ్లుగా మేము అనేక స్కూల్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ విద్యార్థుల నుండి, ఉపాధ్యాయుల నుండి కంప్లైంట్స్ రావడం జరుగుతా ఉంది. అందువల్ల తగు విచారణ చేసి, చర్యలు తీసుకొని విద్యార్థులకు ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందేలా చర్యలు తీసుకోవాలని గౌరవ మంత్రి కి కూడా నేను ఫిర్యాదు చేస్తాను.
ఇక్కడ ఉపాధ్యాయులు కూడా ఉదాసీన వైఖరి అవలంబిస్తూ పిల్లలకు ప్రతిరోజూ ఏవిధమైమ ఆహారం అందుతుంది అనేది గమనించకుండా వ్యవహరిస్తున్నారు అనేది అర్థం అవుతుంది . ఉపాధ్యాయులు శ్రద్ధ వహిస్తే విద్యార్థులకు అందే ఆహారంలో లోపాలు జరగవు. తప్పనిసరిగా ఈ లోపాలను సరిదిద్దేందుకు నేను కృషి చేస్తాను. బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వారు కూడా సాధ్యం కాకపోతే వదిలి పెట్టాలి తప్ప, ఇలాంటి ఆహారాన్ని అందించడం సరైన విధానం కాదని హెచ్చరిస్తున్నాను.