– రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో కేంద్ర ప్రాజెక్టులు ఆలస్యం
– రుణమాఫీ హామీలు అమలు కాలేదు
– పంటల బీమా పథకం అమలు కావడం లేదు
– వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదు
– బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బిజెపి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సమర్థంగా, పెద్దఎత్తున నిధులు, కార్యక్రమాలతో అభివృద్ధి చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ మాత్రమే ఉంది. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో మరిన్ని ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రతిపాదనలు పంపాలని కోరినా స్పందన లేకపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పటికే వరంగల్ లో, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌లకు అనుమతులు వచ్చాయి. మూడవ ఎయిర్పోర్ట్ కోసం కూడా కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది.
ప్రత్యేకంగా ఆదిలాబాద్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అత్యంత కట్టుబడి ఉంది. రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నిర్మలా సీతారామన్ పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందన రాలేదు. అయితే ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆదిలాబాద్, వరంగల్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధిపై చర్చించి, మేము రక్షణ శాఖ సహకారం కోరాం.
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కావలసిన నిధులను పూర్తిగా సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అంతేకాకుండా అక్కడ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. దీని వల్ల ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
ఇప్పటికే మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. సంబంధిత శాఖల సమన్వయం పూర్తయింది. ఈ నెల 17న రక్షణ శాఖ మరియు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల బృందం ఆదిలాబాద్‌కు వచ్చి తుది నిర్ణయాలు తీసుకోనుంది. ఇంత వేగంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంటే, గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయి. ఆదిలాబాద్-ఆర్మూర్ రైల్వే లైన్ కూడా ఇదే కారణంతో ఆలస్యం అయింది. కేంద్రం నిధులు మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గత తప్పులను పునరావృతం చేయకుండా, కేంద్రంతో సమన్వయం చేసుకొని ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాలి.
ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి , కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి నా తరఫున, ఆదిలాబాద్ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మరోవైపు రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. పంటలు పండించిన రైతులు మార్కెట్లో ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయడంలో విఫలమవుతోంది. రుణమాఫీ హామీలు అమలు కాలేదు. పంటల బీమా పథకం అమలు కావడం లేదు. రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంటల కొనుగోలు ప్రారంభించాలి. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి.
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అమలు చేయాలి. ముఖ్యంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తే ప్రజలకు భారీ ప్రయోజనం కలుగుతుంది. అభివృద్ధి అనేది కేంద్రం-రాష్ట్రం కలిసి పనిచేస్తేనే సాధ్యమవుతుంది. కేంద్రం ఎంతో పెద్ద స్థాయిలో సహాయం చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా సహకరించాలి.