– నేడు మంగళగిరిలో ఆమరణ నిరాహార దీక్ష
– ఇది నా ఒక్కడి పోరాటం కాదు… తరతరాలుగా వంచింపబడుతున్న బడుగు బలహీన వర్గాల పోరాటం
– ఐదు డిమాండ్లు పరిష్కరించే వరకు నా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుంది
– ఇది మన హక్కుల కోసం జరుగుతున్న పోరాటం… ఎవరూ ఆగ్రహావేశాలకు గురి కావద్దు
– బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్
మంగళగిరి: బీసీల భవిష్యత్తును, వారి రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడటమే లక్ష్యంగా భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ తన ప్రాణాలను పణంగా పెట్టేందుకు సిద్ధమయ్యారు. తరతరాలుగా అణచివేతకు, అన్యాయానికి గురవుతున్న బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు, వారి హక్కుల సాధన కోసం “బిసి ధర్మదీక్ష” పేరుతో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ చారిత్రాత్మక దీక్ష ఏప్రిల్ 11, 2026, శనివారం ఉదయం 10:45 గంటలకు మంగళగిరిలోని పూలే – మండల్ భవన్ వద్ద ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ భావోద్వేగంతో కూడిన పత్రికాప్రకటన విడుదల చేశారు. “ఇది కేవలం నా ఒక్కడి పోరాటం కాదు, ఇది మనందరి ఆత్మగౌరవ పోరాటం. బీసీ బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసం, వారి హక్కుల సాధన కోసం ఈ ధర్మ యుద్ధాన్ని ప్రారంభించాను. ప్రతి బీసీ బిడ్డ ఈ పోరాటంలో నాతో కలిసి నడవాలి. మన ఐక్యతే మన బలం, మన ఐక్యతే మన విజయం” అని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, బీసీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
బీసీ రక్షణ చట్టం: బీసీల హక్కులకు, ప్రయోజనాలకు రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించేందుకు తక్షణమే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. రాజధానిలో భూమి: రాజధాని ప్రాంతంలో బీసీల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం కనీసం 1000 ఎకరాలు కేటాయించాలి. కార్పొరేషన్లకు నిధులు: బీసీ కార్పొరేషన్లకు తగినన్ని నిధులు కేటాయించి, వాటిని పూర్తిస్థాయిలో క్రియాశీలం చేయాలి. సమగ్ర కుల గణన: శాస్త్రీయమైన ప్రాతిపదికన సమగ్ర కుల గణన జరిపి, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి. 44% రిజర్వేషన్లు: విద్యా, ఉద్యోగ, చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు అమలు చేయాలి.
ఈ ధర్మదీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలు, మేధావులు, యువత, ప్రజానీకం పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలపాలని రామచంద్ర యాదవ్ విజ్ఞప్తి చేశారు. బీసీల హక్కుల సాధన కోసం జరుగుతున్న ఈ శాంతియుత పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.