– ఆ ఆపిల్ కాదు మండుటెండల్లో మంచు ఫలాలు!
ఎక్కడైనా మండుటెండలు కాసే రాయలసీమ గడ్డపై ఆపిల్ పండ్లు పండటం సాధ్యమేనా? కశ్మీర్ చలి, హిమాచల్ ప్రదేశ్ మంచు లేకుండా అనంతపురంలో ఆపిల్ సాగు చేయడమంటే.. అది ప్రకృతిని సైతం ఆశ్చర్యపరిచే విజయం!
ఒకప్పుడు కరువుకు కేరాఫ్ అడ్రస్ అనంతపురం. కేవలం వేరుశనగ లేదా పొద్దు తిరుగుడు మాత్రమే కనిపించేది. అక్కడ కియా కార్లను పండించడానికి కంకణం కట్టుకున్నాడు నాయుడు. కాలువలు ద్వారా నీటి ప్రవాహాలు మొదలయ్యాయి. చెరువులు నిండాయి. భూగర్భ జలాలు పైకి ఉబికాయి.
ఎక్కడికక్కడ చెక్ డ్యామ్ ల నుండి కావాల్సిన వారికల్లా డ్రిప్ పరికరాలు వచ్చాయి. హార్టికల్చర్ లో అద్భుతాలు సృష్టించడం మొదలెట్టిన అన్నదాతలు మరో అడుగు ముందుకేసి కాశ్మీర్ ఆపిల్ వరైటీని మరింత తియ్యగా పండించే ధైర్యం చేశారు.
నిజానికి ఆపిల్ అంటేనే మనకు గుర్తొచ్చేది మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు. కానీ అనంతపురంలోని గార్లదిన్నె, కుందుర్పి, పెద్దపప్పూరు మండలాల్లోని రైతులు ఈ అసాధ్యాన్నే సుసాధ్యం చేశారు.
ఇక్కడ పండుతున్న కశ్మీర్ లోచిల్లీ డెలిషియస్ (KLD) రకం ఆపిల్స్, సాధారణ కశ్మీర్ ఆపిల్స్ కంటే మరింత తియ్యగా ఉండటం విశేషం.
మొదటి పంటలోనే ఎకరాకు సుమారు ఒక టన్ను దిగుబడి రావడం వ్యవసాయ రంగంలోనే ఒక సంచలనం. నాణ్యమైన పండ్లకు కిలో రూ.170 వరకు ధర పలుకుతోంది, ఇది రైతులకు లాభదాయకమైన ఆదాయ వనరుగా మారింది. సగం మాత్రమే కార్పొరేట్ మార్కెట్లకు విక్రయించిన రమణారెడ్డి మిగిలిన వాటిని అక్కడ చూడ్డానికి వచ్చేవారికి రుచిచూడడానికి గర్వంగా పంచుతున్నారు.
ఈ మార్పు వెనుక దశాబ్దాల కృతజ్ఞతతో కూడిన కృషి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాయలసీమను “ఉద్యానవన హబ్”గా మార్చాలనే సంకల్పంతో తీసుకున్న చర్యలే నేడు ఫలితాలను ఇస్తున్నాయి.
హంద్రీ-నీవా వంటి ప్రాజెక్టుల ద్వారా వెనుకబడిన ప్రాంతాలకు నీటిని చేరవేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగి, రైతులకు ధైర్యం వచ్చింది. దేశంలోనే అత్యధికంగా డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలను అందించి, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించేలా రైతులను ప్రోత్సహించారు.
ఒకప్పుడు నీటి చుక్క కోసం అల్లాడిన నేల మీద, నేడు విదేశీ నాణ్యతతో కూడిన పండ్లు పండుతున్నాయి. కశ్మీర్ చలి కంటే అనంతపురం రైతుల గుండెల్లో ఉన్న పట్టుదలే గొప్పదని ఈ పంట నిరూపించింది. కరువు సీమ నుంచి కోట్లు కురిపించే సీమగా అనంతపురం మారుతున్న ఈ ప్రయాణం అద్భుతం.. అమోఘం!
నీరు ఉంటే నేల బంగారం అవుతుందని అందరికీ తెలుసు.. కానీ అదే నీటితో ఎడారిలోనూ ఆపిల్స్ పండించవచ్చని అనంతపురం నిరూపిస్తోంది!
