– జీవీఎంసీ కమిషనర్ హోదాలో లేఖ రాసి, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ సీఈవో హోదాలో మళ్లీ ఆయనే ఆమోదిస్తారా? హవ్వ!
– 10మంది ప్రైవేట్ ఉద్యోగులు విధులు నిర్వర్తించే స్మార్ట్ సిటీ కార్పొరేషన్‌కు ఆస్తుల్ని బదలాయించడం అర్ధరహితం
– ఎ ల్ ఎల్పీగా రిజిస్టరయిన ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థకు అప్పగించడానికి టెండర్ పిలవడమంటే జీవీఎంసీని పూర్తిగా నిర్వీర్యం చేయడమే
‘ స్మార్ట్ ’ గా జీవీఎంసీ స్థలాలు ప్రైవేట్ పరం
– స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా జరిగిన వేల కోట్ల పనులపై ఆడిట్ జరిపి శ్వేతపత్రం విడుదల చేయాలి
– ‘రియల్ దందా’కు తెరలేపిన జీవీఎంసీ అధికారులు
– జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదిచ్చిన జనసేన మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్
విశాఖపట్నం : జీవీఎంసీకి చెందిన వేలాది కోట్ల రూపాయల విలువైన స్థలాలు, భవనాల నిర్వహణ, లావాదేవీల బాధ్యతను స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించడంపై జనసేన పార్టీ నేత, జీవీఎంసీ మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు సోమవారం ఆయన జీవీఎంసీ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మూర్తి యాదవ్ మాట్లాడుతూ.. జీవీఎంసీకి అనుబంధంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే పథకాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ అనే స్పెషల్ పర్పస్ వెహికల్ సంస్థ కాల పరిమితి గత ఏడాదే ముగిసిపోయిందని, ఆ సంస్థ ద్వారా చేపట్టిన పలు ప్రాజెక్టులు అవినీతి అక్రమాలకు చిరునామాగా మారాయని ఆరోపించారు. పలు ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి కాలేదని, నిజానికి ఆ సంస్థ ద్వారా చేపట్టిన పథకాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కమిషనరే…స్మార్ట్ సిటీ కార్పొరేషన్ సీఈవో
వాస్తవానికి జీవీఎంసీ కమిషనరే స్మార్మ్ సిటీ సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తారు. అయితే విచిత్రంగా జీవీఎంసీ కమిషనర్‌గా ఉన్న వ్యక్తి మరో హోదాలో తానే సీఈవోగా వ్యవహరించే స్మార్ట్ సిటీ కార్పొరేషన్‌కు వేల కోట్ల విలువైన స్థలాలు భవనాల నిర్వహణ భవిష్యత్తు ప్రణాళికలపై లేఖ రాయడంపై మూర్తి యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ లేఖ ఆధారంగా స్మార్ట్ సిటీ కార్పొరేషన్ టెండర్ (ఆరఎఫ్పీ నంబర్: జీవీఎస్సీసీఎల్/టీఏ/431 (నగదీకరణ)-జీవీఎంసీ/2025-26) కూడా పిలిచిందని, ఒకే వ్యక్తి కుడిచేత్తో తీసుకున్న నిర్ణయాన్ని ఎడమ చేత్తో అమలు చేయాలని ప్రయత్నించటం నిబంధనలకు విరుద్ధమన్నారు.
జీవీఎంసీ కమిషనర్ హోదాలో లేఖ రాసి, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ సీఈవో హోదాలో మళ్లీ ఆయనే టెండర్‌కు ఆమోదం తెలపడం అనుమానాల్ని రేకత్తిస్తోందన్నారు. గత మార్చి 17జీవీఎంసీ పాలకవర్గం పని చేసిందని, కౌన్సిల్ సమావేశాలు కూడా రెగ్యులర్‌గా జరిగాయని, అధికార పార్టీకి చెందిన పాలకవర్గమే పదవుల్లో ఉన్నప్పటికీ వేల కోట్ల విలువైన జీవీఎంసీ భూములు, ఆస్తులకు సంబంధించిన ఈ ప్రతిపాదనను కమిషనర్ గాని ఇతర అధికారులు గానీ కౌన్సిల్ ముందు ప్రవేశపెట్టలేదని గుర్తు చేశారు.
కౌన్సిల్ పదవీ కాలం ముగిసిన వెంటనే మార్చి 30న టెండర్ పిలవడమంటే భారీ కుంభకోణానికి అధికారులు తెరలేపినట్టు అర్థమవుతోందన్నారు. ఇప్పటికే సరైన లీగల్ సెల్ కూడా లేని కారణంగా వందల కోట్ల ఆస్తుల్ని జీవీఎంసీ కోల్పోయిందని, దానికి తోడు ఉన్న ఆస్తులు, భవనాలపై అజమాయిషీ హక్కుల్ని ఎ ల్ ఎల్పీగా రిజిస్టరయిన ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థకు అప్పగించడానికి టెండర్ పిలవడమంటే జీవీఎంసీని పూర్తిగా నిర్వీర్యం చేయడమేనని మూర్తి యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది ఉద్యోగులు, పదుల సంఖ్యలో విభాగాలున్న జీవీఎంసీని కాదని కేవలం 10మంది ప్రైవేట్ ఉద్యోగులు విధులు నిర్వర్తించే స్మార్ట్ సిటీ కార్పొరేషన్‌కు ఆస్తుల్ని బదలాయించడం అర్ధరహితం, అవివేకమన్నారు.
టెండర్ రద్దు చేయ్యాలి
స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా జీవీఎంసీ ఆస్తుల్ని నిర్వహించేందుకు పిలిచిన టెండర్లను తక్షణమే రద్దు చేయాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. కొందరు అధికారులు తమ స్వార్థం కోసం, కోట్ల రూపాయల లంచాల కోసం జీవీఎంసీకి చెందిన ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్‌పరం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించొద్దన్నారు.
జీవీఎంసీలో భూములు, స్థలాల వ్యవహారాల్ని చూసేందుకు అత్యంత బలమైన రెవెన్యూ విభాగం, ఎస్టేట్ విభాగం, టౌన్ ప్లానింగ్, లీగల్ సెల్, పబ్లిక్ వర్క్స్ విభాగాలున్నాయని, వీటన్నింటినీ కాదని ‘స్మార్ట్ సిటీ’కి ఆస్తుల్ని బదలాయించడం ఆమోదయోగ్యం కాదన్నారు. అవినీతికి అక్రమాలకు చిరునామాగా మారిన స్మార్ట్ సిటీ కార్పొరేషన్‌ను కూడా వెంటనే రద్దు చేయాలని, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా జరిగిన వేల కోట్ల పనులపై ఆడిట్ జరిపి శ్వేతపత్రం విడుదల చేయాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు.