– హతుడు వైసీపీ కార్యకర్త
– చంపింది వైసీపీ రౌడీలు
.- చంపించింది వైసీపీ నాయకుడు
“గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్లు.. మావాళ్లు రఫ్ఫా రఫ్ఫా నరుకుతారని చెప్పారు, మంచిదే కదా” అని ఇటీవలే జగన్ చెప్పిన ఆ మాటలు, కడప వైకాపాకు తలకెక్కినట్లుంది. నిజంగానే రక్తపుటేరులై పారుతున్నాయి! గొర్రెలను నరకాల్సిన వారు, కడప శివారు ఆలంఖాన్‌పల్లె మారెమ్మ జాతరలో మనుషులను నరకడానికి స్కెచ్ వేశారు. హతుడు వైసీపీ కార్యకర్త.. చంపింది వైసీపీ రౌడీలు.. చంపించింది వైసీపీ నాయకుడు. ఇదంతా ఒక ‘వైకాపా జాతర’!
ఏప్రిల్ 4న ఆలంఖాన్‌పల్లెలో మారెమ్మ జాతర సందర్భంగా జరిగిన ఒక చిన్న గొడవతో ఈ వివాదం మొదలైంది. డిజే ఏర్పాటు విషయంలో దస్తగిరి కుమారుడు వెంకట దస్తగిరిని, వెంకటేష్ అనే వ్యక్తి వాగ్వాదానికి దిగారు. మరుసటి రోజు (ఏప్రిల్ 5) రాత్రి, వెంకట దస్తగిరిపై వెంకటేష్ మరియు అతని అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం దస్తగిరి మరియు అతని సోదరుడు చిన్న దస్తగిరి కడప రిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
అక్కడ.. ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రి ప్రాంగణంను ‘కసాయి ఖానా’గా మార్చారు. రిమ్స్‌లో కాపు కాచిన నిందితులు, పెద్ద దస్తగిరిపై పదికి పైగా కత్తిపోట్లు పొడిచారు! రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతున్న దస్తగిరిని చూస్తూ ఆ నిందితులు పక్కనే ఉన్నారు.
హత్య జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న వైకాపా కీలక నాయకుడు, మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి, శవం ముందు నిలబడి (అచ్చం వివేకా శవం వద్ద తమ ఎంపీ లెక్కన) విలపిస్తున్నట్టు నటిస్తూ, దస్తగిరి శరీరంలోని గాయాలను తన చేత్తో చూపిస్తూ.. ఎంత క్రూరంగా చంపారో వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నాడు! వివేకా గొడ్డలి కేసులో బాబాయి శవం దగ్గర జగన్ చేసిన అభినయాన్ని, నిత్యానందరెడ్డి నటనతో ప్రజలు పోల్చుకున్నారు. ఈ మొత్తం హత్యకు తనే స్క్రీన్‌ప్లే రాసి, దర్శకత్వం వహించాడని దర్యాప్తులో తేలింది.
కేసును పక్కదారి పట్టించడం, భద్రతా వైఫల్యంపై విమర్శలు రావడంతో.. కడప డీఎస్పీ, చిన్నచౌకు సీఐ, మరియు ఎస్ఐలను ప్రభుత్వం వీఆర్‌కు (రిజర్వ్‌కు) పంపింది. పోలీసు వ్యవస్థలో ‘వైకాపా జాతర’ ప్రభావం ఎంత ఉందో దీనిని బట్టి స్పష్టమవుతోంది.
₹100 కోట్ల బినామీ సామ్రాజ్యం:
దస్తగిరి నివాసంలో దొరికిన ₹100 కోట్ల సేల్ డీడ్లు కడప రాజకీయాల్లో భూకంపం సృష్టించాయి.
ఈ పత్రాల్లో ఉన్నవి జగన్ దగ్గరి బంధువు, మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేర్లు!
నిత్యానంద రెడ్డి ఆ మాజీ ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడిగా ఉంటూ కబ్జాల సామ్రాజ్యాన్ని నడిపించాడు.
బుగ్గవంక జలాశయం దగ్గర 35 ఎకరాల కబ్జా..
పోలీసు సంక్షేమ సంఘం స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్..
చింతకొమ్మదిన్నె, కడప మండలాల్లో ఆక్రమణలు..
ఈ హత్య కేవలం ఒక వ్యక్తిని చంపడం మాత్రమే కాదు, ఆ కబ్జాల చిట్టా బయటపడకుండా చేయడానికి జరిగిన ప్రయత్నం. దస్తగిరి ఇంట్లో దొరికిన ఆ డాక్యుమెంట్లు ఇప్పుడు జగన్ దగ్గరి బంధువు మాజీ ఎమ్మెల్యేను, నిత్యానందరెడ్డిని జైలుకు పంపే ‘సాక్ష్యాలు’గా మారాయి.
వైకాపా జాతరలో మొదలైన ఈ నరమేధం, ఇప్పుడు ఆ పార్టీ ‘పెద్ద తలకాయల’ పీఠాన్ని కదిలిస్తోంది. ముసుగులు తొలగుతున్నాయి.. సూత్రధారుల అరెస్ట్ కోసం కడప వేచి చూస్తోంది!
-చాకిరేవు