(వాసిరెడ్డి అమర్నాధ్)
1. “చైనా లో ప్రైవేట్ బడులు బాన్ .”
—– తెగ వైరల్ చేస్తున్న నెటిజనులు
వాస్తవం ..
చైనా లో ప్రైవేట్ బడులను నిషేధించలేదు . ఇప్పటి దాక ప్రైవేట్ బడులు లాభాలు ఆర్జించుకొనే అవకాశముండేది . 2021 నుంచి చైనా ఈ రూలు మార్చింది . విదేశీ ఈక్విటీ కంపెనీ లు లాభాపేక్ష తో బడులు పెట్టకూడదు అని చట్టం చేసింది . ఇది వరకే ఉన్న ప్రైవేట్ బడులు లాభాపేక్షతో కాకుండా నో లాస్ నో ప్రాఫిట్ ఆధారంగా నడపాలని నిర్దేశించింది .
మరి ఇండియా సంగతి ?
ఇండియా లో ఎప్పటినుంచో ఈ రూల్ ఉంది . కాకపోతే అది అమలు కాదు . దొడ్డి దారిలో ప్రవైట్ బడులు దోచేస్తాయి . బాగా దోచుకొనే అవకాశముంది కాబట్టే ఫారిన్ ఈక్విటీ కంపెనీ లు వందల కోట్లు పెట్టి సిబిఎస్సీ బడుల్ని కొనేస్తున్నాయి.. .
రియల్ ఎస్టేట్ వారు, ఫార్మా కంపెనీ వారు కోట్లు కుమ్మరించి కొత్త బడులు పెట్టి వాటిని క్లబ్బులా అలంకరిస్తున్నారు , నవ తరం పేరెంట్స్ కూడా ఇలాంటి బడులు .. అంటే ఎంత పెద్ద బిల్డింగ్ ఉంటే అంత గొప్ప బడి అనుకొని వాటి వైపు ఆకర్షితులు అవుతున్నారు . ప్రభుత్వ బడుల్లో సంవత్సరానికి సగటున ఒక విద్యార్థి కి లక్ష రూపాయిలు ఖర్చు . ఇరవై ముప్పై వేలకే కొన్ని బడులు ఎలా విద్యనందిస్తున్నాయి అనే విషయం పై చర్చ జరిగితే బాగుండు .
విద్యార్థుల్లో చదివే గుణం తగ్గిపోయింది అని ప్రతి ఉపాద్యాయుడు ఘోషిస్తుంటే.. ఈ కాలం విద్యార్థులు చక్కగా చదువు తున్నారు కాబట్టే మాక్సిమం మార్కులు వస్తున్నాయి అని ప్రచారం . దీని బట్టి విద్య మాఫియా ఎంత పవర్ఫుల్ అని గ్రహించవచ్చు . చదువంటే కేవలం మార్కులు .. ఎంత ఎక్కువ ఫీజు ఉంటే .. ఎంత పెద్ద బిల్డింగ్ ఉంటే … అంత గొప్ప బడి అనుకొనే పేరెంట్స్ ఉన్నంత కాలం పిల్లల చదువులు సరిగా సాగవు .
2. రెండో అంశం:. బతకడం కోసం సొంత ఒంటిని పెట్టుబడిగా పెట్టడం అనేది అతి పురాతన వ్యాపారం . డిజిటల్ ఏజ్ లో ఇది సునామీ లా మారింది . ఆన్లైన్ లో అందాలను ప్రదర్శిస్తూ ఆదాయాన్ని గడిస్తున్నవారు ప్రపంచ వ్యాపితంగా కనీసం లక్ష మంది ఉన్నారని ఈ రంగం పై స్టడీ చేసిన ఉన్నత అధికారుల అంచనా .
తెలుగు నాట ఇది ఇప్పుడు కొత్త వేళ్లూను కొంటోంది . వీరికి ప్రచార కర్తలుగా మీడియా మారుతోంది . ఇదేదో ప్రపంచం లో ఇప్పటిదాకా దాక జరగనట్టు ఇక్కడే కొత్తగా మొదలయినట్టు మీడియా అయ్యో కుయ్యో అని వార్త కథనాలు ప్రసారం చెయ్యడం .. దాన్నే పబ్లిసిటీ గా ఇలాంటి వారు రెచ్చి పోవడం జరుగుతోంది . రాబొయ్యే రోజుల్లో వందల మంది తెలుగు వారు ఈ దందాలోకి దిగడానికి రంగం సిద్ధమవుతోంది .
3. మూడో అంశం: చచ్చిన వ్యక్తుల ఇన్సూరెన్సు డబ్బుల కోసం… ఆస్తుల కోసం ఒక కుటుంబం రెండు గా విడి పోయి యు ట్యూబ్ చానెల్స్ వేదికగా కొట్టుకు చస్తున్నారు . నిన్నటి దాక నిజాలను తొక్కి పెట్టేసారు .” మా వారు బంగారం ఏమీ సమస్యలు లేవు” అని పదేపదే చెప్పిన వారు, ఇప్పుడు డబ్బుల కోసం పరస్పర ఆరోపణలు చేసుకొంటున్నారు . వారి వ్యక్తిగత గోల మనకెందుకు అనిపిస్తుంది . కానీ మనుషులు డబ్బుకోసం ఇంత దిగజారతారా? అని మొత్తం సమాజాన్ని చెడగొట్టేలా ఈ ప్రచారం జరుగుతోంది .ఈ కేసులో పోలీస్ లు నిజాలు ఎప్పటికి చెబుతారో ?