– హిమాచల్ ప్రదేశ్ లాగా తెలంగాణ మారే ప్రమాదం ఉంది
– మళ్లీ రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే
– బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కాగజ్ నగర్,ఆసిఫాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భవిష్యత్ లో హిమాచల్ ప్రదేశ్ గతి పడుతుందని,అక్కడ కూడా కాంగ్రెస్ నాయకులు అలవికాని హామీలు ఇచ్చి,నెరవేర్చకుండా,వైఫల్యం చెందారని,నేడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించే పరిస్థితి ఏర్పడిందని,రేవంత్ రెడ్డి కూడా హామీలు అమలు చేయాలంటే ఇదే పరిస్థితి ఎదురవుతుందని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్మి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
నిన్న జగిత్యాలలో జరిగిన బిఆర్ఎస్ సభను విజయవంతం చేసిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.కేసిఆర్ మీటింగ్ విజయవంతం కాకూడదన్న కుట్రతోనే రేవంత్ రెడ్డి క కాటారంలో మీటింగ్ పెట్టారని ఆరోపించారు.
కాగజ్ నగర్ పట్టణంలో పోడు రైతుల సమ్మేళన కార్యక్రమంలో హాజరైన ప్రవీణ్ కుమార్ అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.నిన్నటి రెండు సభలల్లో ఒక ముఖ్యమంత్రి,ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి మాట్లాడితే ఎలా ఉంటుందో నిన్ననే అర్థమైందన్నారు.
తెలంగాణ ఊపిరిగా,బాధల్లో ఉన్న ప్రజలకు ఓదార్పునిస్తూ,తిరిగి తెలంగాణ ప్రజలను ఎలా కాపాడుకోవాలనే ఆలోచన, కేసిఆర్ మాటల్లో రాష్ట్ర అభివృద్ధి ఎలా జరగాలన్న ఆరాటం కనిపించిందన్నారు.
కానీ రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన ప్రతి మాటా వీధి గూండాలాగా,రియల్ ఎస్టేట్ ఏజెంట్ లా మాట్లాడారు. ఉద్యమకారున్ని పాతరేస్తా అంటూ మాట్లాడడం దారుణం. వివక్ష, కోపం, ఆగ్రహం అతని మాటల్లో కనిపించిందని విమర్శించారు.
ఎవరి చేతిలో తెలంగాణ బాగుంటదో ప్రజలు గమనిస్తున్నారని,వృద్ధులు,మహిళలు,రైతులు,విద్యార్థులు, యువకులు ఎవరి పాలనలో ఆనందంగా ఉన్నారో స్పష్టంగా వారికే అర్థమైంది. గత ప్రభుత్వ పాలనను నేటి కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకుని చూస్తున్నారని వివరించారు.
కాంగ్రెస్ పాలనలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అధికారుల జీతాల్లో 50 కోత విధించారు. హిమాచల్ ప్రదేశ్ లో కూడా,ఇక్కడి లాగే అలవి కానీ హామీలు ఇచ్చారు.
భవిష్యత్ లో తెలంగాణ పరిస్థితి కూడా అలాగే. మరో శ్రీలంక,నేపాల్ లాగా మారే ప్రమాదం..
కేసీఆర్ అన్ని సూచికల్లో తెలంగాణను 1 లేదా 2 స్థానాల్లో నిలిపితే…రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణను అథోపాతాలానికి నెట్టివేసింది. కేవలం 2 వేల కోట్ల నిధుల కోసం మీటింగ్. మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో 2023 లో బాంబులతో మేడిగడ్డను కూల్చారని కేసు నమోదైంది. మీరు హోం మంత్రిగా ఆ కేసును ఎందుకు రివ్యూ చేయలేదు? మేడిగడ్డ బాంబు దాడి వెనుక కాంగ్రెస్ బిజేపి కుట్ర ఉందని స్పష్టం చేశారు.
ఇప్పటివరకు మేడిగడ్డ రిపేర్ కోసం 1000 కోట్లు దొరకలేదా?. హుటాహుటిన రెండున్నరేళ్ల తర్వాత ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరకు వెళ్లారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కంట్రాక్టు టెండర్లలో దోపిడీ చేస్తుందని,చేవెళ్ల డిక్లరేషన్ లో 25 శాతం ఎస్సీ ఎస్టీలకు,కామారెడ్డి డిక్లరేషన్ లో బిసి లకు 42 వాటా ఇస్తామని చెప్పి ఎందుకివ్వడం లేదని నిలదీశారు. కొడంగల్,ఫ్యూచర్ సిటీ,గురుకులాల కాంట్రాక్టుల్లో ఎస్సీ ఎస్టీ బిసిలకు వాటా ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.
కేసీఆర్ పాలనలో 90 శాతం కాంట్రాక్టులు తెలంగాణ ప్రజలకే ఇచ్చారని గుర్తు చేశారు. కానీ రేవంత్ పాలనలో ఒక్క శాతం కూడా తెలంగాణ ప్రజలకు ఇవ్వడం లేదని తెలిపారు. తెలంగాణలో తిరిగి ఖచ్చితంగా రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన పని గురించి ఒక్కటి కూడా చెప్పుకోలేదని ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఆద్యంతం ప్రతిపక్ష పార్టీ నాయకులను తిట్టడమే సరిపోయిందని, రాష్ట్ర అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా చెప్పలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.