– పట్టపగలు బ్యాగులతో దొరికిపోయిన దొంగ రేవంత్ రెడ్డి
– ఈరోజు హోంమంత్రిగా ఆయనే ఉన్నాడు
– కంప్లైంట్ కూడా ఆయనే
– సమైక్య వాదులతో చేతులు కలిపి మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేసింది రేవంత్ రెడ్డి కాదా?
– రేవంత్ రెడ్డికి ఆ స్టే వెకేట్ అయిందంటే.. ముఖ్యమంత్రి సీటు ఊడటం, జైలుకు వెళ్లడం ఖాయం.
– ఎల్లంపల్లి, ఎస్సారెస్పీలు పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే..
– కేసీఆర్ వస్తున్నారని భయపడి డైవర్షన్ కోసం ఒక కిస్తీ రైతు భరోసా వేశారు
– ఆయన గర్జించకపోతే ఆ డబ్బులు కూడా పడేవి కావు.
– రేపు సుప్రీంలో ఓటుకు నోటు కేసు విచారణ
– స్టే వెకేట్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి ఊడిపోయి నేరుగా జైలుకెళ్లడం ఖాయం.
– ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాడు శిలాఫలకం మీద రాష్ట్ర మంత్రిగా నా పేరుంది
ఆనాడు మంత్రిగా ఉన్న నా వెనక రేవంత్ రెడ్డి నిక్కర్లు వేసుకుని తిరిగాడు
– బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయాలపై, కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న దుష్ప్రచారాలపై, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై హరీశ్ రావు గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కేసీఆర్ సభ జరుగుతుందని ముందే తెలిసి, ఆ సభకు పోటీగా అదే జిల్లాలో అదే సమయానికి రేవంత్ రెడ్డి మాట్లాడటం ఆయన కుచిత బుద్ధికి, సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. కేసీఆర్ స్పీచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో చూసి అదే సమయానికి మైకు పట్టుకోవడం ముఖ్యమంత్రి స్థాయికి తగదు. నిన్న కేసీఆర్ ప్రసంగాన్ని లైవ్ లో 36 లక్షల మంది చూస్తే, రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని కేవలం 4 లక్షల మంది మాత్రమే చూశారు.
కేసీఆర్ వ్యూవర్ షిప్ లో కనీసం 10 శాతం కూడా రేవంత్ కు రాలేదు. బిఆర్ఎస్ పార్టీ అఫీషియల్ లైవ్ లో బీఆర్ఎస్ సభను 2 వేల మంది చూస్తే, కాంగ్రెస్ లైవ్ లో కేవలం 54 మంది మాత్రమే ఉన్నారు. రెండున్నరేళ్లలో రేవంత్ స్థాయి ఎక్కడికి పడిపోయిందో, కేసీఆర్ గారి మీద ప్రజల్లో ఉన్న అభిమానం ఏంటో ఈ లెక్కలే చెబుతున్నాయి.
పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎంతో హుందాగా, రేవంత్ రెడ్డి పేరు ఒక్కసారి కూడా తీయకుండా రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడితే..రేవంత్ రెడ్డి మాత్రం రాంకెలు వేయడం, ఏడవడం తప్ప ఇంకేం చేయలేదు.రేవంత్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. రేవంత్ జేజమ్మ దిగివచ్చినా ఆపలేరు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు చెప్పిన మాటలు విని తప్పులు సరిదిద్దుకుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు కనీసం డిపాజిట్లు అయినా దక్కుతాయి.
మా అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు సీనియర్ న్యాయవాదులను కలిసేందుకే నేను, ఎంపీ రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్ కుమార్ బహిరంగంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లాం. అందులో దాచిపెట్టేదేం లేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తన మీడియా ద్వారా లీకులు ఇస్తూ డ్రామాలు ఆడాడు. విషయం లేని వాళ్లే ఇలాంటి చిల్లర పనులు చేస్తారు.
కాళేశ్వరం కేసులో తీర్పు ఏవిధంగా వచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి, అలాగే మే 6వ తేదీన హైకోర్టులో రాబోతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుల కోసం సీనియర్ లాయర్లను సంప్రదించడానికి ఢిల్లీ వెళ్లాం. కాంగ్రెస్ బీఫామ్ పై గెలిచి తాను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నానని ఒక ఎమ్మెల్యే అనడం, దాన్ని స్పీకర్ ధ్రువీకరించడం అత్యంత దుర్మార్గం. రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ ఉంది.
పట్టపగలు బ్యాగులతో దొరికిపోయిన దొంగ రేవంత్ రెడ్డి. ఈరోజు హోంమంత్రిగా ఆయనే ఉన్నాడు కాబట్టి కంప్లైంట్ కూడా ఆయనే. ప్రభుత్వం తరఫున నామమాత్రపు లాయర్లను పెట్టి, వ్యక్తిగతంగా తన తరఫున ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లూత్రా లాంటి ఖరీదైన లాయర్లను పెట్టుకున్నాడు. ఈ ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ పార్టీ తరఫున జగదీశ్ రెడ్డి, డాక్టర్ సంజయ్, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ ఇంప్లీడ్ అయ్యారు.
ఆనాడు సమైక్యవాదులతో చేతులు కలిపి మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేసింది రేవంత్ రెడ్డి కాదా? నాలుగున్న రేండ్ల నుంచి స్టేల మీద బతుకుతున్న రేవంత్ రెడ్డికి ఆ స్టే వెకేట్ అయిందంటే.. ముఖ్యమంత్రి సీటు ఊడటం, జైలుకు వెళ్లడం ఖాయం. ఇప్పటికే రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి.. నిన్న కేసీఆర్ జగిత్యాల సభలో గర్జిస్తారని భయపడి రాత్రికి రాత్రి ఒక ఎకరానికి కిస్తీ వేశాడు.
కేసీఆర్ బయటకు వస్తే తప్ప నువ్వు రైతు భరోసా వేయవా? నిన్న వేసిన కిస్తీ కేవలం కేటీఆర్ సభను డైవర్ట్ చేయడానికి చేసిన పొలిటికల్ జిమ్మిక్కు మాత్రమే. 5000 కోట్లు వేయాల్సి ఉండగా ఇంకా 4000 కోట్లు బకాయి ఉంది. వడ్లు కల్లాలకు వచ్చినా రైతు భరోసా పూర్తి స్థాయిలో వేయలేదు.మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే మున్సిపల్ ఎన్నికల తర్వాత మిగతా రైతు భరోసా ఇస్తానని రేవంత్ మిర్యాలగూడ, సిద్దిపేట సభల్లో చెప్పాడు.
వచ్చే సంవత్సరం సూపర్ ఎల్ నినో వల్ల కరువు వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తే రేవంత్ రెడ్డికి సోయొచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, లక్ష కోట్లు కొట్టుకుపోయాయని నిన్నటిదాకా దుష్ప్రచారం చేసిన వ్యక్తి.. ఇవాళ మేడిగడ్డ రిపేరు చేసుకుని వాడుకుంటామని ఒప్పుకున్నాడు. రెండు పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోయినట్లా?
కాళేశ్వరంలో ఏ తెలవని, బీ తెలవని రేవంత్ రెడ్డి.. ఎల్లంపల్లి మేమే కట్టామని అబద్ధాలు చెబుతున్నాడు. కేసీఆర్ ఎంత గొప్పగా ఆలోచించారంటే.. వరద ఉంటే మిడ్ మానేరు నుంచి, మధ్యస్థంగా నీరుంటే ఎల్లంపల్లి నుంచి, కరువు వస్తే మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్ చేసుకునేలా కాళేశ్వరాన్ని డిజైన్ చేశారు. రేవంత్ శంకుస్థాపన చేసిన గంధమల్ల కూడా కాళేశ్వరంలో భాగమే.
కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కి.మీ సొరంగాలు, 1531 కి.మీ గ్రావిటీ కెనాల్, 98 కి.మీ ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు నీటి లిఫ్ట్, మొత్తంగా 240 టీఎంసీల వినియోగం.. ఇది కాళేశ్వరం.
లోయర్ మానేరు నుంచి సూర్యపేట దాకా నిండిన చెరువులు, కూడెల్లి, హల్దీ వాగులు పొంగడం, అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిండటం కాళేశ్వరం ఫలితాలు కాదా?
ఎల్లంపల్లి ప్రాజెక్టు సముద్ర మట్టానికి +148 మీటర్ల ఎత్తులో ఉంటే.. అక్కడి నుంచి మిడ్ మానేరు (+318 మీటర్లు), అనంతగిరి (+397 మీటర్లు), రంగనాయక సాగర్ (+490 మీటర్లు), మల్లన్న సాగర్ (+557 మీటర్లు), కొండపోచమ్మ సాగర్ (+618 మీటర్ల) ఎత్తుకు గోదావరి నీళ్లను మోటార్లు లేకుండా ఎలా తీసుకువస్తావు రేవంత్ రెడ్డి? ఇది ముమ్మాటికీ కాళేశ్వరం లిఫ్ట్ చేసిన ఫలితమే. ఎల్లంపల్లి, ఎస్సారెస్పీలు పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే..
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాడు శిలాఫలకం మీద రాష్ట్ర మంత్రిగా నా పేరుంది.. ఆనాడు మంత్రిగా ఉన్న నా వెనక రేవంత్ రెడ్డి నిక్కర్లు వేసుకుని తిరిగాడు. కావాలంటే వీడియోలు పంపిస్తా. కాంగ్రెస్ ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదు, ముంపు బాధితులకు పరిహారం కూడా ఇవ్వలేదు.తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ఆదేశాలతో 2052 కోట్లు ఖర్చు పెట్టి, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఇళ్లు కట్టించి ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసింది నేను మంత్రిగా ఉన్నప్పుడే.
1953లో ఎస్సారెస్పీ కడితే, 50 ఏళ్లయినా కాంగ్రెస్ నాయకులు 10 లక్షల ఎకరాలకు నీళ్లివ్వలేదు. బీఆర్ఎస్ వచ్చే నాటికి 6 లక్షల ఎకరాలకు నీరందేది.. లోయర్ మానేరు కాలువలు బాగుచేసి, 2000 కోట్లతో కాకతీయ కాలువ ఆధునికీకరించి 12 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే.మళ్లీ మేమే గెలుస్తామని ప్రచారం చేసుకుంటున్న రేవంత్ రెడ్డి.. ఈ కింది వర్గాలను దగా చేసినందుకు ప్రజలు మీకు ఓట్లు వేయాలా? జవాబు చెప్పాలి.
రైతుబంధు, రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టినందుకా?
తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు అప్పగించినందుకా?
తెలంగాణ డబ్బులను తీసుకెళ్లి ఢిల్లీకి, కుప్పానికి కడుతున్నందుకా?
2 లక్షల ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులను మోసం చేసినందుకా?
నెలకు రూ. 2500 ఇస్తామని మహిళలను దగా చేసినందుకా?
స్కీములు లేవు కానీ రాష్ట్రాన్ని స్కాములతో నింపినందుకా? సింగరేణిని దోచుకున్నందుకా?
హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టినందుకా? ఖమ్మం వెలుగుమట్లలో వేల ఇండ్లు కూల్చినందుకా?
కలుషిత ఆహారంతో 200 మంది గురుకుల విద్యార్థులను పొట్టనపెట్టుకున్నందుకా?
ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకుండా లక్షలాది విద్యార్థులను అంధకారంలో నెట్టినందుకా?
ఉద్యోగులను, రిటైర్డ్ ఉద్యోగులను, ఆర్టీసీ కార్మికులను, అంగన్వాడీలను రోడ్డున పడేసినందుకా?
ఫార్మా కంపెనీల కోసం లగచర్ల రైతుల చేతులకు బేడీలు వేసినందుకా? కులవృత్తులను ధ్వంసం చేసినందుకా?
నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి నూకలు చెల్లాయి. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు.