- చరిత్ర తిరగరాయబడింది
- “33% కాదు… ఇది భవిష్యత్తు భారతానికి 100% న్యాయం!”
భారత రాజకీయ యవనికపై సరికొత్త అధ్యాయం లిఖించబడింది. సగటు సామాన్య మహిళా ఓటరును కేవలం ఓటుబ్యాంకు రాజకీయాల ‘లబ్ధిదారు’గా చూసే పాత చింతకాయ పచ్చడి పద్ధతికి చరమగీతం పాడుతూ, విధాన నిర్ణేతలుగా వారిని పీఠంపై కూర్చోబెట్టే ఒక సాహసోపేత విప్లవానికి ఆంధ్రప్రదేశ్ వేదికైంది.
తెలుగుదేశం పార్టీ వార్షిక పండగ ‘మహానాడు’ సాక్షిగా, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ ప్రవేశపెట్టిన చారిత్రాత్మక తీర్మానం దేశవ్యాప్తంగా ఒక నైతిక భూకంపానికి కారణమైంది. అదే — 2029 సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33% అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల కేటాయింపు.
ఇది కేవలం ఒక ఎన్నికల నినాదం కాదు; స్త్రీశక్తి ప్రాధాన్యతను గుర్తించిన ఒక సైద్ధాంతిక నిబద్ధత. ఢిల్లీ పార్లమెంటు వేదికగా చట్టాలు చేసే తలుపులు తాత్కాలికంగా మూసుకుపోయినా, అమరావతి వేదికగా ఒక ప్రాంతీయ పార్టీ స్వచ్ఛందంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించడం భారత రాజకీయాల్లో మునుపెన్నడూ చూడని సరికొత్త ప్రయోగం.
“మహిళలు కేవలం పథకాల లబ్ధిదారులుగా మాత్రమే మిగిలిపోకూడదు. వారు చట్టాలు చేసే నిర్ణయాధికారులుగా మారాలి. భూమి కంటే ఎక్కువ భారం మోసే ఆడపడుచులను తక్కువ చేసి మాట్లాడే రాజకీయ సంస్కృతి అంతం కావాలి.”
— మహానాడు తీర్మాన ప్రసంగంలో నారా లోకేష్
పార్లమెంటరీ ప్రతిష్ఠంభన — అమరావతి ముందడుగు
రాజ్యాంగంలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలనే ఆశయంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణలు లోక్సభలో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించలేక సాంకేతిక కారణాలతో వీగిపోయింది.
నియోజకవర్గాల పునర్విభజన మరియు జనాభా గణన ప్రక్రియతో ఈ చట్టాన్ని ముడిపెట్టడం వల్ల మహిళా ప్రతినిధ్యం దశాబ్దాల పాటు వాయిదా పడుతుందనే ఆందోళన దేశవ్యాప్తంగా వ్యక్తమైంది.
ఢిల్లీ చట్టాల చట్రంలో ఈ సందిగ్ధత కొనసాగుతుండగానే, టిడిపి ఈ సాంకేతికతను ముందే అందిపుచ్చుకుంది. చట్టబద్ధమైన నిబంధనలతో నిమిత్తం లేకుండా, తమ పార్టీ అంతర్గత కోటా కింద 33% టికెట్లను మహిళలకే కేటాయిస్తామని ప్రకటించడం ద్వారా జాతీయ రాజకీయాల్లో ‘ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్’ (ముందడుగు లాభం) సాధించింది. జాతీయ మీడియా సైతం దీనిని “భారత రాజకీయాల్లోనే అత్యంత అరుదైన, మార్గదర్శక అడుగు” గా అభివర్ణించడం గమనార్హం.
ప్రతిపక్షాల ఆత్మరక్షణ — పొలిటికల్ అకౌంటబిలిటీ!
ఈ ప్రకటన క్షేత్రస్థాయిలో మిగిలిన పార్టీలను తీవ్రమైన ఆత్మరక్షణలోకి నెట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లు వీగిపోవడాన్ని తప్పుబట్టింది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరపున 33% టికెట్లు ఇస్తామని అధికారికంగా తీర్మానం చేయడంలో టిడిపి కంటే వైసీపీ వెనుకబడిందన్నది నిఖార్సైన వాస్తవం.
మరోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేంద్రం వైఖరిని విమర్శిస్తున్నప్పటికీ, తమ స్వంత పార్టీలో ఈ తరహా అంతర్గత కోటాను క్షేత్రస్థాయిలో అమలు చేయగలరా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ఆమెపై ఉంది. విమర్శలు చేయడం తేలికే అయినా, ఆచరణలో ముందడుగు వేయడమే అసలైన నాయకత్వ లక్షణం.
దేశవ్యాప్త గొలుసుకట్టు ప్రభావం
ఆంధ్రప్రదేశ్లో వేసిన ఈ అడుగు పొరుగు రాష్ట్రాల్లోని బలమైన ప్రాంతీయ పార్టీలపై నైతిక ఒత్తిడిని పెంచనుంది. మహారాష్ట్రలో ప్రస్తుతం కేవలం ‘లాడ్లీ బెహన్’ వంటి నగదు బదిలీ పథకాలకే ప్రాధాన్యత ఇస్తుండగా, రాబోయే ఎన్నికల్లో అక్కడ మహిళా అభ్యర్థుల సంఖ్యను పెంచాలనే ఒత్తిడి తీవ్రమవుతుంది.
తమిళనాడులో స్థానిక సంస్థల్లో మహిళా ప్రాతినిధ్యం బలంగా ఉన్నప్పటికీ, అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో కూడా స్పష్టమైన కోటాను ప్రకటించాల్సిన సవాల్ డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే పార్టీలకు ఎదురవుతుంది. ఇక ఉత్తరప్రదేశ్లో సామాజిక సమీకరణాలు, గెలుపు గుర్రాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది, కానీ జనాభాలో సగభాగంగా ఉన్న మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక సీట్ల కేటాయింపుపై సమాజ్వాదీ, బీఎస్పీ వంటి పార్టీలలో జవాబుదారీతనం పెరుగుతుంది.
ఇది దేశాన్ని ప్రభావితం చేసే అడుగు.
వారసత్వ ఘనత.. భవిష్యత్తుపై అప్రమత్తత!
తెలుగుదేశం పార్టీకి మహిళా సాధికారత విషయాల్లో ఒక చారిత్రాత్మక ట్రాక్ రికార్డ్ ఉంది. నాడు అన్న ఎన్టీఆర్ ఆస్తిలో సమాన హక్కు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకువస్తే, చంద్రబాబు నాయుడు ‘డ్వాక్రా’ విప్లవం ద్వారా మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. దేశంలోనే మొదటి మహిళా స్పీకర్గా ప్రతిభా భారతిని నియమించిన ఘనత కూడా ఈ పార్టీదే. నేడు లోకేష్ ఆ వారసత్వాన్ని ‘రాజకీయ సార్వభౌమత్వం’ వైపు నడిపిస్తున్నారు.
అయితే, ఈ చారిత్రాత్మక తీర్మానం కేవలం కాగితాలకే పరిమితం కాకూడదు. క్షేత్రస్థాయిలో దీని అమలు అనేక సవాళ్లతో కూడుకున్నది. గతంలో స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు భర్త లేదా తండ్రి వెనుక ఉండి నడిపించే ‘ప్రాక్సీ రాజకీయం’ చూశాం. శాసనసభ స్థానాల్లో 33% కోటా అమలు చేసినప్పుడు, కేవలం రాజకీయ కుటుంబాల వారసురాళ్లకు మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో పోరాడే అసలైన మహిళా నాయకులకు టికెట్లు దక్కినప్పుడే ఈ ఆశయం సంపూర్ణమవుతుంది.
ఓటు వేసే హక్కును దాటి, చట్టాలు చేసే హక్కు వైపు తెలుగు మహిళలు అడుగులు వేస్తున్నారు. 2029 ఎన్నికల సమరంలో మూడో వంతు స్థానాల్లో తెలుగు ఆడపడుచులు జెండా పాతబోతున్నారు.
ఇన్నాళ్లూ వంటింటికే పరిమితమైన స్త్రీశక్తి, ఇక ప్రజాస్వామ్య దేవాలయంలో ‘మహాశక్తి’గా అవతరించబోతోంది. మహిళా లోకం ఈ పరిణామాన్ని కేవలం హర్షించడమే కాదు.. ఆచరణ సాధ్యమయ్యేలా అప్రమత్తంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.
మన ఓటు మన హక్కు మాత్రమే కాదు — మన జవాబుదారీతనం కూడా!
ఏది ఏమైనా మహిళల రాజకీయాలకు అడుగులు ఆంధ్రాలో పడ్డాయి. దుర్గమ్మలు ఇక సభల గుమ్మాల లోపలికి అడుగిడనున్నారు.