- రేవంత్ 2034 వరకు నేనే సీఎం అంటున్నావు కదా
- బిడ్డా.. ఇదేనా నీ రైతు భరోసా?
- బిడ్డ రా.. ఇక్కడికి తెలుసుకుందాం
- నీకు రైతుల దగ్గరికి వచ్చే ముఖం, దమ్ము లేదు
రేవంత్ తుగ్లక్ పాలసీలు - దద్దమ్మ ప్రభుత్వం ఎన్నుకున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
- వెంటనే ప్రతి గింజ కొనుగోలు చేయాలని హెచ్చరిస్తున్నాము
- సీఎం రేవంత్‌రెడ్డికి మల్కాజిగిరి బిజెపి ఎంపి ఈటల రాజేందర్ సవాల్
- రైతు గోస బీజేపీ భరోసా” కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కడెం, ఖానాపూర్ లో రైతులతో మాట్లాడిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, బీజేఎల్పీ లీడర్ మహేష్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు
(నిర్మల్ జిల్లా కడెం, ఖానాపూర్ నుంచి)
ఇరవై రోజుల నుండి పట్టించుకోలేదు. ఈరోజు హడావుడిగా తరలిస్తున్నారు. ఒక్క క్వింటాకు 80 రూపాయల నుండి 100 రూపాయలు మేమే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది.. హమాలికి 50 రూపాయలు, లారీకి 30 రూపాయలు ఇస్తేనే సంచులు తీసుకుపోతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే మంత్రి మమ్ముల్ని పట్టించుకున్న పాపాన పోలేదు అని రైతులు బీజేపీ నేతలకు వివరించారు.
బీజేపీ వారు డ్రామా చేస్తున్నారని మంత్రులు విమర్శిస్తున్నారు కదా అని రైతుల వద్ద ప్రస్తావించిన ఈటల రాజేందర్.. దానికి రైతులు స్పందిస్తూ.. సీఎం మంత్రులకు "ఫుట్ బాల్" ఆట మీద ఉన్న ఆసక్తి రైతుల మీద, ధాన్యం కొనుగోళ్ల మీద లేదని రైతులు అన్నారు.
కేంద్రం డబ్బులు ఇస్తున్నా వీరు మాత్రం కొనుగోళ్లు చేయలేక పోతున్నారు. మేమందరం మార్పు కోసం ఓటు వేసి సీఎంను మంత్రులను చేస్తే, వీరు మాత్రం మమ్ముల్ని పట్టించుకోవడంలేదని సత్యనారాయణ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
పొక్కలు పడ్డ సంచులు ఇచ్చారు. పండిన ధాన్యం మొత్తం కొనడం లేదు.
కొన్ని సెంటర్స్ లో అసలు కొనుగోళ్లకోసం ఏర్పాట్లు కూడా చేయలేదనీ బీజేపీ నేతల బృందానికి తెలియజేసిన కడెం రైతులు.
తడిచి మొలకెత్తిన ధాన్యం ను పరిశీలించిన బీజేపీ నేతలు.
కొనుగోలు కేంద్రాలు సెంట్రల్ జైళ్లుగా మారాయి.. ఇక్కడకి వచ్చిన వాళ్ళం ఇక్కడే మగ్గి పోతున్నాం. నరకం అనుభవిస్తున్నాం. ఇలానే అయితే వ్యవసాయం బంద్ చేస్తాం అని వాపోయిన రైతులు. దిక్కు లేక వ్యవసాయం చేస్తున్నాం తప్ప ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు. మార్కెట్ కి వచ్చినప్పటి నుండి పైసలు పడేదాక
గోస పడుతున్నాం అన్నారు.
సీఎంలు ఎమ్మెల్యేలు అందరూ మేము రైతు బిడ్డలం అని చెప్పుకోవడమే తప్ప ఒక్కరు కూడా రైతుల గురించి పట్టించు కోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
నెల రోజుల నుండి పెళ్ళాం పిల్లలం అందరం ఇక్కడే ఉంటున్నాం. హమాలీలు లేరు, లారీలు లేవు. ఇంత ఘోరం ముందెన్నడూ చూడలేదని ఖానాపూర్ రైతులు వివరించారు.
వారితో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం రైతన్న మీద పగబట్టి ఇంత మోసం చేస్తారని కలలో కూడా ఊహించలేదు. నాలుగు రోజుల నుంచి మేము తిరుగుతున్నాము. ఎక్కడికి వెళ్లినా ఒకటే వేదన. ఒకటే దుఃఖం. ఇంత శిక్ష ఈ ప్రభుత్వం ఎందుకు వేస్తుందని రైతులు ఏడుస్తున్నారు. మీరు వస్తున్నారని తెలియగానే బస్తాలు వస్తున్నాయి. లారీలు వస్తున్నాయి. మీరు తిరుగుతుంటే మాకు మేలు జరుగుతుందని రైతులు అంటున్నారు. వరి ధాన్యం మక్కలు తెల్ల జొన్నలు గోదాములకు చేరుకునేంతవరకు మీ యాత్ర ఆపవద్దు అని కోరుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత మూర్ఖంగా అనాలోచితంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని ఊహించలేదు. తెల్ల జొన్నలు ఎకరానికి 30 క్వింటాలు దిగుబడి వస్తే 10 క్వింటాలు మాత్రమే కొంటామని ప్రభుత్వం చెప్తుంది. ఈ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ఉందా అని రైతులు అడుగుతున్నారు. అసలు వ్యవసాయ పట్ల వీరికి అవగాహన ఉందా అని ప్రశ్నిస్తున్నారు. మొక్కజొన్నలు 40 క్వింటాళ్లు దిగుబడి వస్తుంటే ఇరవై ఆరున్నర క్వింటాళ్లు మాత్రమే కొంటామని ప్రభుత్వం ప్రకటిస్తే మిగిలిన మక్కలు ఎక్కడ అమ్ముకోవాలి.
సన్ ఫ్లవర్ 5 వేలకు కొనే దిక్కులేదు. నూనె గింజలు పండించండి అనే ప్రకటించావు కదా? ఎందుకు కొనడం లేదని ప్రశ్నిస్తున్నాను. బిడ్డా ఇదేనా నీ రైతు భరోసా? ఇదేనా నీ రైతు పాలసీ? కౌలు రైతులకు మార్కెట్ లో ధాన్యం అమ్ముకోవడానికి వీలు లేదు. భూమి యజమాని వచ్చి థంబ్ పెట్టాలి అంటున్నారు. ముంబైలో, దుబాయిలో, హైదరాబాద్ లో ఉన్న రైతు ఎలా వస్తాడు అనే సోయి ఈ ప్రభుత్వానికి ఉందా అని నేను అడుగుతున్నా.
నీ పాలసీలు తుగ్లక్ పాలసీలగా ఉన్నాయి. మెదడు లేని పాలసీలుగా ఉన్నాయి. ఇలాంటి పద్ధతులన్నీ పక్కనపెట్టి, పండించిన ప్రతి గింజ కొంటానని ఇచ్చిన మాట ప్రకారం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. 2034 వరకు ఉంటానని అనుకుంటున్నావా బాబు.. నీకు కాలం దగ్గర పడింది. దమ్ముంటే ఇప్పుడే రాజీనామా చేయి. ఎన్నికలకు రా. నీ సంగతి ఏందో తెలుస్తుంది. ఆ ప్రభుత్వాన్ని బొంద పెట్టడానికి తొమ్మిదిన్నరేళ్లు పట్టింది. కానీ నీ ప్రభుత్వాన్ని బొంద పెట్టడానికి మూడేళ్లలోనే తేలిందని రైతులు అంటున్నారు.
ఎంత పంట దిగుబడి వస్తుందని అంచనాలు లేవా ?ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా పనిచేస్తున్నారా? అంచనాలకు అనుగుణంగా బస్తాలు, హమాలీలు, లారీలు, గోదాములు ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోయారు? మేము రైతులకు భరోసా కల్పించడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి వస్తే , రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. బిడ్డ రా.. ఇక్కడికి తెలుసుకుందాం. నీకు రైతుల దగ్గరికి వచ్చే ముఖం దమ్ము లేదు.
ప్రెస్ మీట్ లు మా మీద పెట్టడం కాదు బిడ్డ.. రైతుల దగ్గరికి వచ్చి మాట్లాడండి. రైతులను ఆదుకునే ప్రయత్నం చేయండి తప్ప, ఎదురు దాడి మంచిది కాదు. రైతులారా గమనించండి. ఇలాంటి దద్దమ్మలను ఎన్నుకొని మనం బాధపడుతున్నాము. చివరి గింజ కొనే వరకు రైతులకు మేము అండగా ఉంటాము.
ఈ యాత్రలో బీజేపీ శాసనసభ పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, హరీష్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి.. ఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య , అంజిరెడ్డి, ఏవీఎన్ రెడ్డి, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.