(ఇంద్రాణి)
భారతదేశం మునుపెన్నడూ చూడని రాజకీయం—రేవంత్ మార్క్ రాజకీయం. కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఎప్పుడూ ఊహించలేని స్ట్రాటజీ. ఇప్పుడు తానే పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడో, ఆ పార్టీకి ఎంత చిత్తశుద్ధితో పని చేస్తున్నాడో.. తాను వదిలిపెట్టి వచ్చిన పార్టీకి ఇప్పటికీ కృతజ్ఞతగా ఉంటున్నానని ప్రపంచానికి తెలియజెప్పగల సాహసం రేవంత్ రెడ్డికి మాత్రమే సొంతం.
ఒకనాడు ఎన్టీఆర్ కమ్యూనిస్టులను ఒకవైపు, భారతీయ జనతా పార్టీ వారిని మరోవైపు కూర్చోబెట్టుకుని దేశ రాజకీయాలలో ప్రధానపాత్ర పోషించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకవైపు కాంగ్రెస్ నాయకులను, మరోవైపు టీడీపీ వారినీ కూర్చోబెట్టుకుని హైదరాబాదు నడిబొడ్డున తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
అమీర్‌పేట్‌లో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఆవిష్కరించటమే సంచలనం అయితే.. తారక రామారావు గుణగణాలతో పాటు ఆయన పెట్టిన పథకాలను ఇందిరాగాంధీ కూడా అనుసరించిన విషయాన్ని చెప్పటం మరింత సంచలనం.
ఈ సందర్భంలో ఒక విషయం మాత్రం ప్రస్తావించక తప్పదు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి ఇప్పటివరకు సగానికి పైగా కాలం అధికారంలో ఉన్నది. ఇదే విషయాన్ని మరో రకంగా చెప్పాలంటే, కొద్దిగా తక్కువగా సగం కాలం అధికారానికి దూరంగా ఉన్నది. ప్రభుత్వం పర్ఫార్మెన్స్ బాగుండక అధికారానికి దూరంగా ఉండటం అయితే అర్థం చేసుకోవచ్చు.
కానీ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే సంక్షేమానికి తెర తీసింది టీడీపీ అనేది ఎవరూ కాదనలేని సత్యం. సంక్షేమానికి ఎన్టీఆర్ ఆద్యుడు అయితే, ఒక విజన్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంలో మార్గదర్శకుడు చంద్రబాబు నాయుడు. మధ్యలో వస్తూ పోతూ ఉన్న ముఖ్యమంత్రులు వారిద్దరూ చేసిన కార్యక్రమాలను కొనసాగించిన వారే కానీ, కొత్తగా ఆరంభించినవి చాలా తక్కువ.
ఉదాహరణకు రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన ‘ఆరోగ్యశ్రీ’ కార్యక్రమంతో ఆయన దేవుడు అయ్యాడు. కానీ అప్పటికే, అంటే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నిమ్స్ లాంటి వైద్య సంస్థలలో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఉచిత మరియు రాయితీ వైద్యం అందించే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అప్పటికి ప్రైవేట్ వైద్యరంగం ఇంతగా అభివృద్ధి చెంది లేదు.
కానీ ఎన్టీఆర్ పాలనలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పెంచటమే కాక, ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సౌకర్యాలను మెరుగుపరిచి నిమ్స్, గాంధీ, ఉస్మానియా, జీజీహెచ్ లాంటి ఆసుపత్రులలో పేదలకు ఉచిత వైద్యాన్ని అందించారు. 2007లో రాజశేఖరరెడ్డి, అదే ఎన్టీఆర్ మొదలుపెట్టిన విధానాన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా వర్తించేలా మెరుగుపరిచారు. టీడీపీ మొదలుపెట్టిన పథకాలనే ఎవరైనా కాలానుగుణంగా అలా మెరుగులు దిద్దారు.
అయినా టీడీపీ సుదీర్ఘకాలం అధికారానికి దూరంగా ఉన్నది అంటే.. ప్రచార వైఫల్యమే ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. చంద్రబాబు చేసిన ఆ పొరపాటును రేవంత్ చేయటం లేదు. నిన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంలో ఎన్టీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ఏకరువు పెట్టిన రేవంత్ రెడ్డి, టీడీపీ సుపరిపాలనను ప్రజలకు గుర్తు చేశారు.
బతుకమ్మ పండుగకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే చీరల పథకానికి, ఏనాడో ఎన్టీఆర్ చేసిన ‘జనతా వస్త్రాల పంపిణీ’ పథకమే స్ఫూర్తి అని చెప్పటం రేవంత్ సునిశిత పరిశీలనకు నిదర్శనం. ‘ఇందిరమ్మ ఇళ్లకు’ స్పూర్తి ఎన్టీఆర్ పేదలకు తెచ్చిన ‘పక్కా గృహ నిర్మాణ పథకమే’ అని చెప్పటానికి ధైర్యం కావాలి. బహుశా రేవంత్ రెడ్డి విజయరహస్యం ఆ తెగువేనేమో అనిపించక మానదు.
కమ్యూనిస్టులు చెప్పే కూడు, గుడ్డ, నీడ అనే నినాదానికి ఆచరణాత్మక పథకాల ద్వారా ఎన్టీఆర్ ఎలా రూపకల్పన చేశారో రేవంత్ రెడ్డి వివరిస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ చేసుకోవలసిన ప్రచారం ఏమిటో అర్థం చేసుకుని ఉండవచ్చు. కిలో రెండు రూపాయలకే బియ్యం ద్వారా కూడు, జనతా వస్త్రాల ద్వారా గుడ్డ, పక్కా గృహ నిర్మాణం ద్వారా నీడను అందించిన ఎన్టీఆర్ ను తాను స్ఫూర్తి ప్రదాతగా తీసుకుంటున్నాను అని చెప్పి తన విజ్ఞతను చాటుకున్నారు రేవంత్ రెడ్డి.
ముఖ్యమంత్రి మైత్రీవనం వద్ద ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేసే సమయానికి, ప్రొఫెసర్ కావాలని మొదలుపెట్టినట్లుగా ఆంధ్రా-తెలంగాణ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అయినా రేవంత్ రెడ్డి జంకలేదు. ఎన్టీఆర్ ను ఒక జాతీయ నాయకుడుగా గుర్తించవలసిన అవసరాన్ని నొక్కి వక్కాణించారు. పనిలో పనిగా చంద్రబాబు సైబరాబాద్‌ను నిర్మించినట్లే, తాను ‘ఫ్యూచర్ సిటీ’ నిర్మాణం చేస్తానని, చేసి తీరుతానని వాగ్దానం చేశాడు.
తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన నందమూరి తారక రామారావును ఒక ప్రాంతం వాడిగానో, ఒక కులానికి చెందిన వాడిగానో, ఒక పార్టీకి నాయకుడుగానో మాత్రమే గుర్తిస్తే అది సంకుచితత్వం అవుతుందని ఎలుగెత్తి చాటాడు. అదే సమయంలో మహానేత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తయారు చేసిన నేతల చిట్టా విప్పాడు. తెలంగాణ రాష్ట్రానికి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ కాదా అని కేసీఆర్‌ను నిలదీశారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్, కృష్ణా యాదవ్, మోత్కుపల్లి నరసింహులు, మండవ వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి లాంటి నేతల నుండి తన వరకు రాజకీయ పాఠాలు నేర్పింది ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అని ఈతరం యువతకు తెలియజేశారు, సంకుచితులను ప్రశ్నించారు. ఒక్క విషయం ఇక్కడ ఒప్పుకోక తప్పదు. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి పట్ల ఎంత ఆత్మీయత ఉన్నా, సాధ్యమైన మేరకు రేవంత్ రెడ్డి పేరు అంత సులభంగా తీసుకువచ్చే ప్రయత్నం చేయరు.
రామోజీ ఎక్స్‌లెన్సీ అవార్డుల వేడుక సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయాలి అని సూచించటం, చంద్రబాబునే ముందు వెలిగించమని రేవంత్ చెప్పటం, చివరకు ఇద్దరూ కలసి వెలిగించటం ఆ వేడుకకు ప్రత్యేకతను అద్దింది. రేవంత్ పార్టీని వీడిన తరువాత, బహుశా చంద్రబాబు నాయుడు సహజంగా తాను పాటించే పరిధికి మించి రేవంత్‌తో ఆత్మీయతను బహిరంగంగా తెలియజేసిన ఏకైక సందర్భం అదేనేమో!
పదిమంది దృష్టిని తమ ఆత్మీయత ఆకర్షిస్తే లేనిపోని తలనొప్పులు వస్తాయనే సంకోచం చంద్రబాబుకు ఉంటుంది. కానీ తాను ఒకనాడు టీడీపీ లో ముఖ్యపాత్రను పోషించాను అనేది ఒక చారిత్రక సత్యం అనీ, తెలంగాణాలో టీడీపీ అస్తిత్వం ప్రశ్నార్థకం అయింది కాబట్టి తాను పార్టీను వీడటం జరిగింది కానీ వేరే కారణాలు లేవనీ చెప్పడానికి నిద్రలో కూడా సంకోచించని తత్వం రేవంత్ రెడ్డిది.
కేసీఆర్ తాను కూడా ఆ టీడీపీ తరగతి విద్యార్థి అయినప్పటికీ ఒప్పుకోవటానికి ధైర్యం చాలదు. ధైర్యంగా చెప్పుకోగలిగే రేవంత్ రెడ్డికి సంజాయిషీ చెప్పుకోవలసిన అవసరం ఉండదు, కేసీఆర్‌ను మాత్రం ఆ సంకోచం ఎప్పటికీ వీడదు. అందుకే ఒక జిల్లా పరిషత్ మెంబర్‌గా మొదలైన రేవంత్ రెడ్డి, స్వయంకృషితో యువ ముఖ్యమంత్రి కాగలిగాడు.
రాజకీయాలలో “మాట తప్పం, మడమ తిప్పం” అనే ట్యాగ్‌లైన్‌ను చాలామంది తగిలించుకుని వస్తారు, తర్వాత అన్నీ మర్చిపోతారు. కానీ రేవంత్ ఆ కోవలోకి రారు. మొన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేసి, “రేవంత్ మాట తప్పడు, మడమ తిప్పడు” అనే ట్యాగ్‌లైన్‌కు “మాట మార్చడు” అనేది కూడా చేర్చుకుని, అరుదైన వ్యక్తిత్వం రేవంత్ రెడ్డిది అని నిరూపించుకున్నాడు.
“పిరికివాళ్లు రోజుకి వందసార్లు చస్తారు, ధైర్యవంతుడు ఒక్కసారే చస్తాడు” అన్న సామెతను బలంగా నమ్ముతాడేమో కానీ, తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎవరితో పోరాడటానికి అయినా సిద్ధం రేవంత్ రెడ్డి. అటువంటి సిద్ధాంతాన్ని మనసా, వాచా, కర్మణా అనుసరిస్తున్న రేవంత్‌రెడ్డి ఎటువంటి ఓటమిని అయినా గెలుపుగా మార్చుకోగలడు. పోరాడితే పోయేదేముంది..బానిస సంకెళ్లు తప్ప!