- పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ భవనం కొట్టింది ఆమే
- నందిగం సురేష్ బినామీ
- టిడిఆర్ బాండ్ల కుంభకోణంలో ఆమె పాత్ర బహిరంగం
- వైసీపీతో అంటకాగిన అధికారికి అందలమా?
- గత ప్రభుత్వంలో వైసిపి నేతలతో కుమ్మక్కై వేలకోట్ల టీడిఆర్ కుంభకోణాలు చేసిన,చేస్తున్న టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లతను సస్పెండ్ చేయాలి
- ఆమె నేతృత్వం లో జారీ చేసిన టిడిఆర్ బాండ్లను రద్దు చేయాలి
- విశాఖ,కాకినాడ,తణుకు,తిరుపతి,గుంటూరు లలో టి డి ఆర్ ల కుంభకోణంలో ఆమె పాత్ర ను విజిలెన్స్ విచారణ నివేదిక బహిర్గతం చేయాలి
- కాకినాడ టి డి ఆర్ కుంభకోణంలో ఆమె పాత్ర ను విజిలెన్స్ విచారణ నివేదిక బహిర్గతం చేసింది
- విచారణ నివేదిక ఆధారంగా విద్యులత ను వెంటనే సస్పెండ్ చేయాలి
కుంభకోణంలో భాగస్వాములైన కాకినాడ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అప్పటి కమిషనర్ల పైన చర్యలు తీసుకోవాలి - జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్
విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న విద్యుల్లత అక్రమాలు అన్యాయాలు కుంభకోణాలకు కేంద్రంగా మారారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ కోరారు. శుక్రవారం విశాఖపట్నం లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ,ఆమె అవినీతి చర్యలు కూటమి ప్రభుత్వానికే పెద్ద మచ్చగా మారాయని అన్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో టౌన్ ప్లానింగ్ లో కీలకంగా వ్యవహరించిన ఆమె నేతృత్వంలో వేలకోట్ల విలువైన అక్రమ టీడిఆర్ లు జారీ అయ్యాయని, ఆ సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కూటమి నేతలు పలు పర్యాయాలు హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.
అయితే ఏం జరిగిందో ఏమిటో తెలియదు కానీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ లో అత్యంత అవినీతి అధికారినిగా పేరుపడ్డ విద్యుల్లత టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా ఇప్పటికీ చక్రం తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడు సంవత్సరాలుగా ఆమె నేతృత్వంలో ఆమె సిఫార్సులతో జారి అయిన టిడిఆర్లు, ఆమోదం పొందిన భవన నిర్మాణ అనుమతులపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
విద్యుల్లత కారణంగా వందల కోట్ల నష్టం…బహిర్గతం చేసిన విజిలెన్స్ విచారణ
“డిటిపిసి డైరెక్టర్ హోదాలో గత వైసిపి ప్రభుత్వం లో విద్యుల్లత కాకినాడలో అక్రమ టీడిఆర్లు జారీ చేసి వందల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని కూటమి ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ నివేదిక స్పష్టం చేసింది. ఈ నివేదిక ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీన ప్రభుత్వానికి అందింది. అయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు ప్రారంభించలేదు.
కాకినాడలో ప్రభుత్వ భూమిలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్,సాలిడ్ వేస్ట్ మానేజ్మెంట్ పేరిట అప్పటి కాకినాడ వైయస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సిఫార్సులతో సుమారు 500 కోట్ల అక్రమ టిడిఆర్ లను విద్యుల్లత మంజూరు చేశారు.సురేష్ నగర్ కన్వర్టబుల్ స్టేడియం పేరిట 168 కోట్ల టిడిఆర్ ను వైయస్సార్ కాంగ్రెస్ కు చెందిన విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోసం విద్యుల్లత మంజూరు చేయించారు.
ఆ టి డి ఆర్ బాండ్లనే ఆయన విశాఖ విఐపి రోడ్డులో వివాదాస్పద సిబిసిఎన్ సి స్థలంలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి వినియోగిస్తున్నారు. ఈ వాస్తవాలను విజిలెన్స్ కమిటీ విచారణ నివేదిక స్పష్టం చేసింది. విద్యుల్లతపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ” అని స్పష్టం చేశారు
పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ భవనం కొట్టింది ఆమే
“తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు నిబంధన మేరకు గాజువాకలో నిర్మించిన భవనాన్ని వైసీపీ నేతల సిఫారసు మేరకు అప్పట్లో కూలగొట్టించిన వ్యవహారంలో ప్రధాన వ్యక్తి అప్పుడు జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ గా ఉన్న విద్యుల్లత భవనం నిబంధనల మేరకు ఉన్నప్పటికీ వైసీపీ నేతలు వత్తిడితో ఆమె ఆ భవనాన్ని తొలగింపజేశారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన అనకాపల్లి మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత కార్పొరేషన్ చైర్మన్ పిలా గోవింద భవనాన్ని కూడా ఆమె తొలగించారు. విశాఖ ఎంపీ శ్రీ భరత్ కు చెందిన గీతం విశ్వవిద్యాలయం గోడను కూడా ఆమె నేతృత్వంలోనే తొలగించారు. కూటమి పార్టీల నేతలపై వైసిపి కక్ష సాధింపులకు ఐదేళ్లపాటు ఆమె వేదిక అయ్యారు. ప్రభుత్వం మారగానే అటువంటి వ్యక్తిపై చర్యలు ఉంటాయని అందరూ భావించారు. అయితే విచిత్రంగా కూటమి ప్రభుత్వంలో ఆమెకే పెద్దపీట వేయటం అనుమానాస్పదంగా మారింది.” అని పేర్కొన్నారు.
వైసీపీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పైన చర్యలు లేవు
“కాకినాడలో టి డి ఆర్ కుంభకోణానికి కారకుడైన చంద్రశేఖర్ రెడ్డి పై ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. చంద్రశేఖర్ రెడ్డి తో పాటు అప్పుడు మున్సిపల్ కమిషనర్ గా అడ్డగోలుగా వ్యవహరించిన నాగ మహేశ్వరరావు పైన చర్యలు తీసుకోవాలి. చంద్రశేఖర్ రెడ్డి కాకినాడలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగుపెట్టనివ్వలేదు. కూటమి నేతలు కార్యకర్తలపై అదే పనిగా రౌడీ షీటర్లు తో దాడులు చేయించారు. జనసేన నేతలను రోడ్లపై బహిరంగంగా కొట్టించారు. విద్యుల్లత తో పాటు ఈ కుంభకోణంలో బాధ్యులైన వారి పైన చర్యలు తీసుకోవాలి.” అని డిమాండ్ చేశారు.
విశాఖలో వందల కోట్ల నకిలీ టి.డి. ఆర్ లు
“విద్యుల్లత విశాఖలో వందల కోట్ల నకిలీ టిడిఆర్లు మంజూరు చేశారు. వాటిపై అప్పట్లో కూటమి నేతలు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. మురికివాడ ఆయన ఇందిరా నగర్ కాలనీలో ప్రభుత్వం అనుమతితో 1:1 టిడిఆర్ ఇవ్వాల్సిన చోట అనుమతి లేకుండా 1:4 టిడిఆర్ మంజూరు చేశారు.
విచిత్రంగా అదే కాలనీకి మరో మారు 1:4 టిడిఆర్ కి టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ హోదాలో తాజాగా సిఫార్సు చేశారు. వెంకటపతి రాజు నగర్ మురికివాడ లో ఇదేవిధంగా టిడిఆర్ బాండ్లు విద్యుల్లత మంజూరు చేయించి కోట్లలో లద్ది పొందారు. బిలాల్ కాలనీ వంటి మరో మూడు మురికి వాడలకు టిడిఆర్ ఇచ్చేందుకు ఆమె ఫైల్స్ సిద్ధం చేశారు.” అని మూర్తి యాదవ్ చెప్పారు
ప్రభుత్వానికి మచ్చ
“టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ అవినీతి అక్రమాలు కూటమి ప్రభుత్వానికి మచ్చగా మారాయి. విశాఖకు చెందిన వైసీపీ ఎంపీ ఎం వి వి సత్యనారాయణ అవినీతి లంచాల పంపిణీ వ్యవహారంలో నేరుగా విద్యుల్లత చాంబర్ కి వెళ్లి తుపాకితో బెదిరించిన సంఘటన ఇటీవల రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దీనిపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం కాలక్షేపం చేయటం వల్ల చెడ్డ పేరు వస్తుంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో లేని అధికారాలన్నీ ఆమెకే
“విద్యుల్లత టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నగరపాలక సంస్థ అధికారాలను హస్త గతం చేసుకోవడం ప్రారంభించారు. గతంలో నగరపాలక సంస్థ కమిషనర్ల మంజూరు చేసే ప్లాన్లు వారి నుంచి లాగేసుకుంటున్నారు. 8 ఫ్లోర్ల పై బడిన భవనం అనుమతులను ఐఏఎస్ అధికారులైన కమిషనర్ల చేతుల్లోంచి లాగేసి అత్యంత అవినీతిపరురాలైనా విద్యుల్లత చేతుల్లో పెట్టడం ప్రభుత్వానికి అప్రతిష్ట. కేవలం తన అవినీతి కోసమే ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ” అని చెప్పారు
తనకు అనుకూలంగా టిడిఆర్ కమిటీలో మార్పులు
గతంలో టిడిఆర్ కమిటీలో తహసీల్దారు ,ఆ ప్రాంత సబ్ రిజిస్టార్ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిందని , వీరిద్దరూ ఉండటంవల్ల భూమి తాలూకా డాక్యుమెంట్లు ఒరిజినల్ ఆ కాదా అని తేలటం, వాస్తవ మార్కెట్ ధర నిర్ణయించడం తేలికవుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆ పని చేసిందని తెలిపారు .అయితే తహసీల్దార్, సబ్ రిజిస్టర్లు కమిటీ లో ఉంటే అక్రమాలకు, అవినీతి కి అవకాశం ఉండదన్న భావనతో విద్యుల్లత వారిద్దరిని కమిటీ లోంచి తొలగింప చేశారని ధ్వజమెత్తారు.
మంత్రి కంటే ఆమె ఎక్కువ
ప్రస్తుతం రాష్ట్ర పరిపాలక పట్టణాభివృద్ధి శాఖ లో ఆమె మంత్రి నారాయణను మించిపోయారని, ఈ శాఖను ఏలుతున్నది నారాయణ లేక విద్యుల్లత అన్న అనుమానాలు సర్వత్ర వ్యక్తమవుతున్నాయని అన్నారు .మంత్రితోపాటు విద్యుల్లత అధికారాల ముందు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా డమ్మీగా మారిపోతున్నారని, ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో చేయాల్సిన పనులను తన పలుకుబడితో ఆమె పరిధిలోకి తెచ్చేసుకున్నారని ఆరోపించారు.
నందిగం సురేష్ బినామీ గా
వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా పనిచేసిన నందిగం సురేష్ కు బినామీగా విద్యుల్లత ఆ ప్రభుత్వంలో పేరుపడ్డారని, అమరావతి రైతుల ఉద్యమానికి వ్యతిరేకంగా నందిగం సురేష్ అప్పట్లో పోటీ ఉద్యమం నడిపారని చెప్పారు .దానికి స్పాన్సరర్ విద్యుల్లత అనేది వైసిపి నేతలు అందరికీ తెలిసిన రహస్యమే అని,వైసిపి ప్రభుత్వం హయాంలో వివాదాస్పదంగా మారిన తణుకు టీడీఆర్ ల కుంభకోణం, తిరుపతి టీడీఆర్ల్ కుంభకోణం కూడా వైసీపీ నేతల కేంద్రంగా జరిగినవే అని అన్నారు .
వీటన్నింటికీ సూత్రధారి విద్యుల్లతే అని,విశాఖలో వివాదాస్పదంగా మారిన ఎర్రమట్టిదిబ్బల వ్యవహారంలో కూడా విద్యుల్లత హస్తముందని ఆరోపించారు .విశాఖ వుడా సియుపి హోదాలో ఆమె ఎర్రమట్టి దిబ్బల వ్యవహారంలో రెండు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని అప్పట్లో ప్రభుత్వానికి నివేదికలు అందాయని, అటువంటి వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా మరిన్ని అధికారాలు కట్టబెట్టడం దారుణమని పేర్కొన్నారు .
విజిలెన్స్ నివేదిక ఆధారంగా అయిన వెంటనే చర్యలకు ఉపక్రమించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అత్యంత కీలకమైన టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా విద్యుల్లత స్థానంలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. టౌన్ ప్లానింగ్ వ్యవహారాలు తెలిసిన సీనియర్ ఐఏఎస్ ను ఈ పోస్టులో నియమించాలని విజ్ఞప్తి చేశారు.