September 24, 2026

లోకేష్..జర భద్రం బాసూ!

  • డిజెకి అనుమతులపై తొందరపడ్డారా?
  • లోకేష్‌ను సలహాబృందం విమర్శలపాలు చేస్తోందా?
  • యూత్‌లో జోష్ కోణం, హిందూ మార్కు సరే..
  • ఆగ్రహించే తటస్ధులు, విద్యావంతులు, వృద్ధుల మాటేమిటి?
  • లోకేష్ నిర్ణయాన్ని విమర్శిస్తున్న మేధావులు, పర్యావరణవేత్తలు
  • సోషల్‌మీడియా వేదికగా మాజీ ఐఏఎస్ శర్మ, మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు వ్యంగ్యాస్త్రాలు
  • ఇప్పటికే డిజె సౌండ్లతో మృతి చెందిన వారి ఫొటోలను లోకేష్ అనిత ప్రకటనలను ముడిపెడుతున్న నెజిజన్లు
  • డిజె సౌండ్లపై రోజూ పోలీసులకు ఫిర్యాదుల వెల్లువ
  • సర్కారే సెలవిచ్చినందున తామేమీ చేయలేమంటున్న పోలీసులు
  • గుండెపోటు, న్యూరో రోగులకు డిజె విషమ పరీక్ష
  • భావినేతను సలహా బృందం తప్పుదోవపట్టిస్తోందా?
  • లోకేష్‌కు సలహాబృందం డిజె నిబంధనల ఫీడ్‌బ్యాక్ ఇవ్వలేదా?
  • సీనియర్లు సలహాలివ్వడం లేదా?.. తీసుకోవడం లేదా?
  • అనుభవరాహిత్యంతో సమస్యలు వస్తున్నాయా?
  • కాబోయే అధినేత ఆచితూచి అడుగువేయడం లేదా?

( మార్తి సుబ్రహ్మణ్యం)

అది గుంటూరు బ్రాడీపేటలో రోడ్డుకు ఆనుకుని ఉన్న ఒక అపార్టుమెంటు. అందులో ఉండే ఫ్లాట్లలో 10 మంది వృద్ధులు. వారిలో నలుగురైదుగురు గుండెజబ్బుతో బాధపడుతున్న వాళ్లే. ఆపరేషన్లు చేయించుకున్నవారే. మరో 6, 7 మంది పొద్దున్నే స్కూళ్లకు వెళ్లే చిన్నారులు. ఇక ముగ్గురు బాలింతలయితే, ఒకరు గర్భిణి. రోడ్డుపైనే ఉన్న ఆ ఒక్క అపార్టుమెంటు మాత్రమే కాదు. దాని చుట్టూ ఉన్న డజను అపార్టుమెంట్లలోనూ ఇదే పరిస్థితి.

రెండురోజుల క్రితం రాత్రి 12 గంటల సమయంలో డిజె సౌండ్లు, తప్పెట్లతో వచ్చిన గణేష్ నిమజ్జనం ఊరేగింపు హడావిడి అందరినీ నిద్రలేపింది. ఆ సౌండ్లకు ఫస్టు ఫ్లోర్‌లో ఉండే వారి ఫ్లాట్ల అద్దాలు దద్దరిల్లాయి. దానితో అపార్టుమెంట్లలో ఉండే పెద్దమనుషులు పోగై, నిర్వహకుల వద్దకు వచ్చి.. ‘ఇప్పుడు రాత్రి 12 అయింది. నిబంధనల ప్రకారం ఇప్పుడు ఈ సౌండ్లు పెట్టకూడదు. పైగా ముసలివాళ్లు, గుండె జబ్బులున్నవాళ్లున్నారు. త్వరగా వెళ్లిపోండ’ని కోరారు.

కానీ ఆ కుర్రాళ్లు ‘మాకు లోకేష్ పర్మిషన్ ఇచ్చారు. కావాలంటే పేపర్లు చూసుకోండి. మధ్యలో మీరేంటి’? అంటూ అగ్గిరాముళ్లయ్యారు. చేతిలో ఉన్న ఫోన్లు తీసి, కావాలంటే ఇదిగో చూడండి అని లోకేష్ ట్వీట్‌ను చూపించారు. ఇంతలో ఫిర్యాదు అందుకున్న పోలీసు అధికారి వచ్చి, కుర్రాళ్లకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా, ‘మాకు లోకేష్ పర్మిషన్ ఇచ్చారు. హోంమంత్రి కూడా అడ్డుచెప్పవద్దన్నారు కదా’? అని లా పాయింట్లు మాట్లాడారు. సరే చివరకు గంట తర్వాత ఆ ఊరేగింపు మొండిఘటంలా ముందుకు కదిలింది. అక్కడ కూడా ఇలాంటి వాగ్వాదాలే.

ఫలితంగా పండు ముసలి వారి నుంచి పసివాళ్ల వరకూ అందరి నిద్ర ఎగిరిపోయింది. ఇంతకూ వారంతా అప్పడు తిట్లు, శాపనార్ధాలు పెట్టింది ఎవరినో తెలుసా? పోలీసులను కాదు.. ఆ కుర్రాళ్లను కాదు.. వాటికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వాన్ని! మరి వాళ్లంతా పెన్షనర్లు, ఉద్యోగస్తులు, విద్యావంతులు!! ఒక్క డిజెకి అనుమతి ప్రభావం అంత తీవ్రంగా ఉందన్నమాట. క్షేత్రస్థాయిలో ఫలితాలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. ఇది ఒక గుంటూరుకే పరిమితమైన సమస్య, విమర్శ కాదు. మర్యాదస్తులున్న ప్రతి కాలనీల్లోనూ కనిపిస్తున్న అరాచక దృశ్యాలే.

అందుకే ప్రజలతో ముడిపడిన అంశాల్లో నిర్ణయాలు తీసుకునేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. చట్టాలు-నిబంధనలు పరిశీలించాలి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. ఏదో కుర్రవాళ్లను మెప్పించాలనో, కొత్తగా హిందువుల పెదవులపై చిరునవ్వుల కోసమో తీసుకునే ఇలాంటి నిర్ణయాలు, ఎప్పుడూ జనక్షేత్రంలో బూమెరాంగవుతాయి. తాజా డిజెలకు అనుమతి అంశం కూడా అలాంటిదే. సూటిగా చెప్పాలంటే ఇది స్వయంకృతమే.


గణపతి నవరాత్రుల సందర్భంగా మండపాలు పెట్టే కుర్రాళ్లు, తమకు పోలీసులు డిజెలకు అనుమతి ఇవ్వడం లేదంటూ గొడవ చేశారు. సోషల్‌మీడియాలో రీళ్లు, పోస్టులు పెట్టారు. దానితో స్పందించిన విద్యాశాఖ మంత్రి లోకేష్.. ఏ ఒక్క డిజె వాహహనాన్ని సీజ్ చేయవద్దని హోంమంత్రి అనిత, డిజిపి హరీష్‌కుమార్ గుప్తాను ఆదేశిస్తూ ట్వీట్ చేశారు. దానికి స్పందించిన హోంమంత్రి అనిత.. మంత్రి లోకేష్ ఆదేశాలు పాటిస్తామని, డిజె సౌండ్లకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశిస్తూ ఆమె కూడా ట్వీట్ చేశారు.

నిజానికి లోకేష్, అనితలు ఆదేశించేముందు వరకూ.. పోలీసులు డిజెలకు అనుమతి ఇవ్వలేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు సిఫార్సు చేసినా ‘ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిబంధనలు ఒప్పుకోవు. స్థానికుల నుంచి వచ్చే ఫిర్యాదులను మేం తట్టుకోలేమ’ని సున్నితంగా తిరస్కరించారు. ఈ క్రమంలో మంత్రి లోకేష్, అనిత ఆదేశాలతో డిజెలకు అనుమతి ఇవ్వడ ం పోలీసులకు అనివార్యమయింది. ఈ విషయంలో పోలీసులను తప్పుపట్టలేం. స్వయంగా ఇద్దరు మంత్రులే డిజెలకు అనుమతి ఇవ్వాలని ఆదేశిస్తే, అడ్డుకునేందుకు పోలీసులెవరు?


ఆ తర్వాత రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో డి జె సౌండ్లకు గుండె ఆగి చనిపోయిన ఫొటోలు, వీడియోలు మీడియా-సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టడం ప్రారంభమయింది. ఫలితంగా మంత్రి లోకేష్ నిర్ణయాన్ని తప్పుపడుతూ, నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. దీనిని వైసీపీ సోషల్‌మీడియా సహజంగానే విస్తృతంగా వైరల్ చేస్తోంది. డిజె, శబ్దకాలుష్యంపై సుప్రీంకోర్టు ఆదేశాలు తెలియవా? మీకు అధికారులు చెప్పరా? డిజె సౌండ్లకు గుండెలాగి చనిపోయిన వారి మరణాలకు బాధ్యత ఎవరు వహిస్తారు? అంటూ శరపరంపరంగా ప్రశ్నాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఇది కూటమి ప్రతిష్ఠకు మంచిదికాదు.


ఇదే అంశానికి సంబంధించి ఇద్దరు ప్రముఖులు చేసిన ట్వీట్ చర్చనీయాంశమయింది. మాజీ ఐఏఎస్ అధికారి, పర్యావరణవేత్త పీవీఎస్‌శర్మ..‘మీరింకా సీఎం కాలేదు’ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. అంటే సీఎం చంద్రబాబునాయుడు ఇవ్వాల్సిన ఆదేశాలు మంత్రి లోకేష్ ఇస్తున్నారన్నది ఆ ట్వీట్ లోని ఎత్తిపొడుపు అన్నమాట!
మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు అయితే..‘ఇద్దరిలో ఎవరూ 2000 సంవత్సరంలో పెట్టిన నాయిస్ పొల్యూషన్ కంట్రోల్ రూల్స్ పేరు కూడా విన్నట్లు లేదు. హిందూ ధర్మ సంప్రదాయాలను పోలీసులు డిసైడ్ చేస్తారన్నమాట. కొత్త.. కి నామాలు ఎక్కవంటారు’ అంటూ.. టీడీపీ బీజేపీని మెప్పించే పనులు చేస్తోందంటూ పరోక్షంగా చుర లు అంటించారు. కొత్తగా మతం మారిన వాడు ఒళ్లంతా నామాలు పెట్టుకున్నాడన్న సామెత ఏబీ ఇక్కడ వాడటం విశేషం.

నిజానికి ఈ అంశంతో ఎలాంటి సంబంధం లేని విద్యాశాఖ మంత్రి లోకేష్ జోక్యం చేసుకోవడమే, ఇంత వివాదానికి కారణమయింది. అదే హోంమంత్రి అలాంటి ఆదేశాలు ఇచ్చి ఉంటే, ఆమెను పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదన్నది మనం మనుషులం అన్నంత నిజం. పైగా విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్.. తన సహ చర హోంమంత్రికి ఎలా ఆదేశాలిస్తారని విమర్శలకు ప్రశ్నించే అవకాశం ఇచ్చినట్లయింది.

అయితే కుర్రాళ్లను ఆకట్టుకోవడంతోపాటు, బీజేపీకి మరింత చేరువయేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ.. తటస్తులు, వృద్ధులు, పెన్షనర్లు, మేధావులు, విద్యావంతులు మాత్రం ప్రశాంతతను చెడగొట్టే ఇలాంటి నిర్ణయాలను మెచ్చరన్నది అంచనా వేయకపోవమే తప్పు. ఇకనయినా ఇలాంటి నిర్ణయాలు ప్రకటించేముందు ఆచితూచి వ్యవహరించి, ఎవరి శాఖ మంత్రులు వారే నిర్ణయాలను ప్రకటించేలా చూస్తే మంచిదన్నది కూటమి హితైషుల ఉవాచ.


నిజానికి ఇలాంటి కీలక, సున్నిత నిర్ణయం తీసుకునే ముందు లోకేష్‌కు సోషల్‌మీడియా బృందం, సలహాలిచ్చే కన్సల్టెంట్ల బృందం.. 2000 నాటి నాయిస్ పొల్యూషన్ కంట్రోల్ రూల్స్‌ను లోకేష్ దృష్టికి తీసుకువెళితే.. ఆయన అనవసరంగా ఇన్ని విమర్శలకు గురయ్యేవారు కాదు. ఇప్పుడు పొలిట్‌బ్యూరో, సీనియర్లు కాకుండా చంద్రబాబు, లోకేష్‌ను ఈ బృందాలే నడిపిస్తున్నాయన్న మాట బహిరంగంగానే వినిపిస్తున్న నేపథ్యంలో.. ఆ బృందాలకు వారిద్దరినీ ఇలాంటి విమర్శల నుంచి కాపాడాల్సిన బాధ్యత ఉంది కదా? పోనీ అంత బుర్ర లేకపోతే కనీసం గూగుల్ తల్లిని అడిగినా డిజె అన ర్ధాల గురించి చెప్పేస్తుంది కదా? ఆ తెలివికూడా లేనివారు అధినేతలను విమర్శల నుంచి ఏం కాపాడతారన్నది నాయకుల ప్రశ్న.
మరి ఇలాంటి ప్రమాదకర, సున్నిత అంశాలను ముందే పసిగట్టి, వెల్లువెత్తే విమర్శల నుంచి అధినేతలను కాపాడలేకపోతే, ఇక ఈ బృందాలు ఉండి ఏం ప్రయోజన ం? డబ్బు ఖర్చు తప్ప అన్నది పార్టీ నాయకుల ప్రశ్న.

ప్రధానంగా నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు వంటి జాతీయ నాయకుడిని సైతం ఆయన ఎక్కడ కూర్చోవాలి? ఎవరితో మాట్లాడాలి? ఎంతమందితో మాట్లాడాలి అని నిర్దేశిస్తున్న ఈ సలహా, కన్సల్టెంట్ల బృందానికి.. డిజెలకు పర్మిషన్ ఇస్తే మిగిలిన వర్గాలు ప్రభుత్వానికి ఏ స్థాయిలో వ్యతిరేకమవుతాయి? అసలు నిబధనలు ఏమంటున్నాయన్న వివరాలను, లోకేష్‌కు ఇవ్వలేదంటే.. వారే ఆయనను తప్పుదోవపట్టిస్తున్నారన్న విషయం స్పష్టమవుతుందన్నది పార్టీ సీనియర్ల ఉవాచ.

దీన్నిబట్టి మరో ప్రశ్నలాంటి సందేహం తెరపైకి వస్తోంది. అసలు పార్టీలో సీనియర్లు మునుపటి మాదిరిగా సలహాలు ఇవ్వడం మానేశారా? లేక పార్టీనే వారి సలహాలు తీసుకోవడం మానేసి.. రాజకీయ అవగాహన, అనుభవం లేని 35-45 ఏళ్ల కుర్రాళ్లపై ఆధారపడుతోందా అన్న ప్రశ్నలు ఉదయించే పరిస్థితి.


అసలు లోకేష్ డిజెలకు అనుమతి ఇస్తే తప్పేంటి? దాన్నెందుకు తప్పు పడుతున్నారు? డిజె చిన్న అంశమే కదా.. దాన్నెందుకు అంత రచ్చ చేస్తున్నారు? దానివల్ల వచ్చే అనర్ధాలేమిటో చూద్దాం. ఎక్కువ పవర్ ఉన్న డిజె బాక్సుల ద్వారా 90 -100 డెసిబుల్స్ శబ్దం వస్తుంది. అయితే అవి 75 డెసిబుల్స్ కంటే తక్కువ ఉండాలి. రాత్రిళ్లు నిశ్శబ్దంగా ఉండే ప్రాంతాల్లో 45 నుంచి 55 డెసిబుల్స్ వరకూ అంగీకరయోగ్యం. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్య ఎలాంటి డిజెలను అనుమతించకూడదు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి 5 లక్షల రూపాయల జరిమానా, జైలు శిక్ష కూడా విధించవచ్చు.
ఇప్పటికే వినాయకచవితిలో డిజెలను మహారాష్ట్ర, యుపి, హర్యానా, కేరళం, కర్నాటకలో నిషేధించారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ.. హిందుత్వం పరిఢవిల్లే నాగ్‌పూర్, లాతూర్, పుణేల్లోనే డిజెలను నిషేధించడమే ఆశ్చర్యం.


 ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. 85 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దాన్ని ఎక్కువ సేపు వినడం వినికిడి శక్తికి అత్యంత ప్రమాదకరం. ప్రస్తుతం వినాయకచవితి సహా వివిధ పండగలు, పెళ్ళిళ్ల ఊరేగింపు, రాజకీయ ర్యాలీలు, బోనాల పండగల్లో  డిజెలు వెలువరించే శబ్దాలు.. 110 నుంచి 130 డెసిబెల్స్ వరకూ  వెలువరిస్తున్నాయన్నది ఒక అంచనా. ఇది విమానం టేకాఫ్ అయ్యే ముందు వెలువడే శబ్దస్థాయికి సమానం.

వీటివల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, గుండెజబ్బులతో బాధపడే వారు, గర్భిణిలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు.
అత్యధిక శబ్దాలు మనిషి శరీరంలో ప్రకంపనలు సృష్టించి.. రక్తపోటులో ఆకస్మిక పెరుగుదల, అసాధారణ హృదయస్పందన, తలనొప్పి, వాంతులు, స్పృహతప్పిపోవడం వంటివి జరుగుతాయి. అత్యధిక శబ్దాల ఒత్తిడి కారణంగా మెదడులోని రక్తనాళాలు దెబ్బతిని.. రక్తం గడ్డకట్టినట్లు అనేక కేసుల్లో చేసిన ఈఈజీ, స్కానింగ్‌లో తేలింది.


అధిక శబ్దాలు కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తాయి. ఇవి నరాల వ్యవస్థను క్రియాశీలం చేస్తాయి. దానివల్ల హృదయ స్పందన, బీపీ పెరుగుతాయి.
అసలు హిందుత్వ వాసనలు అదికంగా ఉండే నాగపూర్, పూణే లాంటి బీజేపీ ప్రభావిత నగరాల్లోనే వినాయకచవితికి డిజెలను అక్కడి ప్రభుత్వాలు నిషేధిస్తే.. పెద్దగా హడావిడి లేని ఏపీ రాష్ట్రంలో డిజెలను అనుమతించడం వల్ల వచ్చే లాభమేమిటి అన్నది ప్రశ్న. తెలంగాణ, మహారాష్ట్ర వంటి మతపరమైన భావన లేని ఏపీలో డిజెలు నిషేధించి, పౌర సమాజానికి శాంతి చేకూరిస్తే పౌరసమాజం మెచ్చి తీరుతుంది.


ఎవరు అవునన్నా, కాదన్నా.. ఎవరు అంగీకరించినా-అంగీకరించకపోయినా యువనేత లోకేష్ భావి తెలుగుదేశం అధినేత. అదృష్టం-అవకాశం ఉంటే ఈ రాష్ట్రానికి అతిపిన్న సీఎం కూడా కావచ్చు. ఆయన సారధ్యం వహించనున్న టీడీపీ అనేది జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యం ఉన్న ఒక రాజకీయ పార్టీ.

కాబట్టి అలాంటి భావి నేత రాజకీయ భవిష్యత్తు అడుగులు, జాగ్రత్తగా ఉండాలన్నదే అందరి ఆకాంక్ష. ఇప్పటికే తనను తాను మలుచుకున్న లోకేష్, ఇలాంటి ప్రజోపయోగ అంశాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆ మేరకు ఆయన సలహాబృందం కూడా ఆయనను తీర్చిదిద్దాలి. దానికి చాలా అనుభవంతోపాటు వయసు కూడా అవసరం.
విమర్శ వేరు. సద్విమర్శ వేరు. పొగడ్తలు వేరు. కావాలని చేసేవి విమర్శలు. దారితప్పేవారిని హెచ్చరించి సరైన మార్గంలో పెట్టే లక్ష్యంతో చేసేవి సద్విమర్శలు. వీరికి ఎలాంటి ప్రతిఫలాపేక్ష ఉండదు. ఈ తరహా విమర్శకులు కోటరీ చాయలకు రారు. ఇక పొగడ్తలు బహు ప్రమాదం. ఇవే రాజకీయ నాయకుల భవిష్యత్తుకు అవరోధం. ఈ బాపతు భజనపరులు నిజాన్ని కప్పేసి, రాజులను దేవతావస్త్రాల్లో విహరింపచేస్తుంటారు. సదుద్దేశంతో చేసే సద్వివిమర్శకులను, శత్రువులు-విరోధులుగా చూస్తే నష్టపోయేది నాయకులే.


డిజెల విషయంలో యువతను కట్టడి చేసి, వారిలో ఆలోచనలు రేకెత్తించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును అభినందించి తీరాలి. తన ఉండి నియోజకవర్గంలో వినాయకచవితికి డిజెలకు అనుమతివ్వాలంటూ, యువకుల బృందాలు రఘురామకృష్ణరాజును అభ్యర్ధించాయి. అయితే డిజెల వల్ల కలిగే ప్రమాదాలను అరటిపండు ఒలిచినట్లు వివరించడంతో, యువకులు కూడా సమాధానపడి డిజెల ఆలోచన విరమించుకున్నారు. దీన్నిబట్టి యువతకు శాస్త్రీయ కోణంలో సరైన అవగాహన కల్పిస్తే, వారు తమ ఆలోచనా ధోరణి మార్చుకుంటారన్న దానికి రఘురామకృష్ణరాజు ఇచ్చిన క్లాసు ఒక కేస్‌స్టడీ.
కాబట్టి ప్రజాప్రతినిధులు డిజెల అనుమతిని రాజకీయ కోణంలో అనవసర ప్రతిష్ఠకు పోకుండా, దానివల్ల పౌరసమాజానికి వాటిల్లే నష్టాన్ని వివరించి యువకుల్లో మార్పు తీసుకువస్తే, పౌరసమాజం శబ్దరహితంగా వర్ధిల్లుతుంది.

Total Visitors: 2,764,056