దుండు మన్మోహన్ కు సీనియర్ అడ్వకేట్ హోదా

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలోని హైకోర్టులలో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ దుండు మన్మోహన్ కు “డెజిగ్నేటెడ్ సీనియర్” హోదా ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 1981 లో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు హైదరాబాద్ లో అడ్వకేట్ గా ప్రాక్టీస్ ప్రారంభించిన మన్మోహన్ 1993లో ఇన్కమ్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ కు జ్యూడిషియల్ మెంబర్ గా ఎంపికైనారు. కలకత్తా జోన్ లో జాయిన్ అయ్యిన వీరు బాంబే, హైదరాబాద్, విశాఖ లలో పనిచేశారు. 2008లో ఇన్కమ్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ వైస్ ప్రెసిడెంట్ గా నియమించబడి చండీగర్, లక్నో, ముంబాయి, హైదరాబాద్ లతో పాటు 2018 వరకు దేశంలోని అన్ని జోన్లలో పనిచేసిన అరుదైన అవకాశం పొందారు.
వృత్తి పరంగా నిజాయితీ, ముక్కు సూటితత్వం ఉన్న వ్యక్తిగా పేరుగాంచారు. తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్ లో, విశాఖపట్నంలో ఇన్కమ్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ కార్యాలయాల నిర్మాణంలో మన్మోహన్ క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇన్కమ్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ వైస్ చైర్మన్ గా మన్మోహన్ రిటైర్మెంట్ తర్వాత హైదరాబాద్ లోని తెలంగాణ హైకోర్టు మరియు అమరావతి లోని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులలో తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించారు.
పలు విభాగాల కేసులతోపాటు ప్రత్యేకంగా ఇన్కమ్ టాక్స్ కేసులలో నిష్ణాతులైన మన్మోహన్ విశాఖపట్నంకు చెందిన రైల్వే సీనియర్ మాజీ ఉద్యోగి దుండు జగన్నాధరావు మరియు శ్రీమతి రత్నం దంపతుల కుమారుడు. బిఎల్ మరియు ఎం.కామ్. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ లో పూర్తి చేశారు.బాంబే యూనివర్సిటీలో ఎల్.ఎల్.ఎం. చేసిన వీరు, యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకర్ గా నిలిచారు. తెలుగు రాష్ట్రాలలో రెండు లక్షల పైగా న్యాయవాదులు ఉంటే 150 మంది వరకు సీనియర్ హోదాను హైకోర్టు కల్పించింది.
మన్మోహన్ తో పాటు మంత్రి రామారావు, ఏకే జయ ప్రకాష్ రావు, ఎం రాజేందర్ రెడ్డి, ఏర బాటి రామారావు, కల్పన, ఏ ప్రభాకర్ రావు, వై రత్నాకర్, కే రాఘవాచార్యులు, జీవి ప్రసాద్, ఈ ఉమామహేశ్వరరావు, శ్రీనివాస్ వెలగపూడి, డాక్టర్ జుట్టు కొండ విజయలక్ష్మి, చెట్లూరు శ్రీనివాస్, వీవీఎస్ఎన్ రాజు, టీఎస్ రాజశేఖర్, రమేష్ బాబు విశ్వనాధుల, థామస్ జార్జ్, చిక్కుడు ప్రభాకర్, పి విష్ణువర్ధన్ రెడ్డి, వివేక్ జైన్ లు “సీనియర్” అడ్వకేట్ హోదా పొందిన వారిలో ఉన్నారు. సెప్టెంబర్ 16న తెలంగాణ ఫుల్ కోర్ట్ సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి,, న్యాయమూర్తులు వీరికి ఈ హోదా ఇవ్వాలని నిర్ణయించారు. ఆ రోజు నుంచి వీరి హోదా అమల్లోకి వచ్చింది.
