బొగ్గు ఉన్నా చీకట్లేనా?

- సింగరేణిని నిలువునా ముంచుతున్న కాంగ్రెస్ సర్కార్!
- 70 మిలియన్ టన్నుల నుండి 58కి పడిపోయిన ఉత్పత్తి
-తెలంగాణ ప్లాంట్లకు నాసిరకం బొగ్గు.. పక్క రాష్ట్రాలకు మేలైన బొగ్గా? - ఇంటి ప్లాంట్లకు ‘మట్టి బొగ్గు’.. పొరుగు రాష్ట్రాలకు ‘మేలైన గ్రేడ్’
- రూ. 1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు ఏమైంది?
- ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ ప్రశ్నల వర్షం
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుమ్మక్కు పాలనపై సింగరేణి సీఎండీకి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సూటి ప్రశ్నలు!
హైదరాబాద్: దక్షిణ భారతదేశంలోనే ఏకైక బొగ్గు గని క్షేత్రం ఉండి, దేశంలోనే రెండవ అతిపెద్ద బొగ్గు కంపెనీ సింగరేణి (SCCL)లో 51 శాతం వాటా ఉన్న తెలంగాణను నేడు విద్యుత్ సంక్షోభం, చీకట్లలోకి నెట్టివేయడం ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం, తీవ్ర పరిపాలనా వైఫల్యమేనని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిప్పులు చెరిగారు.
నాణ్యమైన బొగ్గు సరఫరా చేయకపోవడంతో TGGENCO థర్మల్ యూనిట్లు మూతపడటం, సింగరేణి ఉత్పత్తి గణనీయంగా పడిపోవడం, రూ. 1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు లెక్కల్లో లేకుండా మాయం, దాదాపు 52 వేల కోట్ల రూపాయల బకాయిలు కావడంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం సింగరేణి భవన్‌లో సంస్థ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతికి సమగ్ర వినతిపత్రం సమర్పించారు.
TGGENCO థర్మల్ యూనిట్లు మూతపడుతున్నాయి లేదా వాటి స్థాపిత సామర్థ్యం కంటే చాలా తక్కువగా నడుస్తున్నాయి. నాణ్యమైన బొగ్గు కొరత, సాంకేతిక సమస్యల కారణంగా TGGENCOలో దాదాపు 1,870 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని, పవర్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో యూనిట్‌కు రూ. 10 వెచ్చించినప్పటికీ డిస్కంలు తగినంత విద్యుత్‌ను కొనుగోలు చేయలేకపోతున్నాయని 16.09.2026 నాటి మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ తన సామర్థ్యంలో అతి స్వల్ప భాగాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తోందని, భద్రాద్రిలోని ఒక యూనిట్ పూర్తిగా మూతపడిందని, వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను రోజుకు దాదాపు ఆరు గంటలకు కుదించారని, పరిశ్రమలు జనరేటర్లపై ఆధారపడి నడుస్తున్నాయని నివేదికలు తెలుపుతున్నాయి.
భూపాలపల్లి KTPPలోని 500 మెగావాట్ల యూనిట్ మరియు YTPSలోని 800 మెగావాట్ల యూనిట్ జూన్ 2026 చివరి నాటికి మూతపడ్డాయి; కేవలం బొగ్గు కొరత కారణంగానే రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు నిలిచిపోవడం చరిత్రలోనే మొదటిసారి అని ఆవేదన వ్యక్తం చేశారు.
“సింగరేణిలో బొగ్గు నిల్వలకు కొదవే లేదు.. కానీ కాంగ్రెస్ పాలకుల అసమర్థత, దొంగ దందాల వల్ల ఉత్పత్తి పాతాళానికి పడిపోయింది! సొంత రాష్ట్ర విద్యుత్ ప్లాంట్లను బొగ్గు లేక బంద్ పెట్టిస్తూ, పక్క రాష్ట్రాలకు మేలైన బొగ్గును ధారాదత్తం చేస్తున్నారు! ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రజల గొంతు కోయడమే!”
రికార్డు ఉత్పత్తి నుండి అగాధంలోకి: 70 మిలియన్ పై టన్నుల నుండి 58కి ఎలా పడిపోయింది?
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023-24 నాటికి సింగరేణి 70.02 మిలియన్ టన్నుల చారిత్రాత్మక రికార్డు ఉత్పత్తిని సాధిస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అది ఏకంగా 58 మిలియన్ టన్నులకు కుప్పకూలిందని నేతలు ధ్వజమెత్తారు. 2025-26లో 72 మిలియన్ టన్నుల టార్గెట్ పెడితే, సాధించింది కేవలం 58 మిలియన్ టన్నులు మాత్రమే, అంటే 81 శాతం మాత్రమే.
కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 12-14 మిలియన్ టన్నుల ఉత్పత్తిని (17% పైగా) సంస్థ కోల్పోయింది. రోజుకు 1.97 లక్షల టన్నుల బొగ్గు అవసరం ఉండగా, కేవలం 1.59 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేసి కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, రామగుండం, భూపాలపల్లి సహా అన్ని ఏరియాల్లో ఉత్పత్తిని అటకెక్కించారు. సంవత్సరానికి 140 లక్షల టన్నుల ఉత్పత్తి తగ్గిపోయింది, దాంతోపాటు 1600 కోట్ల రూపాయల విలువ చేసే 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది.
డిమాండ్ లేదని యాజమాన్యం చెప్పడం పచ్చి అబద్ధమని, సొంత రాష్ట్రంలో ప్లాంట్లు బొగ్గు లేక ఆగిపోతుంటే డిమాండ్ లేదనడం ఎవరిని మోసం చేయడానికని నిలదీశారు.
తెలంగాణ పవర్ ప్లాంట్లకు నాణ్యమైన బొగ్గు ఇవ్వకుండా రేవంత్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.TGGENCO కేంద్రాలకు ఒప్పందం (FSA) ప్రకారం 4,375 kcal/kg నాణ్యత గల G9-G11 గ్రేడ్ బొగ్గు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 2,800-3,400 kcal/kg ఉండే అత్యంత నాసిరకం G14, G15 గ్రేడ్ ‘మట్టి బొగ్గు’ను సరఫరా చేస్తున్నారు.
యూనిట్లు మూతపడేలా కుట్ర: ఈ నాసిరకం బొగ్గు వల్ల బాయిలర్లు దెబ్బతిని, దాదాపు 1,870 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. యాదాద్రి ప్లాంట్ సామర్థ్యంలో స్వల్ప భాగమే నడుస్తుండగా, భూపాలపల్లి KTPP, భద్రాద్రి యూనిట్లు మూతపడ్డాయి.
పక్క రాష్ట్రాలకు పండుగ: ఆగస్టు 2026లో TGGENCOకు రావాల్సిన కోటాలో 3.90 లక్షల టన్నులు (16 శాతం) కోత పెట్టి, అదే నెలలో ఏకంగా 4.25 లక్షల టన్నుల మేలైన బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలించారు. మన బొగ్గును బయటకు అమ్ముకుంటూ, ఛత్తీస్‌గఢ్ (SECL) నుండి అత్యవసరంగా బొగ్గును దిగుమతి చేసుకునే సిగ్గుచేటు స్థితికి రాష్ట్రాన్ని తెచ్చారు.
ప్రజాధనం లూటీ: నాసిరకం బొగ్గు వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ. 2,900 కోట్ల నష్టం వాటిల్లగా, డిస్కంలు బయట మార్కెట్లో యూనిట్‌కు రూ. 10 వెచ్చించి కొనుగోలు చేయలేక చేతులెత్తేయడంతో రైతులకు ఇచ్చే కరెంట్‌ను 6 గంటలకు కుదించారు.రూ. 1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు ఏమైంది? సింగరేణిలో జరిగిన భారీ కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ నేతలు నిప్పులు చెరిగారు.
మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం, భూపాలపల్లి, ఇల్లందు, సత్తుపల్లి డిపోల రికార్డుల్లో ఉన్న రూ. 1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు భౌతిక తనిఖీల్లో మాయమైందని స్వయంగా కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ముఖ్యమంత్రికి లేఖ రాశారు.జూలై 3న విజిలెన్స్ విచారణకు ఆదేశించామని చెప్పిన ఉప ముఖ్యమంత్రి, 11 వారాలు దాటినా ఆ నివేదికను ఎందుకు తొక్కిపెట్టారు? అంత నిఘా వ్యవస్థలుంటే ఆ బొగ్గు ఎవరి జేబుల్లోకి పోయింది? రికార్డుల్లో ఉన్న బొగ్గు లేకపోతే TGGENCO ప్లాంట్లకు బొగ్గు ఎందుకు కొరత వచ్చింది?
49% వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిమ్మకుండిపోయింది?
సింగరేణిలో 49 శాతం వాటా ఉండి, బోర్డులో నామినీ డైరెక్టర్లు ఉన్న కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసి చేతులు దులుపుకోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇంత పెద్ద కుంభకోణం, ఉత్పత్తి పతనం జరుగుతున్నా కేంద్రం మౌనం వహించడం చూస్తుంటే కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై దోపిడీదారులను కాపాడుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయని మండిపడ్డారు.
ఈ సంక్షోభంపై మేము అడిగిన రికార్డులు, వివరణలను 7 రోజుల్లోగా లిఖితపూర్వకంగా అందించాలి. లేనిపక్షంలో ఈ దోపిడీని అసెంబ్లీ వేదికగా ఎండగట్టడంతో పాటు, కేంద్ర బొగ్గు శాఖ, సీఏజీ మరియు న్యాయస్థానాల ముందుకు తీసుకెళ్లి ప్రజల పక్షాన పోరాడుతాం అని దాసోజు శ్రవణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
