September 24, 2026

చేతగాని దద్దమ్మ ప్రభుత్వంలో వ్యవసాయ రంగంలో సంక్షోభం

  • థర్మల్ పవర్ స్టేషన్లు సింగరేణి సంస్థకు సుమారు 55వేల కోట్ల రూపాయలు బకాయి
  • నాణ్యమైన బొగ్గును ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర లకు సరఫరా చేస్తున్నారు
  • మాజీ మంత్రి వనమా,మాజీ ఎమ్మెల్యే మెచ్చా, బీఆర్ఎస్ నాయకులు దిండిగల, కాపు సీతామహాలక్ష్మీ తదితర ప్రముఖులతో కలిసి ఎంపీ వద్దిరాజు కేటీపీఎస్ సందర్శన

పాల్వంచ: చేతగాని దద్దమ్మ ప్రభుత్వంలో వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నదని,రైతాంగం నిర్వేదంతో, బాధల్లో ఉన్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఆవేదన వ్యక్తంచేశారు.
వ్యవసాయానికి సాగునీళ్లు, విత్తనాలు, కరెంట్,యూరియా సక్రమంగా సరఫరా చేయకుండా ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పాలకులపై ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, కార్యనిర్వహక అధ్యక్షులు కే.టీ.రామారావుల పిలుపు మేరకు ఎంపీ రవిచంద్ర ఆధ్వర్యాన గులాబీ శ్రేణులు గురువారం పాల్వంచలోని కేటీపీఎస్ సందర్శనకు వెళ్లారు.

థర్మల్ పవర్ స్టేషన్ లో బొగ్గు నిల్వలు, విద్యుదుత్పత్తికి సంబంధించి వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రి వెంకటేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు, పార్టీ శ్రేణులు, రైతులు వెడుతుండగా పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు బ్యారికేడ్లు అడ్డుపెట్టి నిలువరించారు. ఈ సందర్భంగా పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకోగా పలువురు స్వల్పంగా గాయపడ్డారు.

ఆ తర్వాత ఎంపీ వద్దిరాజు నేతృత్వంలో ప్రతినిధి బృందం కేటీపీఏస్ లోపలికి వెళ్లి బొగ్గు నిల్వల్ని, విద్యుదుత్పత్తిని పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర విలేకరులతో మాట్లాడుతూ, వ్యవసాయ రంగాన్ని కాంగ్రెస్ సర్కార్ నిర్వీర్యం చేస్తున్న తీరును దుయ్యబట్టారు. సాగునీళ్లు,కరెంట్ సక్రమంగా సరఫరా చేస్తే పంటలు పండుతాయని, వాటిని కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాల్సి వస్తుందని..వాటిని నెరవేర్చడం చేతగాకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగాన్ని, రైతన్నల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారన్నారు.

కేసీఆర్ సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాక బంగారుమయంగా తీర్చిదిద్దారని, తీవ్ర నష్టాలలో సింగరేణి సంస్థను లాభాల బాట పట్టించారని ఎంపీ రవిచంద్ర కొనియాడారు.థర్మల్ పవర్ స్టేషన్లు సింగరేణి సంస్థకు సుమారు 55వేల కోట్ల రూపాయలు బకాయి పడ్డాయని, నాణ్యమైన 9,10 జీ బొగ్గు సరఫరా లేక, మిషనరీ కూడా పాతబడిపోవడంతో విద్యుదుత్పత్తి నిలిచిపోయిందని అధికారులు చెప్పారన్నారు. నాణ్యమైన బొగ్గును ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర లకు సరఫరా చేస్తూ విద్యుత్ శాఖ చూస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇక్కడి కేటీపీఏస్,బీటీపీఏస్ లను ఏ మాత్రం కూడా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.

పవర్ స్టేషన్ లో సరిపడు బొగ్గు నిల్వలు లేవని, ఉన్నవి కూడా నాణ్యత లేని 13,14 జీ రకానివి అని, 9,10 జీ రకం ల్యాబ్ లో ఉన్నట్లు అధికారులు తనతో అనడం శోచనీయమని ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే కరెంట్ ఉండదని, తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిన దుస్థితి నెలకొంటుందని కొందరు నాయకులు అవహేళన చేశారన్నారు.కేసీఆర్ ముందుచూపు,పక్కా ప్రణాళికతో విద్యుదుత్పత్తి 7వేల నుంచి 20వేల మెగావాట్లకు పెంచి చూపి విమర్శకుల నోళ్లు మూయించారని ఎంపీ రవిచంద్ర వివరించారు.

అంతకుముందు ఎంపీ రవిచంద్ర తదితర ప్రముఖులు భారతరత్న డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్, దివంగత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రాం విగ్రహాలకు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు.కేటీఆర్ పిలుపు మేరకు వద్దిరాజు నేతృత్వంలో వనమా ఆధ్వర్యాన వందలాది మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు కేటీపీఏస్ వద్దకు తరలివచ్చి పంటలు ఎండిపోకుండా నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలిచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దిండిగల రాజేందర్,కాపు సీతామహాలక్ష్మీ, వేల్పుల దామోదర్,గోవాడ గుణచరిత్,బత్తుల మధుచంద్, సింధు తపస్వి, మల్లెల రవిచంద్ర, రాజు గౌడ్, లావుడ్య సత్యనారాయణ, చింతలపూడి జగన్, బండారు రుక్మేందర్, అనుదీప్, నవతన్,భూపతి శ్రీనివాసరావు,అన్వర్,సంగు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Total Visitors: 2,764,034