ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ‘రెడ్డి’కార్పెట్

- రెడ్లకే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల పట్టం
- మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా సామ రామ్మోహన్‌రెడ్డి
- నల్గొండ-ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి
- కాంగ్రెస్‌కు బడుగు బలహీనవర్గాలు అవసరం లేదా?
- బీసీ నేతలు నిద్రపోతున్నారా?
- రెండు సీట్లు రెడ్లకు ఇస్తుంటే బీసీ నేతలు అడ్డుకోరా?
- కాంగ్రెస్ బీసీ అగ్రనేతలపై బీసీ సంఘ నాయకుల ఆగ్రహం
- బీసీలకు ఎవరు సీటిస్తే వారికే ఓట్లు వేస్తామని స్పష్టీకరణ
(సుబ్బు)
హైదరాబాద్: ఒకప్పుడు ప్రతి ఎన్నికల్లో బడుగు బలహీన మైనారిటీ వర్గాలకు పట్టం కట్టిన కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తన విధానం మార్చుకుందా? బడుగుల దారి నుంచి బయటకు వచ్చి అగ్రకులాలకు జైకొడుతోందా? తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రకటించిన ఇద్దరు అభ్యర్ధుల కులం పరిశీలిస్తే ఈ అనుమానం నిజమేననిపించకమానదు. అంటే సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ‘కొత్త కాంగ్రెస్’, నిర్భయంగా ఆ సామాజికవర్గానికి ‘రెడ్డి’ కార్పెట్ వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
తాజాగామహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా సామ రామ్మోహన్‌రెడ్డి; నల్గొండ-ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని ప్రకటిస్తూ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ప్రకటించారు.
అయితే సంప్రదాయానికి భిన్నంగా.. రెండుచోట్లా రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికే టికెట్లు దక్కడం బట్టి, ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి హవా విజయవంతంగా కొనసాగుతున్నట్లు మరోసారి తేలిపోయింది.
నిజానికి నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి రెడ్డి కాకుండా.. ఎస్టీ లేదా, బీసీ వర్గానికి చెందిన వారికి ఇస్తారని చాలామంది భావించారు. ఎందుకంటే వరంగల్, ఖమ్మంలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ నుంచి ఆర్టీఐ కమిషనర్, మాజీ జర్నలిస్టు పివి శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపించిన విషయం తెలిసిందే. అయితే రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి పేరు హటాత్తుగా తెరపైకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇప్పటికే నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో రెడ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మళ్లీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా అదే కులానికి చెందిన వారికి ఇవ్వడంపై బీసీ, ఎస్టీ అభ్యర్ధుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ‘కాంగ్రెస్ పార్టీ కొత్త నాయకత్వానికి బడుగు బలహీన వర్గాలు ఇక అవసరం లేదన్న విషయాన్ని కాంగ్రెస్ నాయకత్వమే అభ్యర్ధుల ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. ఇక ఏం చేయాలో పార్టీలోని బీసీ నాయకులే నిర్ణయించుకోవాల’ని బీసీ సంఘ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
దీన్నిబట్టి భవిష్యత్తులో ఇక కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీనవర్గాలకు స్థానం ఉండదన్న విషయం స్పష్టమయిందన్న వ్యాఖ్యలు, బీసీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీసీలకు కాంగ్రెస్ స్థానం లభించదని దీనితో తేలిపోయిందంటున్నారు. బీసీలకు ఒక్కసీటు కూడా ఇప్పించుకోలేని బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల అసమర్థతపై బీసీ సంఘాల నేతలు విరుచుకుపడుతున్నారు.
పేరుకేనా బీసీ నేతలు?
రెండు కీలక నియోజకవర్గాల్లోనూ రెడ్లకే సీట్లు దక్కిన నేపథ్యంలో కాంగ్రెస్‌లో మహామహులుగా చెప్పుకునే బీసీ నేతలు ఏమయ్యారు? ఏం చేస్తున్నారని బీసీ సంఘాల నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పిసిసి చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపి అనిల్‌కుమార్ యాదవ్, విప్ ఆది శ్రీనివాస్, మాజీ ఎంపి మధుయాష్కీ గౌడ్, ప్రభుత్వ సలహాదారులయిన ె .కేశవరావు, వి.హన్మంతరావు, మాజీ మంత్రి దానం నాగేందర్, కొండా సురేఖ వంటి అగ్రనేతలకు బీసీకి సీటు ఇప్పించాలన్న ధ్యాస లేదా? రెండు చోట్లా రెడ్లకు సీటు ఇవ్వడాన్ని ఈ నాయకులు బీసీలకు జరిగిన అవమానంగా భావించడం లేదా? బీసీలకు జరిగిన అన్యాయం ఢిల్లీ దృష్టికి తీసుకువెళ్లే ధైర్యం ఈ నాయకులకు లేదా? వీరంతా సీఎం రేవంత్‌రెడ్డికి భయపడుతున్నారా? అని విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ బీసీలకు సీటు ఇవ్వనందున, ఏ పార్టీ బీసీలకు సీటు ఇస్తే వారినే బలపరుస్తామంటున్నారు.
