October 3, 2026

స్థానికత చిక్కుముడి – విద్యార్థిని భవిష్యత్తు బలి

(ఇంద్రాణి)

రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గాయం చేసింది అనేది వాస్తవం. అయితే తెలంగాణ వారిని కూడా ఇబ్బంది పెడుతుంది అని ఈ మధ్య ఒక విద్యార్థిని విషయంలో రుజువయింది. తెలంగాణ వాస్తవ్యురాలైన ఒక విద్యార్థిని ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు తెలంగాణలోనే చదువుకుంది. అంటే పాఠశాల విద్య మొత్తం తెలంగాణలోనే పూర్తి చేసింది.

ఆ అమ్మాయి లక్ష్యం వైద్య విద్యను అభ్యసించడమే. ఎంబీబీఎస్‌లో సీటు రావాలంటే నీట్ పరీక్ష తప్పనిసరి అయిన తర్వాత నీట్‌కు బెస్ట్ కోచింగ్ సెంటర్ల వెతుకులాట మొదలయింది. ఎవరో సీనియర్లు ‘పొరుగున ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో చదివి సీటు తెచ్చుకోగలిగాము’ అనే సలహా ఇచ్చారు. అందుకోసం ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ విజయవాడలో చదివింది. నీట్‌లో మంచి ర్యాంకు కూడా సాధించింది. తెలంగాణలో ఉన్న మంచి వైద్య విద్యా సంస్థల్లో సీటు కోసం దరఖాస్తు కూడా చేసింది. ఆ అమ్మాయి తాను తెలంగాణ వాసే కాక, తెలంగాణ విద్యార్థిని కాబట్టి తెలంగాణ స్థానిక కోటాలోనే సీటు వస్తుందని భావించింది.

కానీ ఈ మధ్య రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఎంఎస్ నంబర్ 33 ప్రకారం ఒక విద్యార్థి స్థానిక కోటాలో 85 శాతం మెడికల్ సీట్లకు పోటీ పడాలంటే, నీట్ పరీక్షకు ముందున్న చివరి నాలుగు సంవత్సరాలు—అంటే తొమ్మిదో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు—వరుసగా తెలంగాణలోనే చదివి ఉండాలి. కానీ ఆ విద్యార్థిని చివరి రెండు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్‌లో చదవడంతో, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఆమెను స్థానికేతర అభ్యర్థిగా ప్రకటించింది. హతాశురాలైన ఆ అమ్మాయి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

తాను తెలంగాణలోనే జన్మించి, పదో తరగతి వరకు ఇక్కడే చదివానని, కేవలం ఇంటర్మీడియట్ కోచింగ్ కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్ళానని, తనను తెలంగాణ స్థానిక విద్యార్థిగానే పరిగణించి ఎంబీబీఎస్ సీటుకు అవకాశం ఇవ్వాలని కోరింది. కానీ చట్టప్రకారం అటువంటి అవకాశం లేదని ఆ విద్యార్థిని అభ్యర్థనను తోసిపుచ్చి, ప్రభుత్వం పెట్టిన నిబంధన రాజ్యాంగబద్ధమైనదే అని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

చట్టం ప్రకారం ఆ అమ్మాయి తెలంగాణ స్థానిక కోటాలోకి రాదు. అదే సమయంలో ఆ అమ్మాయి ఆంధ్రప్రదేశ్‌లో కూడా స్థానిక కోటాలోకి రాదు. ఇది మరీ బాధాకరం. రెండు రాష్ట్రాలలోనూ అర్హతను కోరే పరీక్షకు ముందు వరుసగా నాలుగు సంవత్సరాల నిరంతర విద్యాభ్యాస నిబంధన ఆ అమ్మాయి బంగారు భవిష్యత్తును ఛిద్రం చేసింది. ఇప్పుడు ఆ విద్యార్థినికి ఉన్న ఏకైక అవకాశం అఖిల భారత కోటాలో దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల ఓపెన్ సీట్లకు పోటీ పడటమే; లేదా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో స్థానికేతరుల కోసం కేటాయించిన పదిహేను శాతం ఓపెన్ మెరిట్ సీట్లకు పోటీ పడవచ్చు.

రాష్ట్రం విడిపోక ముందు ఇటువంటి సమస్యలతోనే అనేక మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. కానీ రాష్ట్రం విడిపోయిన పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా అవే సమస్యలతో విద్యార్థులు నలిగిపోవడం మాత్రం అన్యాయం. ఇందులో ప్రభుత్వాలను తప్పు పట్టలేం. చట్టం పట్ల అవగాహన లేనందుకు విద్యార్థులను తప్పు పట్టడం కష్టం. కానీ చట్టం గురించి అవగాహన లేదు అనేది న్యాయసమ్మతం కాదు. ఇక కోచింగ్ సెంటర్లు వారి వ్యాపారం వారు చూసుకుంటారు కానీ ఎదుటివారి ప్రయోజనాల కోసం తమ వ్యాపారాన్ని తగ్గించుకోరు.

ఇక్కడ ఒక విచిత్రమైన విషయాన్ని గమనించాలి. ఒక వ్యక్తి లోక్‌సభకు పోటీ చేయాలంటే దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఓటర్ అయి ఉంటే చాలు. శాసనసభకు పోటీ చేయాలంటే రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర ఓటర్ అయి ఉంటే చాలు. కానీ ఒక విద్యార్థి దగ్గరకు వచ్చేటప్పటికి స్థానికతకు సంబంధించి కచ్చితమైన నిబంధనలు ఉన్నాయి. దేశంలో ఎవరు ఎక్కడైనా నివసించవచ్చు. ఎవరు ఎక్కడైనా ఆస్తులు కొనుగోలు చేయవచ్చు. ఆఖరికి కశ్మీర్‌లో కూడా ఆ సౌలభ్యం లభించింది. కానీ ఒక రిక్షా కార్మికుడు బతుకుతెరువు కోసం వేరే రాష్ట్రానికి వెళితే, అతగాడి పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించాలంటే కష్టం. వారికి ఎక్కడా స్థానికత లభించే అవకాశమే లేదు. చట్టాలు చేసేవారికి వర్తించని నియమ నిబంధనలు సామాన్య ప్రజలకు వర్తిస్తాయి.

ఒక వ్యక్తి ఉపాధ్యాయుడు కావాలంటే నిర్దిష్ట విద్యార్హతలు కచ్చితంగా ఉండాలి. కానీ ఆ విద్యార్హతలను నిర్ధారించి చట్టాలు చేసే మంత్రులకు ఏ అర్హతా అవసరం లేదు; చట్టసభలో ఉంటే చాలు. పోనీ చేసిన చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత కూడా తీసుకోరు. ఆ విద్యార్థిని మెరిట్ చూస్తే ఆ అమ్మాయి తెలంగాణలో ఒక మంచి విద్యా సంస్థలో వైద్య విద్యను అభ్యసించవచ్చు. కానీ చట్టం పట్ల అవగాహన లేకపోవడమే ఆ అమ్మాయికి అనర్హతను తెచ్చిపెట్టింది.

యాభై సంవత్సరాలు కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విద్యను అభ్యసించేవారికి ఇంత అంతరం ఉండటం ఎంతవరకు న్యాయమో అర్థం కాదు. రెండు సంవత్సరాల క్రితం వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్. అంటే మొన్నమొన్నటి వరకు కొన్ని ఉమ్మడి అంశాలు ఉన్నాయి. తెలంగాణను తీసుకొచ్చి ఆంధ్రాకు ముడిపెట్టడంలో తెలంగాణ ప్రజల పాత్ర లేదు. యాభై ఎనిమిది సంవత్సరాలు ‘తమ రాజధాని’ అంటూ మురిసిపోయి, తల తాకట్టు పెట్టి హైదరాబాద్‌లో ఇళ్లు కొనుక్కున్న వారి పిల్లలు ఏ రాష్ట్రంలో స్థానికులు అవుతారో ఆంధ్రప్రదేశ్ వారికి అంతుపట్టదు. కానీ తెలంగాణ శాసనసభలోకి అడుగుపెట్టడానికి ఇంత కఠినమైన నిబంధనలు లేవు. పెట్టుబడిదారులకు ఈ స్థానికత వర్తించదు; కానీ ఒక విద్యార్థిని విషయంలో మాత్రం కచ్చితమైన నిబంధనలు వర్తిస్తాయి. అమరరాజా బ్యాటరీస్ వారికి స్థానికత వర్తించదు.

అశాస్త్రీయ విధానంలో రాష్ట్ర విభజన చేసిన ప్రభుత్వాలు ఇటువంటి విషయాలను వేటినీ స్పృశించలేదు. తెలంగాణ విద్యా సంస్థల్లో మహారాష్ట్ర వాసులకు ఎంత హక్కు ఉంటుందో ఆంధ్రప్రదేశ్ వారికి కూడా అంతే హక్కు అన్నట్లుగా మారింది. హైదరాబాద్‌ను సుసంపన్నం చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల భాగస్వామ్యానికి ఏమాత్రం విలువ లేదు. ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణతో ముడిపెట్టడంలో ఆంధ్ర ప్రజల పాత్ర ఏమీ లేదు.

కేంద్ర ప్రభుత్వం తలచుకుంది; అదే కలిపింది, అదే విడగొట్టింది. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య వైషమ్యాలకు కూడా ప్రజల బాధ్యత లేదు. ‘రెండు రాష్ట్రాలలో ఎక్కడ చదివినా ఒక్కటే’ అనే ఒక చిన్న అమాయకపు ఆలోచన ఒక విద్యార్థిని జీవితాన్ని శాసించింది అనేది మాత్రం వాస్తవం.

ఇక ముందైనా ప్రభుత్వాలు తాము చేసే చట్టాల పట్ల—ముఖ్యంగా విద్యార్థుల కెరీర్‌పై ప్రభావం చూపించే చట్టాల పట్ల—ప్రజలకు అవగాహన కల్పిస్తే ఇటువంటి ఇబ్బందులు తలెత్తవు.

అర్హత పరీక్షకు ముందు నాలుగు సంవత్సరాలు నిరంతరం చదివి ఉండాలో, లేక నాలుగు సంవత్సరాలు ఆయా రాష్ట్రాలలో విడివిడిగా చదివి ఉంటే సరిపోతుందో తెలియని అయోమయంలో ఈ విద్యార్థిని మాదిరిగా రెండు రాష్ట్రాల విద్యార్థులు ఇకపై ఇబ్బంది పడకూడదు.!

Total Visitors: 2,855,257