October 3, 2026

విద్యార్థులను ఉద్యోగ ప్రపంచానికి సిద్ధం చేయాలి

  • ప్రతి విశ్వవిద్యాలయంలో స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు ఇంక్యుబేషన్ సెంటర్ ఉండాలి
  • మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్: విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య అంతరం ఉండకూడదని, విద్యార్థులకు చదువుతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు, ప్రాక్టికల్ అనుభవం అందించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
శనివారం కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూహెచ్‌లో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) ఆధ్వర్యంలో నిర్వహించిన REACH–2026 సదస్సులో మంత్రి పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులను తరగతి గది నుంచి కెరీర్‌కు, విద్య నుంచి నైపుణ్యాలకు, పరిశోధన నుంచి పరిశ్రమలకు అనుసంధానించే నిరంతర వ్యవస్థను తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం డిగ్రీలకే పరిమితమైన విద్యా విధానానికి బదులుగా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు, ప్రాక్టికల్ శిక్షణ, వాస్తవ సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా విద్యా వ్యవస్థ మారాలని సూచించారు.

“ఒక విద్యార్థి కోర్సు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగానికి సిద్ధంగా ఉండాలి. మరో ఆరు నెలలు వేచి ఉండాల్సిన అవసరం ఉండకూడదు. ఖరీదైన ప్రైవేట్ కోర్సులు పూర్తి చేసిన తర్వాతే ఉద్యోగానికి అర్హత సాధించే పరిస్థితి మారాలి” అని శ్రీధర్ బాబు అన్నారు. ప్రతి విశ్వవిద్యాలయంలో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. విద్యార్థులు, పరిశోధకులు, ఆవిష్కర్తలు తమ ఆలోచనలు, పరిశోధనలను స్టార్టప్‌లు, ఉత్పత్తులు, వ్యాపార సంస్థలుగా మార్చుకునేందుకు అవసరమైన వాతావరణాన్ని ఈ కేంద్రాలు కల్పించాలన్నారు.

పాఠ్య ప్రణాళిక రూపకల్పన, ప్రయోగశాలలు, ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు, లైవ్ ప్రాజెక్టులు, పరిశోధన, ఆవిష్కరణల్లో పరిశ్రమలు విద్యాసంస్థలతో క్రియాశీల భాగస్వాములుగా మారాలని ఆయన అన్నారు. “ఒక చేతిలో డిగ్రీ, మరో చేతిలో నైపుణ్యం ఉండటం కొత్త ప్రమాణంగా మారాలి” అని మంత్రి పేర్కొన్నారు.

టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చే ప్రభుత్వ కార్యక్రమాన్ని మంత్రి ప్రస్తావించారు. రోబోటిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఆధునిక తయారీ, ఇండస్ట్రీ 4.0, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై శిక్షణకు ఈ కేంద్రాల్లో ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణలో ఐటీ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ తదితర రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయని మంత్రి చెప్పారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేలా యువతకు అవసరమైన నైపుణ్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు.

“ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి అనేది మాత్రమే కాదు.. ఆ ఉద్యోగాలకు మన యువత సిద్ధంగా ఉందా అనేది కూడా ప్రశ్నించాలి. అవకాశాలు, ప్రతిభ రెండూ ఉన్నాయి. వాటి మధ్య వారధిని నిర్మించాల్సిన అవసరం ఉంది” అని శ్రీధర్ బాబు అన్నారు.యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటును ప్రస్తావిస్తూ, సాంకేతికత, ఉపాధి, యువత ఆకాంక్షలకు అనుసంధానమైన విద్య, నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను తెలంగాణ నిర్మిస్తోందన్నారు.

విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమల మధ్య మరింత బలమైన సహకారం అవసరమని మంత్రి అన్నారు. ప్రయోగశాలల్లో జరుగుతున్న పరిశోధనలు మార్కెట్‌కు చేరేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, ఉపాధి అవకాశాలు పెరగాలని సూచించారు.

Total Visitors: 2,855,229