October 9, 2026

ఒకే పర్యటన.. ఎన్నో లక్ష్యాలు

రెండు రోజులు, ఎనిమిది కీలక కార్యక్రమాలు, తీరిక లేదు. అలుపు లేదు. ఢిల్లీలో ఒకటే ఎజెండా: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ప్రధాని మోదీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, సీఆర్ పాటిల్, పీయూష్ గోయెల్, శర్బానంద సోనోవాల్ వరకు ప్రతి తలుపూ తట్టి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం ఒక్కో అంశాన్ని స్పష్టంగా ముందుంచారు.

నీటి భద్రత కోసం

రాష్ట్రంలో 53 శాతం లోటు వర్షపాతం నమోదైన ఈ ఎల్‌నినో సంవత్సరంలో నీటి విలువ ఏమిటో రైతుకు తెలుసు. అందుకే పోలవరాన్ని వచ్చే గోదావరి పుష్కరాల నాటికి జాతికి అంకితం చేయాలనే సంకల్పంతో నిధులు, అనుమతులు కోరారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లతో ఏళ్ల తరబడి నానుతున్న సమస్యకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అనే పరిష్కారం సూచించారు. గోదావరి–కావేరి అనుసంధానం గురించి ప్రధాని నుంచి హోం మంత్రి వరకు అందరికీ చెప్పారు. వేల టీఎంసీల వరద నీరు సముద్రంలో కలుస్తుంటే, ఆ నీటితో నాలుగు రాష్ట్రాల దాహం తీరే అవకాశాన్ని దేశం ముందు ఉంచారు. 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు నీటి కనెక్షన్లకు శంకుస్థాపన చేసిన విషయాన్నీ వివరించారు.

సముద్రం నుంచి సంపద వైపు

సుదీర్ఘ తీరప్రాంతం ఆంధ్రప్రదేశ్‌కు దేవుడిచ్చిన వరం. దాన్ని ఆర్థిక శక్తిగా మలిచే ప్రయత్నమే కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి సోనోవాల్‌తో జరిగిన భేటీలో కనిపించింది. శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టులో టెర్మినల్ ఏర్పాటుకు సహకారం కోరిన సీఎం, ఆ పోర్టును కేవలం సరకు రవాణా కేంద్రంగా కాకుండా పరిశ్రమలు, లాజిస్టిక్స్, ఎగుమతులు, సముద్ర ఆధారిత తయారీకి హబ్‌గా తీర్చిదిద్దే అవకాశాన్ని వివరించారు. దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటైతే నౌకల నిర్మాణం, మరమ్మతులు, మెరైన్ పరికరాల తయారీతో కొత్త పారిశ్రామిక ఎకోసిస్టమ్ ఏర్పడుతుందని, భూమి, మౌలిక వసతులు కల్పించడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు తీరం వరకు ఉపాధి, పెట్టుబడుల అవకాశాలు ఇలా విస్తరిస్తాయి.

ఓడరేవుల నుంచి క్వాంటం వరకు

ఆయన ఆలోచనల పరిధి ఆశ్చర్యపరుస్తుంది. ఒకవైపు దుగరాజపట్నంలో మజగావ్ డాక్‌యార్డ్, మచిలీపట్నంలో గోవా షిప్‌యార్డ్ నౌకా నిర్మాణ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావడం, పోర్టుల కోసం 20 వేల ఎకరాలకు పైగా ఉప్పు భూములు కోరడం. మరోవైపు అమరావతిలో వచ్చే ఫిబ్రవరి నుంచి క్వాంటం కంప్యూటర్ కార్యకలాపాలు, విశాఖలో గూగుల్ గిగావాట్ డేటా సెంటర్. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా, డ్రోన్–ఎలక్ట్రానిక్స్ కేంద్రంగా మార్చే ప్రయత్నాలు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, పోలవరం వద్ద ఐకానిక్ బ్రిడ్జి, విశాఖ మెట్రో వంటి అభ్యర్థనలు. వీటన్నిటి వెనుక ఉన్న ఒకే సూత్రం “బిల్డ్ ఏపీ”.

ఒప్పందాల నుంచి పెట్టుబడుల దాకా

ఢిల్లీలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 కర్టెన్ రైజర్‌లో ముఖ్యమంత్రి మాట్లాడిన తీరులో ఒక స్పష్టమైన సందేశం ఉంది: “ఎంఓయూలకే పరిమితం కావడం లేదు, వాటిని వాస్తవ పెట్టుబడులుగా మలిచేందుకు ప్రత్యేకంగా దృష్టి పెట్టాం.” పారిశ్రామికవేత్తల సమక్షంలో ఆయన చెప్పిన ఈ మాటే ఈ రోజు ప్రసంగ సారాంశం.

గత ఏడాది భాగస్వామ్య సదస్సులో రూ.13.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. గడచిన 28 నెలల్లో రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించగలిగామని సీఎం వెల్లడించారు. గూగుల్ 1 గిగావాట్ డేటా సెంటర్, ఆర్సెలార్ మిత్తల్ వంటి సంస్థలు రాష్ట్రానికి రావడాన్ని ఉదాహరణలుగా చూపారు.

నవంబరు 12–13 తేదీల్లో విశాఖలో జరిగే సదస్సులో, గతంలో ప్రకటించినట్టుగా పారిశ్రామిక ప్రోత్సాహకాల ఎస్క్రో ఖాతాను ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రోత్సాహకాలు సమయానికి అందుతాయన్న నమ్మకాన్ని పెట్టుబడిదారులకు ఇచ్చే చర్య ఇది. పెట్టుబడులకు అడ్డంకిగా ఉన్న నాలా చట్టం రద్దు కూడా అదే దిశలో వేసిన అడుగు.

ఇదే వేదికపై కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ ఏపీ ప్రయత్నాలను ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ అంటే వాణిజ్యవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు చిరునామా అని, టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్, టాలెంట్, ట్రెడిషన్ అనే ఐదు అంశాలపై దృష్టి పెట్టి రాష్ట్రం పారిశ్రామికవేత్తల విశ్వాసాన్ని చూరగొంటోందని అన్నారు. విశాఖ సదస్సుకు హాజరై పెట్టుబడి అవకాశాలను పరిశీలించాలని పారిశ్రామికవేత్తలను కోరారు.

సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనం

ఢిల్లీ వెళ్లడం అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒప్పించడం. కేంద్రం సహకారాన్ని కృతజ్ఞతతో గుర్తు చేస్తూనే, రాష్ట్రానికి కావాల్సినవి నిర్దిష్టంగా అడగడం ఆయన శైలి. 1998లోనే టెక్నాలజీని అందిపుచ్చుకున్న నేత, ఇప్పుడు ఏఐ, డేటా లేక్, క్వాంటం యుగంలోనూ అదే ముందుచూపుతో నడుస్తున్నారు. స్వర్ణాంధ్ర–2047 లక్ష్యం ఆ ప్రయాణానికి దిక్సూచి.
అభివృద్ధి ఒక్క రోజులో రాదు. కానీ దిశ సరైనదైతే గమ్యం దూరం కాదు. ఈ పర్యటనలో తెచ్చిన ప్రతి హామీ ఆచరణగా మారిననాడు, ఇది నిజంగా చరిత్రలో నిలుస్తుంది.

Total Visitors: 2,909,616