October 9, 2026

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాం

  • రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
  • సుప్రీంకోర్టులో చివరి వరకూ చిత్తశుద్ధితో న్యాయపోరాటం చేశాం
  • కోర్టు తీర్పును గౌరవిస్తాం
  • పార్టీపరంగా బీసీలకిచ్చిన మాటను నిలబెట్టుకుంటాం
  • బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్న జగన్
  • గత ఎన్నికల్లోనూ రిజర్వేషన్లకు వైసీపీ ప్రభుత్వం కోత
  • 16,800 పదవులకు దూరమైన బీసీలు
  • జనాభా ప్రాతిపదికను బీసీలకు పదవులు దక్కాలన్నదే మా అభిమతం

పెనుకొండ/శ్రీసత్యసాయి : స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కోసం చిట్టచివరి వరకూ, చిత్తశుద్ధితో న్యాయపోరాటం చేశామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తూ, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని, పార్టీ పరంగా వర్తింపజేస్తామని స్పష్టంచేశారు. బీసీలు రాజకీయంగా ఎదగడం జగన్ కు ఇష్టం లేదని, అందుకే ఆయన హైకోర్టులో కేసులు వేసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నారని మండిపడ్డారు.

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా గుర్తింపు లభించేలా టీడీపీ ప్రభుత్వాలు కృషి చేస్తూ వస్తున్నాయన్నారు. 1987లో మొట్టమొదటి సారిగా స్థానిక సంస్థల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లను అన్న ఎన్టీఆర్ అందజేశారన్నారు.

ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు 1995లో బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచారన్నారు. ఆనాటి నుంచి 2021 వరకూ బీసీలకు రిజర్వేషన్లు అమలవుతూ వస్తున్నాయన్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరవాత బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి కుదించి.. 10 శాతం మేర కోత విధించారన్నారు. దీనివల్ల బీసీలు చివరిసారిగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 16,800 పదవులు కోల్పోయారని మంత్రి సవిత ఆవేదన వ్యక్తంచేశారు.

బీసీలు రాజకీయంగా ఎదగడం ఇష్టంలేని జగన్ హైకోర్టుకెళ్లి బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిల్ దాఖలు చేశారని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు తీర్పుఇవ్వడంతో, సుప్రీం కోర్టును ఆశ్రయించామన్నారు. కేంద్రమంత్రి రామ్మోహననాయుడు, రాష్ట్రానికి చెందిన మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులతో చర్చించారన్నారు. చిట్టచివరి వరకూ బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు చిత్తశుద్ధితో న్యాయ పోరాటం చేశామని మంత్రి సవిత వెల్లడించారు..

సుప్రీంకోర్టులోనూ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పురావడం బాధాకరమని, దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును శిరసావహిస్తామని మంత్రి సవిత తెలిపారు. కోర్టులు కొట్టేసినా బీసీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని స్పష్టంచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కూటమి తరఫున 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని తెలిపారు.

Total Visitors: 2,909,610