Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి పాలనతో రాష్ట్రం 20ఏళ్లు వెనక్కి

– టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు
జగన్ రెడ్డి పాలనతో రాష్ట్రం విధ్వంసానికి గురైందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్ లు, ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… 20 ఏళ్లు రాష్ట్రం వెనక్కి వెళ్లింది. టీడీపీ హయాంలో తీసుకొచ్చిన ఏపీ బ్రాండ్ ను కోల్పోయాం. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కూడా తప్పైపోతోంది. అంటే జగన్ రెడ్డి అక్రమాలు, అవినీతి చేసినా చూస్తూ ఊరుకోవాలా? రాష్ట్ర అప్పులు 5.35 లక్షల కోట్లకు చేరాయి.
జగన్ రెడ్డి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. నేడు ఉపాధి హామీ పథకంలో మస్టర్ల కుంభకోణానికి పాల్పడుతున్నారు. విశాఖలో ఏ-2 విజయసాయిరెడ్డి భూఅక్రమాలకు పాల్పడుతున్నారు. అసలు విశాఖలో విజయసాయిరెడ్డికి ఏం పని? దళారిగా పనిచేసే సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు డీజీపీ మాదిరిగా పనిచేస్తూ అందరినీ బెదిరిస్తున్నారు. వైసీపీ నేతల కంటే తాలిబన్లే నయం. ఏం చేసినా వీరి ఆటలు సాగుతాయనే విధంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు చట్టాలను గౌరవించాలి. టీడీపీ నేతలపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడాన్ని మానుకోవాలి. తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసులపై ప్రైవేటు కేసులు వేస్తాం. ప్రజాస్వామ్యంలో ఏకపక్ష విధానాలు సరికాదు. జగన్ రెడ్డి అరాచక విధానాలకు కొంతమంది పోలీసులు బానిసలయ్యారు. ఇది సొంత రాజ్యాంగం కాదు.. భారత రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాలి.
రాష్ట్రంలో గత రెండేళ్లుగా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులను రకరకాలుగా వేధించారు. ప్రతిపక్షాలపై కేసులు పెట్టి ఉన్మాదిలా పైశాచిక ఆనందం పొందేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. తప్పుడు కేసులు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు. నిన్నటికి నిన్న పెట్రోల్ డీజిల్ ధరలపై ఆందోళన చేసిన చింతమనేని ప్రభాకర్ విశాఖలో దేవాలయానికి వెళ్తే చింతపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్నారంటూ గంజాయి స్మగ్లింగ్ కేసు పెట్టే ప్రయత్నం చేశారు. మాజీ ఎమ్మెల్యేను కూడా గుర్తుపట్టలేనంత దుస్థితిలో పోలీసులున్నారా.? ఉపాధి హామీ పనుల బిల్లులు చెల్లించకుండా.. పనులు చేసిన టీడీపీ నేతల్ని వేధిస్తున్నారు. రెండేళ్ల పోరాటం తర్వాత బిల్లుల్ని చెల్లించేలా విజయం సాధించాం. చివరికి ఐఏఎస్ అధికారుల్ని కోర్టుకు పిలిచిన తర్వాత కూడా బిల్లులు చెల్లించకపోయేసరికి జైల్లో పెడతామని కోర్టులు హెచ్చరించే పరిస్థితి తీసుకొచ్చారు.
నాడు ప్రజలకు మేలు చేయాలని ప్రయత్నాలు చేస్తే.. దాన్ని కూడా ఈ ముఖ్యమంత్రి రాజకీయం చేసి ఇబ్బందులు పెడుతున్నారు. మనం ప్రజాబలంతో ప్రతిఘటించాలి. ప్రజలు కూడా తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. చేసిన పాపాలు బయటపడతాయనే భయంతో తప్పుడు కేసులు పెడుతున్నారు. అక్రమ అరెస్టులతో అడ్డుకుంటున్నారు. ఎస్సెస్సీ బోర్డు డైరెక్టర్ మహిళా ఉద్యోగులను వేధించే పరిస్థితి. ప్రజా చైతన్యమే సమస్యలకు పరిష్కారం. భవిష్యత్ లో జగన్ రెడ్డి విధ్వంస విధానాలపై తిరుగుబాటు తప్పదు. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేనివారు రాష్ట్రానికి ఏం చేస్తారు? బాబాయిని ఎవరు చంపారో తేల్చలేని వారు రాష్ట్రానికి ఏం చేస్తారు? ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ పెద్దఎత్తున పోరాటాలు చేస్తుంది. సమైక్య శక్తిగా అందరం పోరాడదాం.
కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నాం. అధికారంలో ఉన్నపుడు ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడ్డాం. ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్నాం. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన గత రెండున్నర సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా గ్రామస్థాయిలో ఉన్న కార్యకర్తలు పార్టీ వెన్నంటే ఉన్నారు. అదే మన బలం. తెలుగుదేశం పార్టీని భూ స్థాపితం చేసేందుకు సామధాన దండోపాయాలు ఉపయోగించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు సామాజికవర్గాలకు జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిందేమీ లేదు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్పుకోవడం తప్ప.. రూపాయి బడ్జెట్ ఇచ్చింది లేదు. రుణం ఇచ్చింది లేదు. కానీ ఎంతో చేశామంటూ హడావుడి చేస్తున్నారు. అందుకే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసేందుకు బీసీ, ఎస్సీలకు కార్పొరేషన్ల వారీగా కమిటీలు ఏర్పాటు చేయబోతున్నాం. నరేగా పనుల బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. కోర్టులకు వెళ్లి పోరాటం చేశాం. విజయం సాధించాం. ఫిబ్రవరి 19, 2019 నాటి వరకు చేసిన పనులకు సంబంధించిన బిల్లులు మాత్రమే చెల్లించారు. మిగిలిన బిల్లులు చెల్లించేలా పోరాటం చేస్తాం. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాలు, ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారు. వీటిపై క్షేత్రస్థాయిలో ప్రతి రోజూ పోరాటం చేస్తాం. ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తాం. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చేసిన పోరాటం ప్రభుత్వంలో వణుకు పుట్టించింది.
వర్ల రామయ్య, పొలిట్ బ్యూరో నేత
పోలీసు వ్యవస్థ చాలా ఘోరంగా వ్యవహరిస్తోంది. చింతమనేని ప్రభాకర్ విషయంలో అన్యాయంగా వ్యవహరించారు. ఆయనను బెదిరించారు. ఒక రాజకీయ నేత పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? గతంలో ఎన్నడూ హౌస్ అరెస్ట్ లు లేవు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా? జగన్ రెడ్డి, డీజీపీ కలిసి పోలీసు వ్యవస్థను దిగజార్చారు. రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసులపై ప్రైవేటు కేసులు వేస్తాం.
ఆలపాటి రాజేంద్రప్రసాద్, టీడీపీ సీనియర్ నేత
సమస్యలను పక్కదారి పట్టించేందుకే టీడీపీపై అవినీతి బురద జల్లుతున్నారు. జగన్ రెడ్డి మోసాలు ప్రజలకు అర్థమయ్యాయి. న్యాయమూర్తులపై దాడులకు కూడా వైసీపీ నేతలు తెగబడ్డారు. కేవలం కక్షసాధింపు చర్యలకే ఈ రెండేళ్ల సమయాన్ని జగన్ రెడ్డి వినియోగించుకున్నారు.
వంగలపూడి అనిత, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు
జగన్ రెడ్డి పాలనలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయి. రమ్య హత్య విషయంలో 21 రోజుల్లో దోషులను శిక్షించాలి. టీడీపీ హయాంలో జరగని సంఘటనలను కూడా జరిగినట్లుగా ప్రజలను నమ్మించారు. ఇప్పుడు రాష్ట్రంలో మహిళలపై రోజుకు రెండు ఘటనలు జరుగుతున్నా చర్యలు శూన్యం.
బండారు సత్యనారాయణమూర్తి, మాజీ మంత్రి
చెత్త, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్రాపర్టీ ట్యాక్స్ తో ప్రజలపై జగన్ రెడ్డి మోయలేని భారం మోపుతున్నారు. చెత్త నుంచి టీడీపీ హయాంలో సంపద సృష్టించగా.. నేడు జగన్ రెడ్డి పాలనలో చెత్తపై కూడా పన్ను వేస్తూ ప్రజలను హింసిస్తున్నారు. టీడీపీ హయాంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ ఉచితం కాగా.. నేడు డొనేషన్లు వసూలు చేస్తున్నారు.
డాక్టర్ నూకసాని బాలాజి, టీడీపీ నేత
వెలిగొండ ప్రాజెక్టును కేంద్ర గెజిట్ లో చేర్చేవరకు టీడీపీ పోరాడుతుంది. జగన్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం నష్టపోతోంది. ప్రశ్నించిన టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. టీడీపీలో బలమైన నేతలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారు. పోలీసు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన పరిస్థితి.
సమావేశంలో కింది నిర్ణయాలు చేయడం జరిగింది
1. మహిళలపై అత్యాచారాలు, హత్యలకు వ్యతిరేకంగా, రమ్య హంతకుల్ని దిశ చట్టం ప్రకారం 21 రోజుల్లో ఎందుకు శిక్ష వేయలేదని దిశ పోలీస్ స్టేషన్ల వద్ద శాంతియుతంగా నిరసనలు తెలియజేసే ప్రయత్నం చేసిన తెలుగు మహిళ, తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నాయకుల్ని, పార్టీ నేతల్ని గృహ నిర్బంధం చేయడం రాజ్యాంగ వ్యతిరేక చర్య. అలాగే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబుపై దౌర్జన్యం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సమావేశం డిమాండ్ చేసింది
2. రెండున్నరేళ్లలో విద్యుత్ ఛార్జీలు రూ.9 వేల కోట్లు పెంచారు. అదనంగా మరో రూ.24 వేల కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా అప్పు తెచ్చారు. ఈ రూ.33 వేల కోట్లు ఏం చేశారు? నేడు కరెంట్ కోతలు పెడుతున్నారు. కరెంట్ కోతలు ప్రశ్నించిన అనంతపురం రైతు సిద్ధారెడ్డిపై అక్రమ కేసు పెట్టారు. తెలుగుదేశం తక్కువ అప్పుచేసి 10వేల మెగావాట్లు అదనంగా విద్యుత్ ఉత్పత్తి చేసింది. విద్యుత్ రేట్లు పెంచలేదు. మిగులు విద్యుత్ ఇచ్చింది. జగన్ రెడ్డి రూ.33 వేల కోట్లు అప్పు చేసినా టీడీపీ ప్రభుత్వంలా విద్యుత్ ఉత్పత్తి చేయలేదు. కరెంట్ కోతలు పెట్టారు. విద్యుత్ రేట్లు బారీగా పెంచి వైసీపీ నేతలు లూఠీ చేస్తున్నారు. పైగా మోటార్లకు మీటర్లు పెట్టి రైతు గొంతుకు ఉరి బిగిస్తున్నారు. విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని సమావేశం నిర్ణయించింది.
3. అక్రమ కేసులు పెడుతున్న పోలీసు అధికారులపై ప్రైవేటు కేసులు వేయాలని తీర్మానించడమైంది.
4. నరేగా బిల్లుల చెల్లింపులపై హైకోర్టు తీర్పు ధిక్కరించే అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఉపాధి మస్టర్ల కుంభకోణంపై విచారణ జరిపించాలి
5. మద్యంలో రూ.25 వేల కోట్ల కుంభకోణం, రూ.15 వేల కోట్ల లాటరైట్, గనుల కుంభకోణాలు, రూ.10 వేల కోట్ల ఇసుక కుంభకోణాలు, సెంటు పట్టాలో రూ.6,500 కోట్ల కుంభకోణం, రంగులు వేయడానికి, తీయడానికి రూ.3 వేల కోట్ల దుర్వినియోగం తదితర కుంభకోణాలపై ప్రజా చైతన్యం పెంచి రాష్ట్ర సంపదను కాపాడుకోవాలని తీర్మానించడమైంది.

LEAVE A RESPONSE