-చవితికి వచ్చే కరోనా.. డాన్సు పార్టీలకు రాదా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఈసారి వినాయక చవితి పండుగ ఎవరి ఇళ్లలో వారే నిర్వహించుకోవాలన్నది ఏపీ సర్కారు హుకుం. అంటే.. గతంలో మాదిరిగా రోడ్లపై వినాయక మండపాలు పెట్టి, నవరాత్రులు నిర్వహించి నిమజ్జనాల వంటి కార్యక్రమాలు చేస్తే కేసులు తప్పవన్నది జగనన్న సర్కారు హెచ్చరిక. కాబట్టి గణపతి భక్తులయిన హిందువులంతా నవరంధ్రాలూ మూసుకుని, ఎవరిళ్లలో వారు గప్‌చుప్‌గా గణపతి పండుగ చేసుకోవాలట. అంటే మట్టి వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకున్నారా.. వాటిని తొమ్మిదిరోజులు పూజలు చేసుకున్నారా.. వాటిని సైలెంటుగా నిమజ్జనం చేశారా అన్నట్లుండాలే తప్ప… హడావిడి చేస్తే అరదండాలు తప్పవన్నది జగనన్న సర్కారు విధించిన ఆజ్ఞ. ఇదంతా ఎందుకు? ఈ లక్ష్మణ రేఖలేమిటని అడిగితే.. కరోనా ఉంది కాబట్టి, ఆపాటి జాగ్రత్తలు తప్పవని, అసలు ఇవన్నీ సమాజం కోసమేనన్నది పోలీసులు చెబుతున్న సూక్తులు.
మంచిదే. స్వతహాగా క్రైస్తవ సంప్రదాయాలు పాటించే ఒక ముఖ్యమంత్రి.. హిందువుల పండగల పట్ల, వారి ఆరోగ్యం పట్ల ఆపాటి అపార శ్రద్ధాశక్తులు చూపించడం గొప్ప విషయమే. అంతవరకూ ఎవరూ కదనరు! కానీ… ఇతర మతాల పండుగలకు లేని ఆంక్షలు, రాజకీయ పార్టీలు నిర్వహించే జాతర్లకు లేని ఆంక్షలు, ఒక్క గణపతి పండుగకకే ఎందుకన్నది బుద్ధిజీవుల ప్రశ్న. అందాకా ఎందుకు? రెండురోజుల ముందు మహానేత దివంగత వైఎస్ వర్ధంతి వేడుకలను వైసీపేయులు ఆకాశమంత పందిరేసి, భూదేవంత అరుగేసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. అన్నదానాలు, వర్థంతి సభలు పెట్టారు. వందలు, వేలల్లో త రలివచ్చి మరణించిన ఆ మహానేత విగ్రహాలకు పూలదండలేసి, సామూహిక కార్యక్రమాలు నిర్వహించారు. వాటికి మంత్రులు, ఎమ్మెల్యేలూ హాజరయ్యారు.
మరి దానికి రాని కరోనా.. గణపతి మండపాలు పెడితే వస్తుందా? కొంపతీసి కరోనా మహమ్మారి కూడా ఫలానా పండుగులకే పగపట్టాలని తీర్మానించుకుందా ఏమిటి? స్థానికంగా ఎమ్మెల్యేలు నిర్వహించే కార్యక్రమాలకు రాని కరోనా.. సినిమా హాళ్లు, వైన్‌షాపులు, మాల్స్, బస్సు,రైళ్లూ, హోటళ్లకూ సోక ని కరోనా.. వినాయక విగ్రహాలు పెడితేనే వస్తుందని డిసైడయ్యారా ఏమిటన్నది మెడపై తల ఉన్న ప్రతి ఒక్కరికీ వచ్చే డౌటనుమానం! అంతేనా… లేక ఎలాగూ హిందువులది తోలుమందం కాబట్టి.. ఇలాంటి నిర్ణయాలపై ఆర్ఎస్ఎస్, విశ్వహిందూపరిషత్ వంటి బీజేపీ జేజెమ్మలు వ్యతిరేకించకుండా.. దానిపై రోడ్డెక్కకుండా, నవ రంధ్రాలూ మూసుకుని, పేపర్ స్టేట్మెంట్లతో పొద్దుపుచ్చే రాజకీయ క్రీడల్లో మునుగుతారు కాబట్టి, ఏమీ అనరన్న ధైర్యమా అన్నది బుద్ధిజీవుల మరో ప్రశ్న. ఇలాంటి నిర్ణయాలు ఇంకెన్ని తీసుకున్నా.. విశాఖ స్వరూపాడు ఎలాగూ మన పార్టీలోనే ఉన్నాడు కాబట్టి, అన్నీ ఆయనే చూసుకుంటాడులేనన్న ధీమానా? ఏదైతేఏంటి? వినాయకచవితి పండుగ రోజు మండపాలు పెట్టవద్దన్నది జగనన్న ఆజ్ఞ.దట్సాల్!
ఆ కోణంలో జగనన్న సర్కారుకు జనం మీదున్న శ్రద్దను కచ్చితంగా అభినందించి తీరాల్సిందే. మరి ఇదేమిటి నాయకా? గుంటూరులోని ఒక కల్యాణమండపంలో ఏపీ మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రమాణస్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. దానికి ఇద్దరు మంత్రులు కూడా హాజరయ్యారు. తమ అభిమాన నేతకు పదవి వచ్చినందుకు, వందల సంఖ్యలో వచ్చిన వైసీపీ అభిమానులు హాలును ముంచెత్తారు. బహుశా ఆ కార్యక్రమం వ ల్ల కరోనా రాదని భావించిన పోలీసులు, దానికి అభ్యంతరం పెట్టలేదు. సరికదా.. అక్కడికొచ్చిన మంత్రులకు బందోబస్తుగా ఉన్నారు. లోపల వందల సంఖ్యలో గుమిగూడిన జనాలకు కరోనా వస్తుందన్న భయంతో, వారిని బయటకు పంపే సాహసం చేయలేదు. సహజంగా అయితే పోలీసులు ఇలాంటి కార్యక్రమాలు ఏ ప్రతిపక్షాలో, గిట్టనివారో పెడితే వెంటనే వారికి కరోనా నిబంధనలు గుర్తుకొస్తుంటాయి. వెంటనే కేసులు కూడా బుక్కయిపోతుంటాయి. కానీ అదేం విచిత్రమో గుంటూరు పోలీసులకు అలాంటి విధినిర్వహణ ఏమీ గుర్తుకు రాలేదు. పైగా మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి, సుచరిత, ఆదిమూలం సురేష్, ఎమ్లెల్యే ముస్తఫా, ఎమ్మెల్సీ పోతుల సునీత వంటి వారంతా ఆ కార్యక్రమం చూసి తన్మయులయ్యారు. బహుశా వారి ఆనందానికి అంతరాయం కలిగించడం ఎందుకన్న గౌరవంతో పోలీసులు అటు వెళ్లలేకపోవచ్చు. గుంటూరు అర్బన్ ఎస్పీ నీతికి, నిజాయితీకి నిలువుటద్దం అంటుంటారు. మరి ఆయనా పెద్దగా స్పందించినట్లు లేదు.అన్నట్లు.. మొన్నామధ్య కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా డాన్సులు వేసినందుకు, అదే గుంటూరులో వెంకటేశ్వర్లు అనే సీఐ సహా 11 మందిపై కేసు పెట్టిన జిల్లా పోలీసుబాసులు, మరి ఇక్కడ ‘అంతకుమించి’ జనం మూగినా.. ఒక్కరిపైనా కేసెందుకు పెట్టలేదు చెప్మా? సరే.. ఎవరి ఇబ్బందులు వారివి! ఎవరి భక్తి వారిది!!
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. అన్ని వందల మంది వైసీపీ కార్యకర్తలు, అధికార పార్టీ నేతలు, మంత్రుల సమక్షంలో సర్కారు అధికారికంగా నిర్వహించిన ఆ కార్యక్రమంలో.. రికార్డింగ్ డాన్సులు నిర్వహించడం! ప్రభుత్వం నియమించిన ఒక కార్పొరేషన్ చైర్మన్ తన ప్రమాణస్వీకారాన్ని ఆయన కార్యాలయంలోనే చేసుకోవడం ఆనవాయితీ. కానీ, దానిని ఇలా పబ్లిక్‌గా, సర్కారు ఖర్చుతో ఏర్పాటుచేసిన వేదికపైన ‘బావలూ..సయ్యా’ అంటూ రికార్డింగ్ డాన్సులు వేయడం, దానిని అక్కడికి విచ్చేసిన వైసీపీ భక్తశిఖామణులు లొట్టలేసుకుని ఆనందించడం.. జగనన్న పరువు పెంచడమా? తుంచడమా? అసలు ఇలాంటి ప్రమాణ స్వీకారాలు ఇలా ప్రైవేటు హాళ్లలో జరపడమే అభ్యంతరకరం. బహుశా.. ఇటీవల విశాఖలోని ఒక హోటల్లో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ప్రమాణం, విజయవాడలో జరుగుతున్న ఇతర కార్పొరేషన్ చైర్మన్ల ప్రమాణస్వీకారాలూ దీనికి స్ఫూర్తికావచ్చేమో? నిస్సిగ్గుగా జరుగుతున్న ఇలాంటి కార్యక్రమాలు చూసి, మనమూ సిగ్గుపడదాం రండి! చేసేదేముంది? నలుగురితోపాటు నారాయణ! అయిదుగురితోపాటు ఆదినారాయణ!!అంతేగా.. అంతేగా!!!