– పాడి రైతులకు ఇష్టం లేకపోతే పీఎస్ లు ఏం చేస్తారు.?
– శాసనమండలి సభ్యులు పర్చూరి అశోక్ బాబు
అమూల్ కేంద్రాలకు పాలు తక్కువగా వస్తున్నాయని, పాల సేకరణ మరింత పెంచాలని పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులివ్వడం ప్రభుత్వ వేధింపుల పరాకష్టకు నిదర్శనం. పాడిరైతులతో అమూల్ కు పాలు పోయించాలని ఉద్యోగులను బెదిరించడం ఏంటి? అమూల్ కు పోయడానికి రైతులు ఇష్టపడటం లేదు. దానికి ఉద్యోగులను కారణంగా చూపిస్తారా.?
పోసిన పాలకు నెలల తరబడి బిల్లులు ఇవ్వడం లేదని బాధితులు లబోదిబోమంటున్నారు. బలవంతం చేసి పాలు రాబట్టాలనుకోవడం వెనక ఉన్న ప్రభుత్వ దురుద్ధేశం ఏంటో ప్రజలకు సమాధానం చెప్పాలి. మీకు వచ్చే కమీషన్ల కోసం అమూల్ కు పాలు పోయించాలని ఉద్యోగులను ఇబ్బందులు పెడతారా.? పంచాయతీ కార్యదర్శుల విధులేంటి..ప్రభుత్వం చెప్పే పనులేంటి.? సచివాలయానికి రాని ముఖ్యమంత్రికి, మంత్రులకు షోకాజ్ నోటీసులిస్తే బాగుంటుంది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు ఉద్యోగులను బాధ్యులను చేస్తారా.? ప్రభుత్వ చేతగానితనాన్ని ఉద్యోగులకు అంటగట్టాలను కోవడం సిగ్గుచేటు. ఉద్యోగులపై వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో షోకాజ్ నోటీసులే అద్దం పడుతున్నాయి.
కోవిడ్ సమయంలోనూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన పంచాయతీ ఉద్యోగులను గౌరవించే విధానం ఇదేనా.? వేతనాలు సమాయానికి ఇవ్వడానికి చేతకాని ప్రభుత్వానికి విధులకు సంబంధం లేని విషయంలో ఉద్యోగులకు నోటీసులిచ్చే అర్హత లేదు. 7వ తేదీన ఓ ఉద్యోగ సంఘం తమ బాధలను చెప్పుకుంటే ఫోన్లు చేసి ప్రభుత్వ పెద్దలు బెదిరించారు. ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభుత్వ ఉక్కుపాదం మోపుతోంది. పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి.