అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయానికి పార్టీ శ్రేణులు పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి భారీ ర్యాలీలతో పార్టీకి కార్యాలయానికి తెలుగు తమ్ముళ్లు వస్తున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ఆధ్వర్యంలో 300 కార్లతో పార్టీ కార్యాలయానికి కార్యకర్తలు వచ్చారు. మంగళగిరి, హిందూపురం నుంచి భారీగా నేతలు, కార్యకర్తలు తరలి వచ్చారు. మంగళగిరి నుంచి భారీగా కార్యకర్తలు వచ్చారు. తమ
ప్రసంగాలతో టీడీపీ నేతలు పరిటాల సునీత, రామ్మోహన్ నాయుడు, కూన రవి, నన్నూరి నర్సిరెడ్డి కార్యకర్తల్లో జోష్ నింపారు. టీడీపీ కార్యాలయం ముందున్న సర్వీస్ రోడ్ జనంతో కిక్కిరిసిపోయింది. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో మూడు ఫ్లోర్లు కిటకిటలాడుతున్నాయి. కూర్చొవడానికి చోటు దొరక్క నేతల ఇబ్బంది పడుతున్నారు. ‘జై తెలుగుదేశం’ అనే నినాదాలతో టీడీపీ కార్యాలయ ప్రాంగణం మార్మోగుతోంది. ఈ ఒక్క రోజునే సుమారు 30-35 వేల మంది వచ్చారని టీడీపీ చెబుతోంది. రెండు రోజుల్లో సుమారుగా 50 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.