మంత్రి హరీశ్‌రావు
హజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని, అన్ని సర్వేలూ ఇదే స్పష్టంచేస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఇల్లందకుంటలో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. తాను చెప్పే మాటల్లో నిజం ఉందా? లేదా? అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. మనకు అన్నం పెట్టేవాళ్లెవరూ..? సున్నం పెట్టేవాళ్లెవరో తెలుసుకోవాలని, ఈ ప్రాంతానికి మేలు చేసేవారెవరో ఆలోచించి ఓటేయాలని సూచించారు. ధరలు పెంచి బతుకు భారం చేసేవాళ్లు కావాల్నా? సంక్షేమ పథకాలతో పేదలకు మేలు చేసే పార్టీ కావాల్నా? అనేది తేల్చుకోవాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ మడమతిప్పని, మాట తప్పని పార్టీ అని చెప్పారు. చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని మర్చిపోవద్దన్నారు.
సీఎం కేసీఆర్ చెప్పింది కచ్చితంగా చేసి చూపిస్తారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రూ. 200 ఉన్న పింఛన్‌ను రూ. 2016 చేసిన విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ప్రతి పేదింటి ఆడబిడ్డ పెళ్లి లక్షా 116 రూపాయలు ఇస్తున్నారని తెలిపారు. దళితబంధు పథకం పేద దళితులతో ప్రారంభమైందని, అందరి ఖాతాల్లో రూ.10లక్షలు వేస్తారని చెప్పారు. అలాగే, అన్ని కులాల్లోని పేదలకు కూడా ఇలాంటి లబ్ధి చేకూర్చే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు రాక అన్నదాతలు పొలంగట్ల మీద పడుకునే వాళ్లు.. ఇప్పుడు అలా ఉందా పరిస్థితి? అని అడిగారు.
ఎస్సారెస్పీ కాలువల్లో నీళ్లు లేక యాసంగి పంట పండించేందుకు వర్షాలకోసం ఎదురుచూసే పరిస్థితి ఉండేది.. మరి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రతి ఎకరాకూ నీళ్లందిస్తున్నాం అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. భూమి శిస్తు, నీటి తీరువా రద్దు చేసి.. రెండు పంటలకూ పెట్టుబడి సాయం ఇస్తున్న ఘనత దేశంలో ఒక్క కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. రైతు చనిపోతే ఆ కుటుంబం ఆగంకావొద్దని రైతుబీమా కింద రూ. ఐదు లక్షలు ఇస్తున్నామన్నారు.
రైతుల ఉసురుపోసుకుంటున్న బీజేపీలో ఈటల రాజేందర్ చేరాడని, అబద్ధాలు, తిట్లు నేర్చుకున్నాడని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఈటల రాజేందర్ గెలిస్తే సిలిండర్ ధర రూ.500కు తగ్గిస్తరా చెప్పాలని డిమాండ్ చేసినా స్పందనలేదన్నారు. ఎన్నికలయ్యాక సిలిండర్ ధర రూ. 2000 అవుతుందని, సబ్సిడీ కూడా ఎత్తివేస్తారని తెలిపారు. ఆరుసార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు మంత్రిగా చేసిన ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్‌రూం ఇల్లు కూడా కట్టలేదని మండిపడ్డారు. మంత్రిగా ఉండికూడా అభివృద్ధి చేయలేని ఈటల రాజేందర్.. ప్రతిపక్షంలో ఉండి చేస్తడా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. అందుకే సిలిండర్‌కు దండంపెట్టు.. బీజేపీని బొందపెట్టు.. కారు గుర్తుకే ఓటుగుద్దు అనే నినాదమే హుజూరాబాద్ అంతా వినిపిస్తోందన్నారు.
బీజేపీ మ్యానిఫెస్టో ఓ జోక్..
బీజేపీ కేంద్ర మంత్రి తరుణ్ చుగ్ మంగళవారం రిలీజ్ చేసిన మ్యానిఫెస్టో పెద్ద జోక్ అని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ లో ఇంటింటికీ నల్లాల ద్వారా తాగు నీరు ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టారని, తాము నాలుగేళ్ల కిందటే ఇంటింటికీ మంచి నీళ్లు ఇచ్చామని అన్నారు. ఈ హామీ చూసి నవ్వాలో.. ఏడ్వాలో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. ఉన్న రైల్వేలైన్‌నే ఖతం చేసి ఇప్పుడు జమ్మికుంట రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తామని అంటున్నారని విమర్శించారు.కరీంనగర్ – వరంగల్, జమ్మికుంట, హుజూరాబాద్‌కు మంజూరైన రైల్వేలైన్‌ను గాయబ్ చేశారన్నారు. నిరుద్యోగులకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి.. ఇప్పటివరకూ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలిస్తామంటూ ఊదరగొడుతున్నారని మండిపడ్డారు.
ముందు ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఏడేళ్లకు 14 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయో తరుణ్‌చుగ్ చెప్పాలని డిమాండ్ చేశారు. మూడు వేల రూపాయల పింఛన్ ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టారని, గుజరాత్ రాష్ట్రంలో అంత మొత్తం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీజేపీ గెలిస్తే ఈటల రాజేందర్‌కు మాత్రమే లాభమని, అదే గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలిస్తే హుజూరాబాద్ మొత్తానికి లాభమని తెలిపారు. హుజూరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానేనని మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు.