– పోరాడితేనే ఫలితం
– సునీల్ నోటిదురుసుతో తగ్గిన టీడీపీ ఓట్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఒక విజయం అనేక పాఠాలు నేర్పుతుంది. బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో వైసీపీ ప్రధాన ప్రత్యర్థి బీజేపీదీ అదే పరిస్థితి. అసలు పోలింగ్ బూత్ ఏజంట్లకే దిక్కులేని బీజేపీ, చచ్చీ చెడీ పాత టీడీపీ నేతల శ్రమతో దక్కించుకున్న కష్టాన్ని కూడా, సద్వినియోగం చేసుకోలేని దిక్కుమాలిన దుస్థితి ఆ పార్టీ నాయకత్వానిది. యుద్ధానికి వెళ్లే సేనాధిపతి వీరుడయితే, సైనికుల్లో కూడా సమరోత్సాహం ఉంటుంది. చావో రేవో తేల్చుకునే బాపతు లీడరు ఉంటే, క్యాడరులోనూ ఉత్సాహం ఉంటుంది. కానీ బీజేపీ నాయకత్వానిది, ‘ఏడుపు మొహం ఈడుపు కాళ్లు.. ఆయనే ప్రతాప హనుమయ్య’ అన్న చందంగా ఉంటే.. తిరుపతిలోనే కాదు, బద్వేలులోనూ ఫలితాలు ఇలాగే ఉంటాయి.
బద్వేలు ఉప ఎన్నికలో అధికార వైసీపీ అభ్యర్ధి డాక్టర్ సుధ, తన పార్టీ అధినేత జగన్ గత రికార్డునూ తిరగరాయడం సాంకేతికంగా గొప్ప విషయమే. కానీ ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి టీడీపీ లేకుండా.. క్యాడర్ బలం లేని బీజేపీ-కాంగ్రెస్‌తో జరిగిన చిన్నపాటి యుద్ధంలో కూడా.. డజన్ల సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతోపాటు, కులనాయకులనూ మోహరింపచేసిన బద్వేలు బరిలో, వైసీపీ విజయం సాధించడం నైతికంగా పెద్ద అద్భుతమేమీ కాదు.
పోలింగ్ ఏజెంట్లకే దిక్కులేని బీజేపీ-కాంగ్రెస్‌కే జనం మొత్తంగా 31 వేలు ఓట్లు వేశారంటే, ఇక ప్రధాన రాజకీయ పార్టీ అయిన టీడీపీ బరిలో ఉంటే, ఇంకెన్ని ఓట్లు వేసేవారో ఊహించుకోవడం పెద్ద కష్టం కాదు. పోలయిన ఓట్లలో 60 శాతం దొంగఓట్లే నిండిపోయాయన్నది బీజేపీ-కాంగ్రెస్ నేతల ఆరోపణ కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఉండలేం. ఎందుకంటే అది కడప జిల్లా కాబట్టి. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలోనే దొంగఓటర్లు వెల్లువెత్తిన వైనం చూసిన వారికి, జగన్ అభిమానస్తుల ఖిల్లా అయిన కడపలో, అలాంటి దృశ్యాలుండవనుకున్న వారు అమాయకుల కిందే లెక్క. సరే.. ‘సీఎం సొంత జిల్లాలో వైసీపీకి అంతులేని ప్రజాదరణ ఉందన్న ప్రచారంలో పసలేదని బద్వేలు ఫలితం స్పష్టం చేసింది. చివరకు 60 వేల దొంగఓట్లే వైసీపీని కాపాడాయి. బీజేపీ వైసీపీని నైతికంగా ఓడించింద’ని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. ఏదేమైనా విజయం విజయమే. అభినందనలకు వైసీపీ అభ్యర్ధి సుధ అర్హురాలు.
అయితే.. ఈ ఎన్నికలో ఒంటరిగానే బరిలోకి దిగిన బీజేపీ 21621ఓట్లు సాధించడం అక్కడి పరిస్థితి, ఇప్పటి పరిణామాల ప్రకారమయితే అద్భుతం కిందే లెక్క. పోలింగ్ బూత్ ఏజెంట్లు కూడా కూర్చునే వీలులేని, బీజేపీ దయనీయ పరిస్థితిని స్థానిక టీడీపీ నేతలే కాపాడారు. సాధారణంగా టీడీపీ కూడా బరిలో ఉంటే, బీజేపీకి వెయ్యి ఓట్లు రావడం కూడా దుర్లభమే. గత రెండు ఎన్నికల్లో ఆ పార్టీకి మొత్తం 2 వేలు కూడా రాకపోవడాన్ని విస్మరించలేం. కానీ టీడీపీ పోటీ చేయకపోవడం బీజేపీకి మేలు చేసినట్టయింది. దానితో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఏబీవీపీలో చురుకుగా పనిచేసిన సురేష్‌ను అభ్యర్థిపై తెరపైకి తెచ్చి, మంత్రాంగం నడిపారు. సమర్ధవంతంగా సమన్వయం చేశారు. టీడీపీలో పనిచేసి బీజేపీలో చేరిన ఎంపీ సీఎం రమేష్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పోల్ మేనేజ్‌మెంట్‌లో తమ శక్తియుక్తులన్నీ ధారపోశారు. వారి పలుకుబడికి స్థానిక టీడీపీ శ్రేణులు కూడా ప్రభావితులయ్యారు.
సునీల్ దియోధర్, సోము వీర్రాజు, పురంధీశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్‌తోపాటు చివరలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు వంటి ఫైర్‌బ్రాండ్ కూడా ప్రచారంలో నిలిచారు. సరే.. యధావిధిగా సోము, సునీల్, విష్ణు త్రయం ప్రకటనల వర్షం కురిపించింది. అభ్యర్ధి ఏబీవీపీ నేత కావడంతో, రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్ధి సైన్యం తరలివచ్చి, శ్రమదానం చేసింది. అందుకే.. బద్వేలులో నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేని బీజేపీ, ప్రచారంలో వైసీపీకి పెద్ద సవాలే విసరగలిగింది. అంతవరకూ బీజేపీ పెద్ద విజయం సాధించినట్లే లెక్క.
అయితే ప్రచార సమయంలో బీజేపీ రాష్ట్ర సహ ఇన్చార్జి సునీల్ దియోథర్, రెండుసార్లు చేసిన వ్యాఖ్యలే కమలం కొంప మరింత ముంచినట్టయింది. ఒకసారి టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారినుద్దేశించి.. బీజేపీ పార్టీ టీడీపీకి ఎల్లోస్నేక్స్‌కు పార్కింగ్ ప్లేస్ కాదని చేసిన వ్యాఖ్యలు, బీజేపీలోని పాత టీడీపీ నేతలను మనస్థాపానికి గురిచేశాయి. ఇక సరిగ్గా పోలింగ్ ముందు తాము టీడీపీతో పొత్తు పెట్టుకునేది లేదని సునీల్-జీవీఎల్ వ్యాఖ్యానిస్తే.. ఆ మాట చెప్పడానికి సునీల్, జీవీఎల్ ఎవరంటూ ఎంపీ సీఎం రమేష్ ఘూటుగా ఇచ్చిన కౌంటర్, బీజేపీ కోసం అప్పటివరకూ క్షేత్రస్థాయిలో సీరియస్‌గా పనిచేస్తున్న టీడీపీ వారిలో గందరగోళానికి కారణమయ్యాయి. సోము-సునీల్ రాజకీయ అనుభవ రాహిత్యం ఫలితంగా, టీడీపీ నుంచి 30 నుంచి 40 వేల వరకూ రావల్సిన తమ ఓట్లను దెబ్బతీశాయన్నది కమలనేతల విశ్లేషణ.
నిజానికి బద్వేలులో జనసేన పోటీ చేస్తే విజయం సాధించకపోయినా, పోటీ తీవ్రంగా ఉండేదన్నది బీజేపీ-జనసేన నేతల ఉమ్మడి మనోగతం. కానీ జనసేనను డీల్ చేయడం-ఆ పార్టీ అగ్రనేతలతో డైలాగు వేయడంలో సొము-సునీల్ విఫలమయినందుకే, జనసేన తెలివిగా తప్పించుకుందన్నది బీజేపీ నేతలు చెబుతున్న మరో రహస్యం. గతంలో ఒక రాజకీయ పార్టీతో డీల్ చేసిన అనుభవం లేని ఆ ఇద్దరినీ.. ఈ ఉప ఎన్నికలో సాధ్యమయినంత మేరకు తప్పించి, సీఎం రమేష్ లాంటి నేతలు వారిని భోజనాలు-టిఫిన్లకే పరిమితం చేయడం వల్లే, 21 వేల ఓట్లయినా వచ్చాయన్నది కమలదళాల టాక్.
ఎన్నికలో గెలవకపోయినా.. గౌరవప్రదమైన ఓట్లు తెచ్చుకునేందుకు ఉన్న అన్ని మార్గాలూ అన్వేషించడం, రాజకీయపార్టీలు చేసే తెలివైన పని. అందుకు అవసరమైతే ఎవరిమద్దతయినా తీసుకోకతప్పదు. అన్ని పార్టీలూ రౌడీ షీటర్లు, నేరచరితులను విడిరోజుల్లో అయితే దూరం పెడతాయి. కానీ ఎన్నికల సమయంలో మాత్రం, వారి సాయం కూడా పోటీపడి మరీ తీసుకుంటాయి. అలాగే బద్వేలు ఉప ఎన్నికకు దూరంగా ఉన్న టీడీపీ సాయం తీసుకోవాలని.. బీజేపీ సూతప్రాయ నిర్ణయానికి వచ్చినప్పుడు, కనీసం ఎన్నిక ముగిసే వరకయినా ఆ పార్టీకి కోపం రాకుండా చూసుకోవడం, బుర్ర బుద్ధి ఉన్న ఎవరైనా చేసేదే. సాయం చేసేవాడు తీరా ఆఖరి నిమిషంలో కాడి కిందపడేస్తే, అందుకు మూల్యం చెల్లించుకోవలసింది సాయం తీసుకునే పార్టీనే. బీజేపీ రాష్ట్ర నాయకత్వం.. ముఖ్యంగా సునీల్ దియోధర్-సోము వీర్రాజుకు ఆపాటి తెలివి కూడా లేకపోవడమే కమలదళాలను ఆశ్చర్యపరిచే అంశం.
ముసుగులో గుద్దులాటలు లేకుండా చెప్పాలంటే.. బీజేపీ ఏదో ఒక స్థాయిలో సాయం కోరి ఉంటే టీడీపీ కచ్చితంగా ప్రచారాన్ని తన భుజంపై వేసుకునేదే. ఇప్పుడు ఆ పార్టీ ఉన్న రాజకీయ అనివార్య పరిస్థితి అది. బీజేపీ రథసారధులయిన మోదీ-అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోసం, చంద్రబాబు చాలాకాలం నుంచి వేచి చూస్తున్నారు. విశాఖ సహా అనేక జాతీయ అంశాల్లో బీజేపీ జోలికి వెళ్లకుండా, పాటిజివ్ సిగ్నల్స్ పంపిస్తున్నారు. అంటే టీడీపీ రాజకీయంగా మళ్లీ బీజేపీతో వియ్యం కోరుకుంటోందని సులభంగా అర్ధమవుతోంది. దాన్ని ఢిల్లీ పార్టీ అంగీకరిస్తుందా లేదా అన్నది వేరే అంశం. ఈ పరిస్థితిలో బీజేపీ అగ్రనేతలు కాకితో కబురంపినా, కాగల కార్యం తెలుగు సైనికులు కానిచ్చేవారన్నది నిష్ఠుర సత్యం.
ఎలాగూ ఉప ఎన్నికలో తనకు బలం లేదని తెలిసిన బీజేపీ, నోటిఫికేషన్ తర్వాత టీడీపీ సాయం తీసుకోవాలని స్థానిక స్థాయిలో భావించింది. అదేదో టీడీపీ తాను ఎన్నిక బరిలో లేనని ప్రకటించిన తర్వాతయినా రంగంలోకి దిగి ఆ పార్టీ సాయం కోరి ఉంటే, బీజేపీ కనీసం 40 నుంచి 50 వేల ఓట్లు వచ్చేవని తాజాగా వచ్చిన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. స్థానిక సంస్థలు, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ఘోర పరాజయం పాలయినప్పటికీ, బీజేపీ ఇంకా గుణపాఠం నేర్చుకోలేదన్నది తాజా బద్వేలు ఫలితంతో స్పష్టమయింది.