– ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాలపై విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేయాలి – ప్రాస్మా
ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ప్రైవేటు రికగ్నైజ్డ్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ప్రాస్మా) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని శంకరన్ హాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఎయిడెడ్ పాఠశాలల కరస్పాండెంట్ల సమావేశంలో ప్రాస్మా రాష్ట్ర నాయకులు పాల్గొని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాలుగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా నేడు ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్దులు లేరంటే మూసివేసే ప్రయత్నం చేయడం సమంజసం కాదని అన్నారు.
వందల సంఖ్యలో విద్యార్దులు ఒకరిద్దరు మాత్రమే ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలల్లో కూడా నేటికి పోస్టుల భర్తీ చేయకుండా ప్రభుత్వం ఈ విధంగా నిందలు వేయడం న్యాయం కాదని తెలిపారు. ఓ పక్కన ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టి ఎయిడెడ్ పాఠశాలలను తెలుగు మీడియంకు పరిమితం చేయడం కూడా బాధకారమని పేర్కొన్నారు. ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యాబోధన ఎంతో బాగుంటుంది కాబట్టే విద్యార్దులు వారి తల్లిదండ్రులు ఎయిడెడ్ పాఠశాలలను కొనసాగనివ్వాలని కోరుతున్నారని తెలిపారు.
ఎయిడెడ్ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేయాలని తక్షణమే భారీ సంఖ్యలో విద్యార్దులు ఉన్న పాఠశాలల్లో ఎయిడెడ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మొహనరెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేప్పినట్లుగా విల్లింగ్ ఇచ్చి తిరిగి విల్లింగ్ను వెనక్కు తీసుకునే పాఠశాలలను అనుమతించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మొహనరెడ్డి ప్రకటనను అనుసరించి విద్యాశాఖ అధికారులు వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని విజ్ఞప్తి చేశారు.
గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి విల్లింగ్ వెనక్కు తీసుకోవచ్చని చెప్పినా మండల విద్యాశాఖ అధికారులు ఆ ఆదేశాలను అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీఓ ఎమ్ ఎస్ నంబరు 50 రద్దు చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ రాజకుమారికి ప్రాస్మా రాష్ట్ర నాయకులు మైలా అంజయ్య, దాసరి వెంకట సుబ్బారావు, మల్లిఖార్జునరావు, యుగంధర్, ఆర్ సి ఎమ్ పాఠశాలల అధినేత బిషప్ బాలస్వామి తదితరులు వినతి పత్రాన్ని అందజేశారు.