– తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ
దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘనవిజయాన్ని అందించిన దర్శి నగర పంచాయతీ ఓటర్లకు తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు, ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దర్శి లో తెలుగుదేశం పార్టీ విజయం ప్రజా విజయమని అన్నారు.
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగితే దర్శి ఎన్నికల ఫలితాలే రాష్ట్రం మొత్తం వచ్చేవని నూకసాని అన్నారు. అధికారులను ప్రలోభపెట్టి, పోలీసుల అండతో దొంగ ఓట్లు వేసుకొని ఇప్పటి వరకు గెలిచారని నూకసాని విమర్శించారు. వైసీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గెలిపించాయని వైసిపి నాయకులు అంటున్నారని, వైసిపి కొత్తగా ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదని, తెలుగుదేశం పార్టీ అమలు పరచిన పథకాల కే పేరు మార్చి కొనసాగిస్తుందని నూకసాని విమర్శించారు. ఎన్నికల ప్రచార ఆర్భాటం కోసం రూపొందించిన పథకాలు తప్ప ప్రజలకు ఉపయోగపడేవి కాదని విమర్శించారు. ఆర్బాటంగా 56 బీసీ కార్పోరేషన్లు ఏర్పాటు చేశారని, ఒక్క కార్పొరేషన్ ద్వారా, ఒక్కరికి కూడా లోన్లు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా లేకపోవడంతో కళాశాలలు మూత వేసే పరిస్థితి ఏర్పడిందని, విద్యార్థులకు హాస్టల్ కి చెల్లించాల్సిన సొమ్ము మొత్తాన్ని తీసేసి, వసతి దీవెన పేరుతో తక్కువగా ఇవ్వడం వల్ల హాస్టల్ మూసివేసే పరిస్థితి ఏర్పడిందని, తద్వారా బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎంతో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో విద్యార్థుల హాస్టల్ లో ఉన్న వసతులు ఇప్పుడు ఉన్నాయా? అని నూకసాని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయల పెన్షన్ ని ₹2000 చేశారని, మీరు అధికారంలోకి వచ్చాక కేవలం 250 రూపాయలు మాత్రమే పెంచారని, మీరు ఇస్తానన్న ₹3000 పెన్షన్ ఎక్కడ అని నూకసాని నిలదీశారు. దర్శి లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడానికి సహకరించిన జిల్లా అధికారులకు నూకసాని బాలాజీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గ ఇన్చార్జి లకు నూకసాని బాలాజీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. దర్శి ఓటర్లు రాష్ట్ర భవిష్యత్తును ముందుగానే అంచనా వేశారని ధర్మం వైపు నిలబడ్డారని ప్రశంసించారు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతం కావడానికి ఈ ఎన్నికలే నాంది అని, 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం తథ్యమని దర్శి ఓటర్లు ముందుగానే పసిగట్టారు అని అన్నారు. తెలుగుదేశం పార్టీ గెలుపు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని అని నూకసాని బాలాజీ అన్నారు.