గుంటూరు : మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. కోవిడ్ కారణంగా చనిపోయిన కార్యకర్తల, స్థానికుల ఇళ్లకు వెళ్లి లోకేష్ పరామర్శించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలతో మాటామంతి నిర్వహించారు. ప్రభుత్వ విధానాలు, ప్రజల అవస్థలపై జనంతో చర్చించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ‘‘శాసనసభలో మా తల్లిని అవమానించారు. మా తల్లిపై చేసిన వ్యాఖ్యల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును ప్రవేశ పెట్టారు. సమస్యల సుడిగుండం లాగా ఆంధ్రప్రదేశ్ ఉంది. వివిధ శాఖల్లో పెంచిన పన్నులు ప్రభుత్వం తగ్గించాలి. ఏపీలో ఎటు చూసినా సమస్యలే. ఒక సమస్య కోసం పోరాడితే ఇంకో సమస్య తీసుకువస్తుంది.
ఈ ప్రభుత్వం అమ్మఒడి, పెన్షన్లు అందరికీ అందడం లేదు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. సీఎం సొంత జిల్లా లో వరద బాధితులను ఇప్పటి వరకు పరామర్శించలేదు. శాసన మండలి రద్దు, ఉపసంహరణపై రోజుకో మాట చెప్పడం సీఎంకు అలవాటుగా మారింది. అందుకే జగన్‌ను ప్రజలు తుగ్లక్ సీఎం అంటున్నారు. హుద్‌హుద్ తుఫాను సమయంలో 24 గంటల్లోనే బాధితులకు చంద్రబాబు సహాయం చేశారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అహంకారంతో ఉన్నారు. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు చేశారని.. ఏపీలో ఇక్కడ జగన్ చేయడం తుగ్లక్ పాలనకు నిదర్శనం’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.