– పైరవీలు చేయడానికే ఆఫ్ లైన్ అవకాశమా
– బదిలీలు హేతుబద్ధంగా చేపట్టండి
-తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క
సాధారణ బదిలీలకు నెలల తరబడి టైం ఇచ్చే సర్కారు లక్ష మందికి పైగా టీచర్ల భవిష్యత్తుకు సంబంధించిన ఈ వ్యవహారాన్ని పది పదిహేను రోజుల్లోనే పూర్తి చేయాలని తొందర పడటం వెనక ఆంతర్యమేమిటని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీచర్ల బదిలీ లను ఇష్టారాజ్యంగా కాకుండా హేతుబద్ధంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయ సంఘాల నాయకులను పిలిపించి, వారితో చర్చించి, వారి ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని అందుకు అనుగుణంగా జీవో తీసుకొచ్చి బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఆగమేఘాల మీద బదిలీలను చేపట్టడం వల్ల ఉపాధ్యాయులు తీవ్ర గందరగోళం అయోమయంలో ఉన్నారని వివరించారు. తెలంగాణ ఉద్యమం స్థానికత అంశం మీద జరిగిందన్న విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకోవాలని సూచించారు.
నూతన జిల్లాలకు ఉద్యోగుల, ఉపాధ్యాయుల కేటాయించే విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా ఆగమేఘాల మీద ప్రభుత్వం 317 జీవో జారీచేయడం అసంబద్ధంగా ఉందని అన్నారు. ఉపాధ్యాయులను నూతన జిల్లాలకు కేటాయించే విషయంలో ఎక్కడా కూడా స్థానికతను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టే పరిస్థితి సీఎం కేసీఆర్ తీసుకువస్తున్నారని అన్నారు.
కరోనా నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండుమార్లు లాక్ డౌన్ విధించడం వల్ల పాఠశాలలను మూసివేయడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడిప్పుడే విద్యార్థులు చదువు బాట పడుతున్న క్రమంలో ప్రభుత్వం విద్యా సంవత్సరం మధ్యలో అనాలోచితంగా ఉపాధ్యాయుల ఆకాంక్షలకు విరుద్ధంగా బదిలీల ప్రక్రియ చేపట్టడం వల్ల ఉపాధ్యాయులు ఆందోళనకు దిగితే విద్యార్థులకు ఈ ఏడు కూడా నష్టం జరిగే అవకాశం కనిపిస్తున్నది.
సీనియారిటీ లిస్టులు ప్రకటించకుండా టీచర్ల నుంచి బలవంతంగా ఆప్షన్ ఫారాలను తీసుకున్నారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నట్లు చెప్పారు. ఆప్షన్లు పెట్టినరెండు, మూడు రోజులకు సీని యారిటీ లిస్టుల డ్రాఫ్టులను డీఈఓలు రిలీజ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. కనీసం లిస్టులు ప్రకటించిన తర్వాత ఎడిట్ ఆప్షన్లకు కూడా చాన్స్ ఇవ్వకుండా తొందర పెట్టడం సరికాదని సూచించారు.
కొత్త జిల్లాల అలకేషన్ పై స్పష్టమైన గైడ్ లైన్స్ ఇవ్వాలన్నారు. కొత్త జిల్లాలకు అలాటైన వెంటనే, ఆ టీచర్లను స్కూళ్లకు కేటాయిస్తారా..? లేక, ఈ అకడమిక్ ఇయర్ పూర్తయ్యే వరకూ పాత జిల్లాల్లోనే కొనసాగిస్తారా..? అనేదానిపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాల్లోనే అలాటైతే వారిని పాత స్కూల్లోనే కొన సాగిస్తారా..? లేక కొత్త స్కూల్ కు పంపిస్తారా..? అనే అనుమానాలు టీచర్లను వెంటాడుతు నందున ప్రభుత్వం వాటిపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
భార్య భర్తలు ఇద్దరు ఉపాధ్యాయులు అయితే వారిని ఒకే చోట ఉద్యోగ అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. జివైనల్ డయాబెటిక్ పిల్లలున్నా ఉపాధ్యాయులను జిల్లా హెడ్ క్వార్టర్ లోనే పని చేసే అవకాశం కల్పించాలని లేకుంటే వైద్య పరంగా వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు.
ఆన్ లైన్ లో బదిలీలు చేపట్టాలి
ఉపాధ్యాయుల బదిలీలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఆన్లైన్లో చేపడతామని ప్రకటించి ఆఫ్ లైన్ లోకి మార్చడం పైరవీలకు ఆస్కారం ఇవ్వడమేనని అన్నారు. పైరవీలు చేసుకోవడానికి అవకాశం ప్రభుత్వమే కల్పించడం సిగ్గు చేటన్నారు.