Suryaa.co.in

National

ఓటరు కార్డుతో ఆధార్‌ లింక్‌.. కీలక బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

దిల్లీ: దేశంలోని ఎన్నికల ప్రక్రియలో కీలక సంస్కరణల బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫారసుల మేరకు పలు సంస్కరణలకు బుధవారం పచ్చజెండా ఊపింది. ఓటర్ల జాబితాను బలోపేతం చేయడం, ఓటింగ్‌ ప్రక్రియను మరింత మెరుగుపరచడం, ఈసీకి మరిన్ని అధికారాలు కల్పించడంతో పాటు బోగస్‌ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా పలు ప్రతిపాదనలతో కూడిన బిల్లుకు బుధవారం ఆమోద ముద్రవేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం.
పాన్-ఆధార్ లింక్ చేసినట్లు గానే, ఓటర్‌ ఐడీ లేదా ఎలక్టోరల్‌ కార్డుతో ఆధార్‌ నంబర్‌ను అనుసంధానం చేయనున్నారు. కాకపోతే వ్యక్తిగత గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకొని వ్యక్తుల స్వచ్ఛంద ప్రాతిపదికన ఈ ప్రక్రియను చేపట్టనున్నట్టు సమాచారం. అలాగే, కొత్త ఓటర్లుగా నమోదు చేయించుకొనేవారికి ఏడాదిలో నాలుగు సార్లు అవకాశం కల్పించే మరో ప్రతిపాదనకు కూడా కేంద్ర కేబినెట్‌ ఓకే చెప్పింది.
ఏటా జనవరి 1 నాటికి 18 ఏళ్లు దాటితేనే ఓటరుగా నమోదుకు అనుమతించనున్నారు. అలాగే ఏడాదిలో నాలుగుసార్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకొనే వెసులుబాటు కలగనుంది. ఇందుకోసం ఏటా నాలుగు వేర్వేరు కటాఫ్‌ తేదీలు కేటాయిస్తారు. ఇప్పటివరకు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉంది. రక్షణ సిబ్బంది ఓటు వేసే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
సర్వీసు అధికారుల విషయంలో గతంలో ఉన్న నిబంధనల్ని సడలించింది. దంపతులిద్దరూ ఓటు హక్కు వినియోగించుకొనేలా బిల్లులో మార్పులు చేసింది. ఎన్నికలు నిర్వహించే ప్రాంగణాల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘానికే పూర్తి అధికారాలు అప్పగిస్తూ మరో సవరణ చేసినట్టు సమాచారం.

LEAVE A RESPONSE